ఆర్టీసీకి  సన్‌స్ట్రోక్‌..!

RTC In Huge Troubles With Summer Effect - Sakshi

వేడిని తట్టుకోలేక డబుల్‌డ్యూటీకి నిరాకరిస్తున్న డ్రైవర్లు

డిపోలకే కొన్ని సర్వీసులు పరిమితం

నగరంలో నిత్యం వేయిమంది డ్రైవర్లు గైర్హాజరు  

సాక్షి, హైదరాబాద్‌: నష్టాల ఆర్టీసీకి కష్టాలు వచ్చిపడ్డాయి. ఎండలు ముదురుతుండటంతో ఆర్టీసీలో కొత్త సమస్య ఏర్పడింది. డ్రైవర్ల కొరతతో నిత్యం కొన్నిబస్సులు డిపోలకే పరిమితమవుతుండగా, తాజాగా ఎండవేడి భరించలేక డ్రైవర్లు డబుల్‌ డ్యూటీకి నిరాకరిస్తున్నారు. దీంతో డిపోల్లో నిలిచిపోతున్న బస్సుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా అర్ధంతరంగా కొన్ని ట్రిప్పులను రద్దు చేయాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నెలాఖరుకల్లా ఎండ తీవ్రత మరింత పెరగనుండటంతో సమస్య ఎక్కువకానుంది. ఆర్టీసీలో ఆరేళ్లుగా డ్రైవర్ల నియామకం లేదు. పదవీవిరమణ అవుతున్నవారు, మృత్యువాత పడుతున్న వారు, అనారోగ్యం ఇతర కారణాలతో దీర్ఘకాలిక సెలవుల్లో వెళుతున్నవారు... వెరసి ప్రస్తుతం ఆర్టీసీలో  రెండువేల మంది డ్రైవర్ల కొరత ఏర్పడింది. దీంతో అప్పటికప్పుడు డిపో అధికారులు అందుబాటులో ఉన్న డ్రైవర్లను బతిమిలాడి డబుల్‌ డ్యూటీలకు పంపుతున్నారు.  తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది పెద్ద సమస్యగా మారింది.
 
ఫైర్‌ సర్వీసెస్‌కు 200 మంది డ్రైవర్లు... 
డ్రైవర్ల కొరత హైదరాబాద్‌ నగరంలో మరింత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం నగరంలో దాదాపు 700 డ్రైవర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనారోగ్యం, ఇతర సమస్యలతో కొందరు డ్యూటీలకు హాజరుకావటం లేదు. వెరసి నిత్యం వేయిమంది వరకు డ్రైవర్లు విధులకు రావటం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో నిత్యం 20 శాతం మేర సర్వీసులు డిపోలకు పరిమితమవుతున్నాయి. ఇటీవల అద్దెబస్సుల సంఖ్య బాగా పెంచటంతో సమస్య కొంత తగ్గినా, అది ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా లేదు.

అగ్నిమాపక శాఖలో రిక్రూట్‌మెంట్‌ లేక డ్రైవర్లకు కొరత ఏర్పడింది. దీంతో తాత్కాలిక పద్ధతిలో ఆర్టీసీ నుంచి కొంతమందిని తీసుకోవాలని మూడేళ్ల క్రితం నిర్ణయించారు.  ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనటంతో పెద్దసంఖ్యలో డ్రైవర్లు ఆప్షన్‌ ఇచ్చారు. దరఖాస్తులను పరిశీలించి 200 మందిని అగ్నిమాపక శాఖకు పంపారు. కానీ, మూడేళ్లు గడుస్తున్నా వారిని తిరిగి ఆర్టీసీకి పంపలేదు. అసలే డ్రైవర్ల కొరత, 200 మంది డిప్యూటేషన్‌లో ఇరుక్కుపోవటంతో ఆర్టీసీ ఆపసోపాలు పడుతోంది. దీంతో వారిని వెంటనే పంపాలంటూ అధికారులు ఇప్పుడు లేఖలు రాసినా స్పందన ఉండటం లేదు. కనీసం ఆ 200 మంది తిరిగి వస్తే కొంతమేర సమస్య పరిష్కారమవుతుందని అధికారులు భావిస్తున్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top