సవాళ్లే సోపానాలు కావాలి

Sai Pallavi Attends She Empower Summit in Hyderabad - Sakshi

విభిన్నరకాల నైపుణ్యాలున్న మహిళలను ప్రోత్సహించాలి

విమర్శల నుంచి నేర్చుకోవాల్సిందిఎంతో ఉంది

హైదరాబాద్‌ మహిళలకు సురక్షితమైన నగరం

‘షీ ఎం పవర్‌’ కార్యక్రమంలో డీఆర్‌డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్‌

టెక్నాలజీతో మహిళలకు భద్రత: స్వాతిలక్రా

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహిళలకు సురక్షితమైన నగరమని డీఆర్‌డీవో శాస్త్రవేత్త డాక్టర్‌ టెస్సీ థామస్‌ అన్నారు. 33 ఏళ్లుగా ఉన్న హైదరాబాద్‌లో ఉన్న తాను కొంతకాలం క్రితం బెంగళూరుకు వెళ్లానని, అక్కడికి ఇక్కడికి మహిళల భద్రతలో వ్యత్యాసాలను చూడగలిగానన్నారు.  సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సెల్‌ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్త ఆధ్వర్యంలో హైటెక్స్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో గురువారం నిర్వహించిన ‘షీ ఎం పవర్‌’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టెస్సీ థామస్‌ మాట్లాడుతూ... జనాభాలో మహిళలు 50 శాతం ఉన్నా దురదృష్టవశాత్తు ప్రపంచ సంపదలో ఒక శాతం వాటా మాత్రమే దక్కించుకున్నారన్నారు.

పురుషుల కంటే మహిళలు మెరుగ్గా రాణిస్తున్నా అన్ని రంగాల్లో సమానం కావడమనేది కలగానే మిగిలిందన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మహిళలు సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. మల్టీ టాస్కింగ్, పట్టుదల, అంకితభావం, సృజనాత్మకత, అభిరుచి, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ తదితర లక్షణాలను కలిగి ఉన్న మహిళలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ‘సవాళ్లనే అవకాశంగా మలచుకోవాలని, విమర్శల నుంచి నేర్చుకోవాలని, వాటిని అభివృద్ధికి బాటలు వేసే దిశగా మార్చుకోవాలన్నారు.’ తెలంగాణ ఉమెన్‌ అండ్‌ సేఫ్టీ విభాగం ఐజీ ఇన్‌చార్జ్‌ స్వాతిలక్రా మాట్లాడుతూ...చట్టాన్ని ఉల్లంఘించిన వారిని శిక్షించడంతో పాటు మార్పు తీసుకురావల్సిన అవసరముందన్నారు. మహిళల రక్షణకు షీ టీమ్స్‌ సేవలు విస్తరించడంతో పాటు భద్రత కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ...ఆరు లక్షలకుపైగా సీసీటీవీ కెమెరాలు ఉన్న భాగ్యనగరంలో పటిష్టమైన నిఘా వ్యవస్థ భద్రతకు భరోసా ఇంస్తుందన్నారు., సేఫ్‌ స్టే, మార్గదర్శక్, షీ షటిల్, బాలమిత్ర, భరోసా కేంద్రాల సేవలతో భద్రతపై మరింత నమ్మకం కల్పిస్తున్నామన్నారు. 

కుటుంబసభ్యుల్లా భావించాలి...
ఇంట్లో అక్క చెల్లెళ్లను గౌరవించినట్లుగానే వీధుల్లో వెళ్లే మహిళలను గౌరవించేలా బాలురను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిపైనే ఉందని సినీ నటి సాయిపల్లవి అన్నారు. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. మార్పు ఇంటి నుంచే రావాలని ఆమె పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటి మహిళా కమాండో ట్రైనర్‌ డాక్టర్‌ సీమారావు మాట్లాడుతూ...మన ప్రతి ఒక్కరిలో యోధుడు ఉన్నారన్నారు. ‘జీవితంలో ఏదైనా సాధించడానికి భార్యభర్తలకు పరస్పర సహకారం అవసరం. నా భర్త నాకు భర్త కంటే ఎక్కువ. అంటే జీవితంలో అంత ప్రాధాన్యం ఇస్తా. అయితే నేను మాత్రం తేలికైన పనులను ఎంచుకోకుండా జీవితంలో కష్టమైన పనులను చేయడానికే ఇష్టపడతాన’ని అన్నారు. అనంతరం మహిళల భద్రత, సాధికారత కోసం కృషి చేసిన కార్పొరేట్‌ సంస్థలకు సీపీ అవార్డులను ప్రదానం చేశారు. ఎస్‌సీఎస్‌సీ సహకారంతో సరికొత్త ఫీచర్లతో రూపొందించిన ‘షీ సేఫ్‌’ యాప్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్, సినీ దర్శకుడు రాజమౌళి, హీరోయిన్‌ రష్మికా మండోనా, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, సోషల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఎండీ డాక్టర్‌ రజనాకుమారి, సైబరాబాద్‌ ఉమెన్‌ అండ్‌ సేఫ్టీ డీసీపీ అనసూయ, ఎస్‌సీఎస్‌సీవైస్‌ చైర్మన్‌ భరణి, ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల, జాయింట్‌ సెక్రటరీ ప్రత్యూష శర్మ, షీ టీమ్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీత పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top