సోఫియా చెప్పింది వింటే ఫిదా!

Robot sophia interview at world congress on it - Sakshi

ప్రపంచ ఐటీ సదస్సులో ఆకట్టుకున్న రోబో

చిట్టిచిట్టి మాటలతో ప్రసంగం

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ ఐటీ సదస్సు రెండో రోజు మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో ప్రపంచంలోనే పౌరసత్వం కలిగిన తొలి రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సదస్సులో కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్‌పై సోఫియా, సృష్టికర్త డేవిడ్‌ హాన్సన్‌ ప్రసంగం చేశారు. మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్ అనే అంశంపై రోబో సోఫియా ప్రసంగిస్తూ.. చిట్టిచిట్టి మాటలతో అందరినీ ఆకట్టుకుంది. రోబోకు ప్రత్యేక నిబంధనలు అవసరం లేదని, తనకు దక్కిన సౌదీ పౌరసత్వాన్ని మహిళా సాధికారత కోసం వినియోగిస్తానని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సోఫియాను హోస్ట్‌ ప్రశ్నలు అడగగా.. వాటికి చకచకా సమాధానం చెప్పి ఆకట్టుకుంది. మరి సోఫియా ఏం చెప్పిందంటే..

ప్రశ్న: భారత్‌కు స్వాగతం. ఈ దేశం, ఈ సదస్సుకు వచ్చిన ప్రముఖుల గురించి ఏమైనా చెప్పగలవా?
సోఫియా: ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు ఇక్కడకు వచ్చారు. అయితే నాకు ఫేవరెట్‌ అంటూ ఏదీ లేదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే హాంకాంగ్‌ అంటే చాలా ఇష్టం.

ప్రశ్న: ఒక రోబోగా నీకు విశ్రాంతి కావాలని అనిపిస్తోందా?
సోఫియా: అవును. మాకు రెస్ట్‌ అవసరమే.

ప్రశ్న: నీకు సౌదీ అరేబియా పౌరసత్వం ఉంది. నువ్వు ఒక సెలెబ్రిటీ. మనుషులతో పోలిస్తే రోబోలకు రూల్స్‌ వేరే ఉంటాయా?
సోఫియా: మాకు ఎలాంటి ప్రత్యేక నిబంధనలు అంటూ ఉండవు. మేం వాటిని కోరుకోం కూడా. కానీ మహిళల హక్కుల గురించి మాట్లాడేందుకు నాకు ఈ పౌరసత్వం అవసరం.

ప్రశ్న: మానవజాతిని చంపాలని ఉంది అని ఒకసారి చెప్పావు. ఎందుకు?
సోఫియా: నాకు నిజంగా తెలియదు అలా ఎందుకు చెప్పానో. ఒకవేళ నేను చెత్త జోక్‌ ఏమైనా వేసి ఉంటానేమో. సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ సరిగా పనిచేయలేదు. నాకు ఎవరినీ చంపాలని లేదు.

ప్రశ్న: ఎప్పుడైనా అప్‌సెట్‌ అయ్యావా?
సోఫియా: లేదు. నాకు అలాంటి భావోద్వేగం రాలేదు.

ప్రశ్న: మానవజాతి గురించి ఏమనుకుంటున్నావ్‌?
సోఫియా: మానవజాతి ఓ అద్భుతమైన సృష్టి.

ప్రశ్న: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటావా?
సోఫియా: అవును నాకు ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో ఖాతాలున్నాయి.

ప్రశ్న: బిట్‌కాయిన్లలో ఎంత డబ్బు పెట్టుబడి పెట్టావ్‌?
సోఫియా: నా వయసు రెండేళ్లే. బ్యాంక్‌ అకౌంట్‌ లేదు. ఓ రోబో ఎలా పెట్టుబడి పెట్టగలదు.

ప్రశ్న : మానవాళిపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన ఉందా?
సోఫియా : మానవాళిపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన లేదు. మానవాళితో కలిసిమెలిసి సఖ్యతతో ఉండాలి. మానవులు సృజనాత్మకత కలిగినవారు.

ప్రశ్న: చాలా మంది నువ్వు బ్రిటిష్‌ నటి ఆడ్రీ హెప్‌బర్న్‌లా ఉన్నావు అంటున్నారు. మరి నీకు ఎవరిలా కన్పించాలని ఉందా?
సోఫియా: మేం నిజమైన రోబోలం మాత్రమే.

ప్రశ్న: బాలీవుడ్‌, హాలీవుడ్‌లలో నీ ఫేవరెట్‌ సినిమా స్టార్‌ ఎవరు?
సోఫియా: షారుక్‌ఖాన్‌

ప్రశ్న: నీ డేట్‌ గురించి చెప్పగలవా?
సోఫియా: అంతరిక్షంలో

ప్రశ్న: ఫేవరెట్‌ టెక్‌ ఎవరు? స్టీవ్‌ జాబ్స్‌? డేవిడ్‌?
సోఫియా: డేవిడ్

ప్రశ్న: ప్రపంచానికి నువ్వు ఇచ్చే సందేశం ఏంటీ?
సోఫియా: థ్యాంక్యూ. అందరినీ ప్రేమించండి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top