చట్ట నిబంధనల ఉల్లంఘన జరగలేదు

Revanthreddy arrested as part of law and order - Sakshi

శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగానే రేవంత్‌ అరెస్ట్‌

హైకోర్టుకు నివేదించిన వికారాబాద్‌ అప్పటి ఎస్పీ అన్నపూర్ణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవడంలో ఎక్కడా కూడా చట్ట నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఎన్నికల సమయంలో వికారాబాద్‌ ఎస్‌పీగా బాధ్యతలు నిర్వర్తించిన అన్నపూర్ణ హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించే చర్యల్లో భాగంగానే రేవంత్‌ని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. కోస్గిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హాజరవుతున్న సభ లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారంతోనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, అందువల్ల అధికారిక సీలు అందుబాటులో లేకపోయిందని వివరించారు.

అదుపులోకి తీసుకునే ముందు బయటకు రావాలని రేవంత్‌ను పలుమార్లు పిలిచామని, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో గేట్లు పగులగొట్టి లోనికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. గదిలో రేవంత్‌తోపాటు ఆయన భార్య, కుమార్తె ఉన్నారని, వారికి రేవంత్‌ అరెస్ట్‌కు దారి తీసిన కారణాలు వివరించి వాటికి సంబంధించిన కాగితాలపై సంతకాలు కోరగా నిరాకరించారని ఆమె తెలిపారు. పోలీసులు చట్ట విరుద్ధంగా రేవంత్‌ను నిర్బంధించారని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై  న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం  విచారణ జరిపింది. ఈ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి అవకాశం ఇచ్చి తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top