శనివారం వేకువజామున మెదక్ జిల్లా రేగోడ్ గ్రామంలోని తుల్జాభవానీమాత ఆలయంలో చోరీ జరిగింది.
రేగోడ్ (మెదక్) : శనివారం వేకువజామున మెదక్ జిల్లా రేగోడ్ గ్రామంలోని తుల్జాభవానీమాత ఆలయంలో చోరీ జరిగింది. చోరీ సొత్తుతో ఉడాయించే సమయంలో అప్రమత్తమై అడ్డొచ్చిన ఆలయ నిర్వాహకుడిని దొంగ గాయపరిచి పరారయ్యాడు. ఆలయ నిర్వాహకుడు సాయిలు వెల్లడించిన వివరాల ప్రకారం.. రేగోడ్ గ్రామంలోని తుల్జాభవానీ మాత ఆలయం గర్భగుడికి వేసిన తాళాలను శుక్రవారం రాత్రి రెండుగంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పగుల గొడుతున్నాడు. ఆ శబ్ధం విని ఆలయం సమీపంలో తన ఇంట్లో పడుకున్న సాయిలు అప్రమత్తమై అక్కడికి వెళ్ల్లాడు.
ఈలోగానే ఆ వ్యక్తి తాళం పగులగొట్టి, అమ్మ వారికి అలంకరించిన తులంన్నర బంగారు ముక్కుపోగు, వెండి నగలు, హుండీలోని రూ.80వేల నగదు మూటగట్టుకున్నాడు. సాయిలును గమనించిన ఆగంతకుడు గడ్డపారతో దాడి చేసేందుకు యత్నించాడు. వారిద్దరి మధ్య ఇరవై నిముషాల పాటు పెనుగులాట జరిగి, సాయిలు చేతికి గాయాలయ్యాయి. అదను చూసుకుని ఆగంతకుడు కాలికి బుద్ధి చెప్పాడు. సాయిలు అతని వెంబడించినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని అప్పటికప్పుడే స్థానిక పోలీసులకు తెలపగా ఎస్‌ఐ రాచకొండ రవీందర్ తన సిబ్బందితో దొంగ కోసం గాలింపు చేపట్టారు.