ఖాతాలకు చేరని.. ఆర్థిక సాయం!

Rs 1500 Benefit Not Credited To Many People In Nalgonda - Sakshi

పేదల ఖాతాల్లో రూ.1500 జమ చేస్తానన్న ప్రభుత్వం

ఖాతాలు లేని వారికి ఎలా చెల్లిస్తారో లేని స్పష్టత

జిల్లా వినియోగదారులకు జమకావాల్సిన రూ.68.60కోట్లు

సాక్షి, నల్లగొండ: కరోనా (కోవిడ్‌–19) వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వారికి ప్రభుత్వం రేషన్‌ బియ్యం అందిస్తోంది. ప్రతి వినియోగదారుడికి రూ.1500 ఆర్థిక సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కూడా ప్రకటించింది. దాదాపు అన్ని కుటుంబాలకు బియ్యం అందినా, ఆర్థిక సాయం మాత్రం వారి ఖాతాలకు చేరడం లేదు. రేషన్‌కార్డుదారులు తమ బ్యాంకు ఖాతాలతో ఆధార్‌ కార్డు లింకు చేసుకుంటేనే సాయం అందే అవకాశం ఉందని అధికార యంత్రాంగం చెబుతోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అసలు బ్యాంక్‌ అకౌంట్‌లు లేని వినియోగదారులే ఎక్కువమంది ఉన్నా రు. అకౌంట్‌ ఉన్నా ఆధార్‌ లింకు చేసుకోని వారు కూడా ఎక్కువేనని అంటున్నారు. దీంతో ప్రభుత్వం చేస్తానన్న రూ.1500 ఆర్థిక సాయం వారికి ఎలా దక్కుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది.

బియ్యం పంపిణీ దాదాపు పూర్తి
జిల్లాలో మొత్తం 4,57,364 తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. కార్డు ఉన్న కుటుంబంలోని సభ్యులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున రేషన్‌ బియ్యం అందిస్తామన్న ప్రభుత్వం ఆ మేరకు పంపిణీ దాదాపు పూర్తి చేసింది. కాగా, ఈమొత్తం తెల్ల రేషన్‌ కార్డు దారులకు రూ.68.60కోట్ల ఆర్థిక సాయం అందాల్సి ఉంది. నేరుగా బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమచేస్తామన్నారు. ప్రభుత్వమేమో ఇప్పటికే 90శాతం మంది వినియోగదారులకు డబ్బులు జమ చేశామంటోంది. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి దానికి విరుద్ధంగా ఉందంటున్నారు.

కొందరికే జమ
గతంలో ప్రభుత్వం రేషన్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌కు, ఆధార్‌ అనుసంధానం చేయాలని నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు ఉన్న వారు ఆధార్‌ అనుసంధానం చేసుకున్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వం జన్‌ధన్‌ ఖాతాలు (జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌) తెరవాలని అందులో కేంద్రం డబ్బులు వేస్తుందని చెప్పడంతో పేదలు అంతా ఖాతాలు తెరిచారు. అప్పుడు ఆధార్‌ లింక్‌ చేసుకున్నారు. అదే విధంగా సబ్సిడీ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్న వారు రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, బ్యాంకు అకౌంట్‌ను ‘ఆన్‌లైన్‌’ ద్వారా అనుసంధానం చేసుకోవాలని కోరా రు. అదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకానికి కూడా బ్యాంకు అకౌంట్‌ తప్పనిసరి. దీంతో ఆధార్‌ లింక్‌ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇంకా చాలామంది పేదలకు బ్యాంకు ఖాతాలు లేవు, దానికితోడు బ్యాంకు ఖాతాలను కూడా ఎప్పుడో తెరిచారు. వాటిని వాడకపోవడం వల్ల కూడా బ్యాంకర్లు వాటిని నిలిపివేశారు. ఇప్పుడు కొందరికే జమైనట్లు మెసెజ్‌లు వ స్తున్నాయి. మెసెజ్‌లు రాని వారు తమకు డబ్బులు ఇక పడవా అంటూ ఆందోళన చెందుతున్నారు.

బ్యాంకులకు పరుగులు
తమ రూ.1500 డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకునేందుకు వినియోగదారులు బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కొందరికే డబ్బులు జమ అయినట్లు మెసే జులు వస్తుండడంతో రాని వారు ఆందోళనతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో రెండు ఖాతాలు ఉన్న వారికి ఏ ఖాతాలో జమవుతుందో తెలి యక కూడా బ్యాంకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. జిల్లా అధికారులు కూడా తమ వద్ద నియోగదారులకు జరుగుతున్న చెల్లింపుల సమచారం లేదంటున్నారు. దీనికితోడు ఏదైనా కారణాల వల్ల ఖాతాలు పని చేయక డబ్బులు జమకాని వారు, అసలు ఖాతాలు లేని వారి పరిస్థితి, మిస్‌ అయిన వా రికి ఏవిధంగా డబ్బులు ఇస్తారు అన్న అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. వేములపల్లి మండలంలో సగం మందికే బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమయ్యాయి. మిర్యాలగూడ పట్టణంలో కూడా ఇదే పరిస్థితి. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో గుర్రంపోడు, తిరుమలగిరి మండలాల్లో మాత్రం సగం మందికి నగదు జమ కాగా, మరో సగం మందికి జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

ఎంత మందికి జమైంది మాకు తెలియదు
ప్రభుత్వ జిల్లాకు సంబంధించిన కార్డుదారులకు నేరుగా హైదరాబాద్‌ ఎన్‌ఐసీ నుంచి డబ్బులు జమ చేస్తోంది. బ్యాంకు ఖాతాలు ఆధార్‌కు లింక్‌ అయ్యి ఉన్నందున వాటి ఆధారంగా జమ చేస్తున్నారు. అందరి ఖాతాలకు డబ్బులు జమ అవుతాయి. ఎంత మందికి డబ్బులు వచ్చాయి..? ఇంకా ఎందరికి రావాల్సి ఉంది.. అన్న సమాచారం మాదగ్గర ఉండదు. ఎవరికైనా డబ్బులు జమకాక పోతే మాకు దరఖాస్తు చేసుకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. 
– నిత్యానందం, ఏఎస్‌ఓ

వస్తయో.. రావో 
కేసీఆర్‌ ఇస్తానన్న రూ.1500 వస్తాయో రావో తెలుస్తలే. అంతా డబ్బులు పడ్డాయని అంటుంటే నేనూ బ్యాంకుకు వచ్చిన. నా బ్యాంకు పుస్తకం తీసుకొని చూస్తే బ్యాంకోల్లు పడలేదన్నారు. అడిగితే మాకు తెలియదు అంటుండ్రు. వస్తయోరావో తెలియని పరిస్థితి. 
– గంగులు, నల్లగొండ

తీరా నగదు పడలేదన్నారు 
నా తెల్ల రేషన్‌ కార్డు ఉంది. 12కిలోల బియ్యం ఇచ్చారు. అందరికీ రూ.1500 పడినట్లు చుట్టుపక్కల వాళ్లు అనుకుంటున్నారు. నేను బ్యాంక్‌ వద్దకు వెళ్లి  ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో నిలబడ్డాను. తీరా నా దగ్గరికి వచ్చేసరికి నీ అకౌంట్‌లో డబ్బులు పడలేదని చెప్పారు. అసలే కష్టకాలం. ఈ డబ్బులు పడితే కొంత ఆసరాగా ఉంటుందని అనుకుంటే రాలేదు.  
– సిద్ది నాగమ్మ, ముత్తిరెడ్డికుంట

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top