
తొక్కిసలాట బాధ్యుడికే మళ్లీ తిరుపతి ఎస్పీగా చాన్స్
రెడ్‌బుక్ కుట్ర కేసుల వేధింపుల్లో కీలక పాత్రధారి
సాక్షి, అమరావతి: చనిపోయింది ఆరుగురు సామాన్య భక్తులే కదా..! తీవ్రంగా గాయపడింది 40 మంది భక్తులే కదా..! అయినా సరే అందుకు బాధ్యుడైన వీర విధేయ అధికారికి మళ్లీ అక్కడే పోస్టింగ్ ఇద్దాం..! ఇదీ ప్రజలకు భద్రత, రక్షణపై చంద్రబాబు సర్కారు తీరు!! అందుకే ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడును తాజాగా మరోసారి తిరుపతి ఎస్పీగా నియమించింది. తిరుమల తిరుపతి పవిత్రత, భక్తుల మనోభావాలు అంటే తమకు ఏమాత్రం లెక్కలేదని మరోసారి నిరూపించింది.
రెడ్ బుక్ కుట్ర కేసుల్లో కీలక పాత్రధారి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ కుటుంబానికి చెందిన ఎల్.సుబ్బారాయుడు ఆ పార్టీకి వీర విధేయుడు! తెలంగాణ కేడర్‌కు చెందిన ఆయన్ను టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు ఏరికోరి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చారు. తిరుపతి ఎస్పీగా నియమించారు. రాయలసీమలో రెడ్‌బుక్ కుట్రను అమలు చేసేందుకే ఆయనకు కీలక పోస్టింగు ఇప్పించినట్టు పోలీసువర్గాలే వ్యాఖ్యానించాయి. అయితే ఎస్పీగా విధి నిర్వహణలో సుబ్బారాయుడు విఫలమయ్యారు. ఈ ఏడాది జనవరి 9న వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియలో ప్రభుత్వ వైఫల్యం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
తిరుమల–తిరుపతి దేవస్థానం చరిత్రలో తొలిసారి తొక్కిసలాట జరిగి ఆరు మంది భక్తులు దుర్మరణం చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్యూలైన్ల నిర్వహణలో వైఫల్యం... గేట్లు మూసివేసి లక్షలాదిమంది భక్తులను రోడ్లపై గంటలతరబడి వేచి ఉండేలా చేయడం... ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట సంభవించి భక్తులు మృత్యువాత పడ్డారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహావేశాలను బేఖాతరు చేస్తూ తమ అస్మదీయ అధికారి సుబ్బారాయుడుకు చంద్రబాబు అండగా నిలిచారు. ఆయన్ను సస్పెండ్ చేయకుండా బదిలీతోనే సరిపెట్టారు. అది కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే పోస్టింగు ఇచ్చారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధక టాస్‌్కఫోర్స్ ఎస్పీగా నియమించారు.
సిట్ సభ్యుడిగా నియామకం..
అంచనాలను అందుకోవడంతో క్లీన్‌చిట్
అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలపై కక్షసాధించేందుకు నమోదు చేసిన అక్రమ కేసులో సుబ్బారాయుడును అస్త్రంగా చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తుపై నియమించిన సిట్‌లో సభ్యుడిగా ఆయన్ను నియమించారు. ఈ అక్రమ కేసు దర్యాప్తు ముసుగులో సిట్ సాగిస్తున్న అరాచకాలు, వేధింపులు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలతోపాటు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజం వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరులను అక్రమంగా అరెస్టు చేసి వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే.
రెడ్‌బుక్ కుట్రలను పక్కాగా అమలు చేయడంలో చంద్రబాబు అంచనాలను సుబ్బారాయుడు అందుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తిరుపతి తొక్కిసలాటపై నియమించిన విచారణ కమిటీ సుబ్బారాయుడుకు క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం. దీంతో ఆయన్ను మరోసారి జిల్లా ఎస్పీగా నియమించేందుకు మార్గం సుగమమైంది. తొలుత ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీగా నియమించాలని భావించగా తనకు తిరుపతి జిల్లానే కేటాయించాలని సుబ్బారాయుడు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దాంతో టీడీపీ వీర విధేయ ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడును ప్రభుత్వం తిరిగి తిరుపతి ఎస్పీగానే నియమించింది.
నిక్కచి్చగా పని చేస్తారని పేరున్న హర్షవర్థన్ రాజును అక్కడి నుంచి బదిలీ చేసి ప్రకాశం జిల్లా ఎస్పీగా నియమించింది. గతంలో వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు హర్షవర్థన్ రాజు రెడ్‌బుక్ కుట్రలకు సహకరించలేదని ఆకస్మికంగా బదిలీ చేసింది. తాజాగా ఏడు నెలల్లోనే ఆయన్ను తిరుపతి నుంచి తప్పించి ఆయన స్థానంలో సుబ్బారాయుడును నియమించింది.