
టికెట్లు ఇవ్వకుండా చార్జీ డబ్బు స్వాహా చేస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లు
అందినకాడికి దండుకునే పనిలో అద్దె బస్సుల డ్రైవర్లు
ఉద్యోగం పోయినా పరవాలేదన్న ధీమాతో సొమ్ము స్వాహా
పురుషులకూ జీరో టికెట్లిచ్చి దోపిడీ చేస్తున్న ఔట్‌సోర్సింగ్ కండక్టర్లు
తనిఖీ బృందాల సంఖ్య పెంచిన ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అద్దె బస్సులు నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థల డ్రైవర్లు కొందరు సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రయాణికుల నుంచి టికెట్ల డబ్బు వసూలు చేసి, వారికి టికెట్లు ఇవ్వకుండా ఆ సొమ్మును జేబులో వేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల పెరుగుతుండటంతో ఏం చేయాలో పాలుపోక ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తనిఖీ బృందాలను పెంచి విస్తృతంగా చెక్ చేయిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు దాటాక కొందరు డ్రైవర్లు ఈ తరహా దందా చేస్తుండటంతో అంతర్‌రాష్ట్ర తనిఖీ
బృందాలను కూడా రంగంలోకి దింపారు.
ఉద్యోగం.. పోతే పోతుంది
ఆర్టీసీలో ఇటీవల అద్దె బస్సుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రైవేటు సంస్థల నుంచి బస్సులను అద్దెకు తీసుకుని కి.మీ.కు నిర్ధారిత మొత్తాన్ని చెల్లిస్తోంది. ఈ బస్సుల్లో డ్రైవర్లను బస్సు యజమానులే ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం 35 శాతం బస్సులు ఇవే ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య కూడా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం వీటికి రాయితీ ఇస్తూ టెండర్లు పిలిచి బస్సులు కేటాయిస్తోంది.
ఆ టెండర్ దక్కించుకునే బడా సంస్థలు బస్సులను ఆర్టీసీకి అద్దెకిస్తున్నాయి. వీటి డ్రైవర్లు ఇప్పుడు ఆర్టీసీకి రావాల్సిన టికెట్ సొమ్మును భారీగా స్వాహా చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ తరహాలో రెగ్యులర్ ఉద్యోగం కాకపోవటంతో.. ఉద్యోగం ఉంటే ఉంటుంది, పోతే పోతుందన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. రోజుకు ఐదారు టికెట్ల డబ్బు స్వాహా చేయటం ద్వారా నెలకు యజమాని ఇచ్చే జీతం కంటే ఎక్కువ మొత్తం సమకూర్చుకోవచ్చన్నది వారి ఆలోచన.
ఎలక్ట్రిక్ బస్సులున్న అన్ని డిపోల్లో ఇలాంటి కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఆర్టీసీ కూడా కఠినచర్యలకు దిగింది. దొరికిన డ్రైవర్ ఎంత మొత్తం కాజేశాడో తేల్చి అంతకు పది రెట్ల మొత్తాన్ని ఆ డ్రైవర్‌ను నియమించిన సంస్థకు పెనాలీ్టగా విధించి వసూలు చేస్తున్నారు. ఆ డ్రైవర్ ఆర్టీసీలో మళ్లీ పనిచేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఇలాంటి కేసులు ఆగకపోవటంతో వారి లైసెన్సులను రద్దు చేసేలా రవాణాశాఖతో ఆర్టీసీ సంప్రదిస్తోంది.
జీరో టికెట్ల దందా కూడా..
కొందరు ఔట్‌సోర్సింగ్ కండక్టర్లు జీరో టికెట్లతో మాయ చేస్తున్నారు. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళకు ఉచిత ప్రయాణం కింద జీరో టికెట్లు జారీ చేస్తారు. కొందరు ఔట్‌సోర్సింగ్ కండక్టర్లు పురుష ప్రయాణికులకు కూడా జీరో టికెట్లు జారీచేస్తూ ఆ మొత్తాన్ని స్వాహా చేస్తున్నారు. జీరో టికెట్లకు సంబంధించి ఆర్టీసీకి డబ్బు జమ కట్టాల్సిన పని లేకపోవటంతో వారికి బాగా కలిసి వస్తోంది.
ఇటీవల తనిఖీల్లో పురుషుల వద్ద జీరో టికెట్లు దొరికాయి. దీంతో ఈ బండారం వెలుగు చూసింది. గతంలో సొంత కండక్టర్లు కొందరు ఇలా చేయగా, వారిని ఏకంగా డిస్మిస్ చేయటమే కాకుండా, అప్పీల్ అవకాశం కూడా లేకుండా చేశారు. దీంతో మిగతావారు ఆ దందాకు దూరంగా ఉన్నారు. కానీ, ఇటీవల ఔట్‌సోర్సింగ్ కండక్టర్లలో కొందరు ఆ తరహాలో డబ్బు కాజేస్తున్నారు.
ఇటీవలి ఘటనలు కొన్ని..
⇒ సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సును చెక్ చేయగా.. ముగ్గురు ప్రయాణికుల వద్ద టికెట్లు లేకపోవటంతో పట్టుకున్నారు. తమ నుంచి డ్రైవర్ డబ్బులు తీసుకుని టికెట్లు ఇవ్వలేదని వారు చెప్పారు. విచారణలో నిజమని తేలటంతో ఆ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారు.
⇒ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న లహరి స్లీపర్ బస్సులో ఇద్దరు ప్రయాణికులకు టికెట్లు జారీ చేయకుండా డ్రైవర్ ఆ మొత్తాన్ని జేబులో వేసుకున్నాడు. తనిఖీలో పట్టుబడటంతో డ్రైవర్‌పై చర్యలు తీసుకున్నారు.
⇒ నిజామాబాద్ నుంచి మెదక్ మీదుగా హైదరాబాద్ వస్తున్న ఎలక్ట్రిక్ బస్సును నర్సాపూర్ వద్ద తనిఖీ చేయగా టికెట్ లేని ప్రయాణికులు దొరికారు. తమ నుంచి డ్రైవర్ చార్జీ వసూలు చేసి టికెట్‌లు ఇవ్వలేదని వారు చెప్పారు. ఇతర ప్రయాణికులు కూడా అది నిజమేనని నిర్ధారించటంతో డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.