అన్నరాయని చెరువును కాపాడండి

Save Annarayani Cheruvu Rally In Nagaram - Sakshi

సాక్షి, నాగారం: తమ గ్రామంలోని అన్నరాయని చెరువును కాపాడాలంటూ మేడ్చల్‌ జిల్లా కీసర మండలం నాగారం వాసులు నినదించారు. ఆదివారం చక్రీపురం కూడలి నుంచి అన్నరాయని చెరువు వరకు ర్యాలీ నిర్వహించారు. నాగారం ఎస్వీ నగర్‌, విష్ణుపురి కాలనీ, సిద్ధార్థ కాలనీ వాసులు, పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చెరువును పరిరక్షించాలంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. చెరువును కాపాడాలంటూ నినదించారు.

పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంచినీళ్ల చెరువు కాస్తా కాలుష్య కాసారంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులోని గుర్రపు డెక్కను తొలగించి, డ్రైనేజీలను మూసీలోకి మళ్లించాలని ఎన్నో ఏళ్లుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. మరోపక్క ఆక్రమణలతో చెరువు కుంచించుకుపోతోందని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చెరువు మాయం కావడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండేళ్ల క్రితం మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా రూ.39.44 లక్షలతో అన్నరాయని చెరువు పునరుద్ధరణ, పూడికతీత పనులకు శంకుస్థాపన జరిగినా ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు మేలుకుని అన్నరాయని చెరువు పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని నాగారం గ్రామస్తులు కోరుతున్నారు. తమ  ఊరి చెరువు కోసం భవిష్యత్తులోని మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top