‘సీతారామ’ వేగం పెంచాలి

Sitarama Project Works Going Speed In Khammam - Sakshi

భూనిర్వాసిత రైతులకు పరిహారం అందించాలి

పనుల నిర్వహణకు రూ.11వేల కోట్ల నిధుల సేకరణపై స్పష్టత

వర్క్‌ ఏజెన్సీలతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌  

బూర్గంపాడు: ‘సీతారామ’ ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ప్రాజెక్ట్‌ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం శనివారం ఆయన ప్రగతిభవన్‌లో ఇంజనీరింగ్‌ అధికారులతో సీతారామ ప్రాజెక్ట్‌ పనుల పురోగతిపై సమీక్షించారు. పనుల్లో వేగం పెంచేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులకు లైన్‌ క్లియర్‌ అయిందని తెలిపారు.

పనుల నిర్వహణకు రూ.11వేల కోట్ల నిధుల సేకరణ కూడా పూర్తయిందని స్పష్టం చేశారు. పనుల వేగాన్ని పెంచి అనుకున్న సమయానికి పొలాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఎలాంటి ఆలసత్వం, నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పనులు నిర్వహిస్తున్న వర్క్‌ ఏజెన్సీలతో కూడా తాను స్వయంగా మాట్లాడుతానని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌పై సీఎం ప్రత్యేక దృష్టి సారించటంతో అధికారులు, కాంట్రాక్టర్లలో ఉరుకులు, పరుగులు మొదలయ్యాయి.  

ఉమ్మడి జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు..    
సీతారామ ప్రాజెక్ట్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందుకు గాను ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి, కాలువలకు మొత్తంగా 21 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే పట్టాభూముల సేకరణ ప్రక్రియ పూర్తయింది. ఇక అసైన్డ్‌ భూములు, ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. దీన్ని త్వరితగతిన పూర్తిచేసి భూనిర్వాసిత రైతులకు వెంటనే పరిహారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటితో పాటు 3800 ఎకరాల అటవీ భూములను కూడా ఈ ప్రాజెక్ట్‌ కోసం సేకరించాల్సి ఉంది. ఇందుకు కేంద్రప్రభుత్వ పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా మారాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన పర్యావరణ అనుమతుల మదింపు కమిటీ సమావేశంలో సీతారామ ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇక కేంద్రప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు జారీ చేయటం లాంచనంగా మారింది. ఇప్పటికే కేంద్రం భూసేకరణ, అటవీ, వన్యప్రాణి సంరక్షణ అనుమతులు మంజూరు చేసింది.

దీంతో ఇప్పటి వరకు నెమ్మదిగా సాగిన పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. గత వర్షాకాలంలో సీతారామ కాలువల్లోకి నీరు చేరటంతో పనుల నిర్వహణకు ఒకింత ఇబ్బందులు ఎదురయ్యాయి. మళ్లీ వర్షాకాలం నాటికి కాలువ పనులను పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. భూసేకరణ, పనుల నిర్వహణలో ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. ప్రాజెక్ట్‌ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు తాను నివేదికలను పరిశీలించటంతో పాటు పనులతీరును స్వయంగా పరిశీలిస్తానని ఇంజనీరింగ్‌ అధికారులకు తెలిపారు. పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, అభ్యంతరాలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ పరిణామాలతో సీతారామ ప్రాజెక్ట్‌ పనులు వేగవంతమయ్యేలా కనిపిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top