
ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు
స్టేజీలకు రూ. 5, నాలుగో స్టేజీ నుంచి రూ.10 పెంపు
డీలక్స్, ఏసీ లగ్జరీ బస్సుల్లో మొదటి స్టేజీకి రూ. 5, రెండో స్టేజీ నుంచి రూ.10 పెంపు
రేపట్నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రెండేళ్లలో 3,300
ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకోనున్న ఆర్టీసీ
సిటీలోని డీజిల్ బస్సులన్నీ ‘ఔటర్’ వెలుపలకు తరలింపు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని సిటీ బస్సుల చార్జీలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పెంచింది. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా విద్యుత్ బస్సులనే తిప్పనుండటంతో అందుకయ్యే మౌలికవసతుల కల్పనకు కావాల్సిన నిధుల కోసం సిటీ బస్సు చార్జీలను పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం తాజాగా అనుమతించింది. దసరా వేళ చార్జీలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉండటంతో పండుగ రద్దీ ముగిశాక పెంచాలని నిర్ణయం తీసుకుంది. చార్జీల పెంపు సోమవారం తెల్లవారుజామున తొలి సర్వీసు నుంచి అమల్లోకి రానుంది.
పెంపు ఇలా...
ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్ ఆర్డినరీ, ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో తొలి మూడు స్టేజీల వరకు ప్రస్తుత టికెట్ ధరపై రూ. 5 పెరగనుంది. ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో కనీస చార్జి రూ. 10గా ఉండగా ఇకపై రూ. 15 కానుంది. నాలుగో స్టేజీ నుంచి ప్రస్తుత చార్జీపై రూ. 10 అదనంగా పెరుగుతుంది. ఇక మెట్రో డీలక్స్, ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సుల్లో మొదటి స్టేజీ వరకు రూ. 5, రెండో స్టేజీ నుంచి రూ. 10 చొప్పున పెరుగుతుంది. ఈ పెంపు వల్ల ఆర్టీసీకి నిత్యం రూ. 20 లక్షల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సుల కోసం..
హైదరాబాద్‌లో డీజిల్ బస్సుల వల్ల వాతావారణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ బస్సులను వాడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో నిర్ణయించారు. ప్రస్తుతం తిరుగుతున్న 2,800 డీజిల్ బస్సులను ఔటర్ రింగ్‌రోడ్డు అవతల ఉన్న డిపోలకు తరలించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తిప్పాలని ఆదేశించారు. ఇందుకోసం ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం ఈ–డ్రైవ్ కింద దరఖాస్తు చేసుకోగా కేంద్రం సానుకూలంగా స్పందించి బస్సులను మంజూరు చేసింది.
హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ సహా మొత్తం 11 నగరాలకు బస్సుల సరఫరాకు టెండర్లు పిలిచింది. ఎంపికైన ప్రైవేటు సంస్థకు కేంద్రం రాయితీ అందిస్తుంది. ఆ సంస్థ బస్సులను సమకూర్చుకొని ఆరీ్టసీకి అద్దెకిస్తుంది. ‘ఫేమ్’పథకం కింద గతంలో హైదరాబాద్‌కు 500 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. వాటిల్లో 225 బస్సులు ఇప్పటికే సమకూరగా మరో రెండు నెలల్లో మిగతావి అందనున్నాయి. పీఎం ఈ–డ్రైవ్ కింద వచ్చే బస్సులతో కలిపి అప్పుడు మొత్తం 3,300 విద్యుత్ బస్సులు నగర రోడ్లపైకి వస్తాయి.
ప్రభుత్వం ఆదుకోకపోవడంతో..
ప్రస్తుతం నగరంలో 25 బస్సు డిపోలున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులకు పవర్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున అందుకు కొంత స్థలం అవసరమవుతుంది. ప్రస్తుతం డీజిల్ బస్సుల తరహాలో ఒక్కో డిపోలో 100 అంతకుమించి బస్సులకు స్థలం సరిపోదు. 3,300 బస్సులకు సరిపోవాలంటే అదనంగా మరో 10 కొత్త డిపోలను, ఎలక్ట్రిక్ చార్జింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఒక్కో డిపోపై రూ. 7–8 కోట్ల భారం పడనుంది. ఇంటర్‌మీడియట్ స్టేషన్ల ఏర్పాటుకు మరో రూ. 6 కోట్లు ఖర్చవుతుంది.
ఇప్పటికే కొన్ని డిపోలకు ఏర్పాటు చేయగా, మరో 19 డిపోలకు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొత్తగా ప్రతిపాదించిన 10 డిపోలతో కలిపి ఇప్పుడు 29 డిపోలకు ఈ వ్యవస్థ ఏర్పాటు కావాలి. ఇందుకు రూ. 392 కోట్లు అవసరమవుతుందని ఆర్టీసీ అంచనా వేసింది. ఈ మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదించగా ప్రభుత్వం చేతెలెత్తేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సిటీ బస్సుల ప్రయాణికులపై చార్జీల భారం మోపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. బస్సు చార్జీలను సవరించడం ద్వారా వచ్చే రెండేళ్లలో ఆ మొత్తాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది.