మహిళల భద్రతకు సై!

She Shuttles For Women IT Employees - Sakshi

ఐటీ కారిడార్‌లో ఉద్యోగినులకు మరింత భరోసా

‘షీ షటిల్స్‌’లో ఉచిత ప్రయాణం

‘సేఫ్‌ స్టే’ ప్రోగ్రాంతో మహిళా హాస్టళ్లలో పూర్తి భద్రత

ఐటీ కంపెనీల్లో వేధింపుల నియంత్రణకు ‘ఐసీసీ’

సైబరాబాద్‌ పరిధిలో మహిళా ఉద్యోగుల భద్రతకు పోలీసులు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐటీ కారిడార్‌లో వందలాది ఐటీ కంపెనీల్లో లక్షలాది మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి రక్షణ కోసం పలు చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) సహకారం తీసుకుంటున్నారు. ఉద్యోగులు షీ షటిల్స్‌లో ఉచితంగా ప్రయాణించొచ్చు.

సాక్షి, సిటీబ్యూరో:ఐటీ కారిడార్‌లో మహిళల భద్రతకు సైబరాబాద్‌ పోలీసులు అత్యంత ప్రాధా న్యం ఇస్తున్నారు. వందల సంఖ్యలో వెలసిన ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న నాలుగు లక్షల మంది మహిళలకు భరోసా కల్పించడమే కాకుండా, మహిళా హాస్టళ్లలో వారు సురక్షితంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు.ఇందుకుగాను సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) సహకారంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎస్‌సీఎస్‌సీ సంస్థ మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో ‘షీ ఎంపవర్‌’ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ సదస్సులో భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

సేఫ్‌ జర్నీ...
ఐటీ కారిడార్‌లోని వివిధ కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగిణులు కార్యాలయాలకు వెళ్లే సమయంలో బస్సుల్లో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ప్రత్యేకంగా షీ షటిల్‌ బస్సుల ద్వారా సేవలు అందిస్తున్నారు. మాదాపూర్, రాయదుర్గం, నార్సింగి, గచ్చిబౌలి ఠాణా పరిధిల్లో ఈ షీ షటిల్‌ బస్సులు నడుస్తున్నాయి.  బస్టాండ్‌లు, బహిరంగ ప్రాంతాల్లో ఆకతాయిల వేధింపులను అడ్డుకునేందుకు షీ బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి.

సేఫ్‌ స్టే...
ఐటీ కారిడార్‌లోని మహిళా హాస్టళ్లలో ఉంటున్న ఉద్యోగిణుల భద్రత కోసం గత ఐదేళ్లుగా ‘సేఫ్‌ స్టే’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ‘ఆయా హాస్టల్‌ నిర్వాహకులు తప్పనిసరిగా హాస్టల్స్‌ ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేక రిజిష్టర్‌ను మెయిన్‌టెయిన్‌ చేయాలి. వచ్చిపోయే సందర్శకుల వివరాలను కూడా  పొందుపరచాలి. వంటగాళ్లు, సెక్యూరిటీ గార్డుల పూర్తి వివరాలు తెలుసుకున్నాకే నియమించుకోవాలి. వీటితో పాటు హాస్టల్‌ నిర్వహణ కోసం పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల’నే నిబంధనలను పోలీసులు తప్పనిసరి చేసి భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఏ ఘటన జరిగినా పోలీసులకు కూడా సమాచారం అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పనిచేసే ప్రాంతంలో ‘సేఫ్‌’గా...
సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని  పది మంది, అంతకు మించి ఉద్యోగులు ఉన్న సంస్థల్లో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఐసీసీ) ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారించారు. ఎస్‌సీఎస్‌సీ సహకారంతో అన్ని సంస్థల్లో ఐసీసీలు నియమించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఐసీసీలో సగం మంది మహిళలే సభ్యులుగా ఉంటున్నారు. ఏదైనా ఎన్జీవో నుంచి ఒకరు న్యాయాధికారిగా ప్రాతినిథ్యం వహించేలా చొరవ తీసుకుంటున్నారు. పనిచేసే ప్రాంతంలో లైంగిక వేధింపులపై ఐసీసీకి ఫిర్యాదు చేసిన మూడు నెలల్లోగా పరిష్కారం చూపాలి. ఆ నిర్ణయం బాధితురాలికి సంతృప్తిగా లేకపోతే బాధితులు షీ బృందాలను ఆశ్రయించవచ్చు. ఇప్పటికే 34 పంస్థల్లో 110 మంది సభ్యులతో ఐసీసీలు పనిచేసేలా చొరవ తీసుకున్నారు. వీటితోపాటు మహిళల హక్కులు, చట్టాలపై వందల సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

భవిష్యత్‌లో మరిన్ని చర్యలు
ఎస్‌సీఎస్‌సీ సహకారంతో ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం. పనిచేసే ప్రాంతంతో పాటు బహిరంగ ప్రాంతాల్లోనూ నిర్భయంగా ఉండేలా పనిచేస్తున్నాం. మహిళ ఉద్యోగిణిల సేఫ్‌ జర్నీ కోసం షీ షటిల్‌ సర్వీసులు నడుపుతున్నాం. సంస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను బలోపేతం చేస్తున్నాం. మహిళా హాస్టళ్లలో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నాం. భవిష్యత్‌లోనూ మహిళల భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకుంటాం.         – వీసీ సజ్జనార్,    సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top