
సాక్షి, హైదరాబాద్: కళాశాల విద్యార్థుల ఉపకారవేతనాల పంపిణీకి సంక్షేమ శాఖలు కసరత్తు ప్రారంభించాయి. కోర్సు ముగిసేలోగా స్కాలర్ షిప్‌లు ఇవ్వాలని నిర్ణయించాయి. 2017–18 విద్యాసంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 13.28 లక్షలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని శాఖలవారీగా విభజించి.. ప్రత్యేకాధికారులను నియమించి దరఖాస్తుల పరీశీలన చేపట్టింది.
ముందుగా జనరల్ కోర్సులకు...
వృత్తి విద్యా కోర్సులు ఏప్రిల్ నెలాఖరులోగా ముగియనున్నాయి. ఈ క్రమంలో ముందుగా జనరల్ కోర్సుల విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించాలని అధికారులు భావిస్తున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థుల దరఖాస్తులను ముందుగా పరిశీలిస్తున్నారు. మొదటగా చివరి సంవత్సరం విద్యార్థులకు, ఆ తర్వాత జూనియర్లకు ఉపకారవేతనాలు ఇవ్వనున్నారు. పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలకు సంక్షేమ శాఖల వద్ద నిధులు అందుబాటులో ఉన్నాయి. మూడో త్రైమాసికంతోపాటు త్వరలో విడుదల కానున్న నాల్గో త్రైమాసికం నిధుల నుంచి వీటిని విడుదల చేసేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖతోపాటు గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలు స్కాలర్‌షిప్ క్లియరెన్స్ బిల్లులను తయారు చేస్తున్నారు. వచ్చేవారం నుంచి ఆయా బిల్లులను ఖజానా శాఖకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.