
ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఆర్డీవో చెన్నయ్య
ఇల్లందకుంట(హుజూరాబాద్): అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో ఈనెల 24నుంచి ప్రారంభం కానున్న సీతారాముల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను హుజూరాబాద్ ఆర్డీవో చెన్నయ్య పరిశీలించారు. ఇల్లందకుంటలోని కల్యాణ మండపం, అన్నదానం, భక్తుల క్యూలైన్లతోపాటు వాహనాల పార్కింగ్, పలు అంశాల గురించి అధికారులనడిగి తెలుసుకున్నారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కల్యాణం మొదలుకొని పెద్ద రథోత్సవం ముగిసేవరకు అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. తహసీల్దార్లు రమేశ్, బావ్‌సింగ్, ఆలయ కమిటీ చైర్మన్ ఎక్కటి సంజీవరెడ్డి, నిర్వహణాధికారి రాజ్‌కుమార్, ఎస్సై నరేష్‌కుమార్, ధర్మకర్తలు పాల్గొన్నారు.