వస్తున్నాం.. లింగమయ్యా! | Sakshi
Sakshi News home page

వస్తున్నాం.. లింగమయ్యా!

Published Wed, Apr 1 2015 7:23 AM

వస్తున్నాం.. లింగమయ్యా!

- 2నుంచి 6 వరకు సలేశ్వరం ఉత్సవాలు

నల్లవుల దట్టమైన అడవి.. చుట్టూ ఎత్తైన కొండలు. మధ్యలో వెయ్యి అడుగుల లోతైన లోయలో కొలువైన సలేశ్వరం లింగమయ్యను దర్శనం చేసుకోవడం ఒక మహత్తర ఘట్టం. నిటారుగా ఉన్న కొండల మీదికి రాళ్లురప్పలతో కూడిన కాలిబాటలో గంటల తరబడి వెళ్లడం గొప్ప సాహసం. ‘వస్తున్నాం.. లింగమయ్య’ అంటూ సలేశ్వరుడి శరణు వేడుతూ ముందుకు సాగడం ఓ మధురానుభవం. రెండుకొండల మధ్య కృష్ణానది పాయలో వెలిసిన శివుడిని దర్శించుకోవడం మహాభాగ్యం..

అచ్చంపేట/లింగాల: భక్తిపారవశ్యంతో కదిలే భక్తులతో నల్లమల ప్రాంతం మూడురోజుల పాటు రావులింగేశ్వర స్వామి నామస్మరణతో మార్మోగుతుంది. ఏటా ఏప్రిల్ వూసం చైత్రపూర్ణిమ రోజున సలేశ్వరం లింగమయ్యను భక్తులు సందర్శించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ దర్శనం అత్యంత సాహసంతో కూడుకున్న పని. అత్యంత ప్రమాదభరితమైన కొండచరియుల మార్గంలో కేవలం పాదం మోపే స్థలంలో ప్రమాదాలను సైతం లెక్కచేయుకుండా వయోభేదం మరిచిదర్శనం చేసుకుని ధన్యులవుతారు.

ఇదీ ఇతిహాసం
ద్వాపరయుగంలో పాండవవనవాసంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం సలేశ్వరం కొండల నడువు తపస్సు చేసినట్లు ప్రతీతి. ప్రకృతి నుంచి దిగొచ్చిన చందంగా వందడుగుల ఎత్తు నుంచి గలగల పారే జలపాతం కనులపండువగా ఉంటుంది. నల్లమల అటవీప్రాంతంలో లింగవుయ్యు దర్శనం ఘట్టం సుమారు రెండొందల అడుగుల లోతున్న పదుననైన రాళ్లతో కూడిన గుట్టను దిగడంతో సలేశ్వర ప్రయాణం ప్రారంభమవుతుంది.


గుట్టను దిగిన తరువాత సుమారు ఐదొందల నుంచి ఆరొందల అడుగుల ఎత్తు ఉండే మరో గుట్టను దాటుకుంటూ ముందుకు సాగుతారు. సలేశ్వరం లింగమయ్యను దర్శించుకునేందుకు వెన్నెలనీడలో కూడా వేలాదివుంది భక్తులు ఈ కారడవిలో ప్రయాణిస్తారు. పూర్ణిమ రోజున లింగమయ్య దర్శనం ఉంటుంది. మూడురోజుల పాటు లక్షలాది మందితో నల్లమల అడవి తల్లి నిండుగా కనిపిస్తుంది. దాదాపు రెండొందుల అడుగుల ఎత్తు నుంచి జలపాతం గుండంలోకి చేరుతుంది. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ జలధార కూడా ఎక్కువతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ రమణీయ ఘట్టాన్ని చూసేందుకు భక్తులు తరలొస్తారు.


ఎలా వెళ్లాలి..
- సలేశ్వర క్షేత్రానికి వెళ్లడానికి రెండు మార్గాలున్నాయి.
- ఒకమార్గం.. అచ్చంపేట నుంచి మన్ననూరు, ఫరహాబాద్ ద్వారా రాంపూర్‌పెంట వరకు వెళ్లితే అక్కడినుంచి క్షేత్రం ఆరుకిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
- రెండోమార్గం.. బల్మూర్, లింగాల నుంచి అప్పారుపల్లి ద్వారా వెళ్లొచ్చు. ఈ మార్గంలో అధికసంఖ్యలో భక్తులు కాలినడకన బయలుదేరుతారు. ప్రయాణ సౌకర్యాలు భక్తుల రద్దీని గమనించిన అచ్చంపేట ఆర్టీసీ డిపో అధికారులు ప్రత్యేకబస్సులను నడుపుతున్నారు.
- అచ్చంపేట నుంచి ఫరహాబాద్ ద్వారా రాంపూర్‌పెంట వరకు, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, తెల్కపల్లి నుంచి లింగాల, అప్పాయిపల్లి వరకు ప్రతి అరగంటకు ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి.
- లింగాల నుంచి రూ.50, అచ్చంపేట రూ.100 ఒక్కొక్కరికీ చార్జీ అవుతుంది.

ప్రత్యేక ఏర్పాట్లు
సలేశ్వరంలో విద్యుత్ సౌకర్యం లేదు. మూడురోజుల పాటు జనరేటర్ల సాయంతో విద్యుత్‌బల్బులు వెలిగిస్తారు. మూడురోజుల పాటు ఇక్కడ వివిధ స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ఉచిత భోజన ఏర్పాట్లతో పాటు తాగునీటి వసతి కల్పిస్తాయి. అలాగే రెవెన్యూ శాఖ అధికారులు భక్తులకు ఉచితంగా తాగునీటి సౌకర్యం, జిల్లా వైద్యాధికారులు ప్రత్యేకవైద్య క్యాంపులు నిర్వహిస్తున్నారు.

సలేశ్వరం జాతరకు ప్రత్యేకబస్సులు
ఈనెల 2నుంచి 6వ తేదీ వరకు జరిగే సలేశ్వరం ఉత్సవాలకు అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేకబస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం వసూరాం నాయక్ తెలిపారు. అచ్చంపేట నుంచి సలేశ్వరానికి ప్రతి 20 నిమిషాలకు, తెల్కపల్లి నుంచి అప్పాయిపల్లి వరకు ప్రతి 30 నిమిషాలకు బస్సు సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకబస్సులు వేశామని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఆయన కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement