రవిప్రకాశ్‌... కిం కర్తవ్యం?

Ravi Prakash seeks 10 days time to appear before cops for questioning - Sakshi

శివాజీ ఎపిసోడ్‌ ముగిసినట్లే!

పోలీసులకు సహకరిస్తున్న మూర్తి 

మిగిలింది న్యాయవాది శక్తి, రవిప్రకాశ్‌లే ​​​​​​

అలందాకు తొలగుతున్న అడ్డంకులు 

డీల్‌ అడ్డుకునేందుకు చేసిన యత్నాలన్నీ బెడిసికొట్టినట్లేనా?

సాక్షి, హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఫోర్జరీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో రోజుకో కొత్త వ్యవహారం వెలుగుచూడటం, అవన్నీ రవిప్రకాశ్‌కు ప్రతికూలంగా ఉండటం చూస్తుంటే.. ఈ కేసులో ఆయన రోజురోజుకూ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నాడనే విషయం స్పష్టమవుతోంది. టీవీ9 యాజమాన్య మార్పు వ్యవహారంలో నేషనల్‌ కంపెనీ లా ఆఫ్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో నటుడు శివాజీ, మాజీ సీఈఓ రవిప్రకాశ్‌లకు చుక్కెదురైంది. దీంతో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే అలందా మీడియా ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. దీంతో రవిప్రకాశ్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారినట్లు తెలుస్తోంది. చట్టపరంగా అన్ని దారులు మూసుకుపోతున్న క్రమంలో ఇకపై ఆయన ఏం చేస్తారనే అంశం ఇపుడు చర్చనీయాంశమైంది. 

అలందాకు తొలగుతున్న అడ్డంకులు 
ఈ వ్యవహారంలో టీవీ9ని కొనుగోలు చేసిన కొత్త కంపెనీ అలందా మీడియా సంస్థకు ఒక్కొక్కటిగా అడ్డంకులు తొలగిపోతున్నాయి. తాజాగా ఎన్‌సీఎల్‌టీ తీర్పుతో ఈ ఎపిసోడ్‌లో శివాజీ పాత్ర ముగిసినట్లేనని టీవీ9 ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగైనా టీవీ9 యాజమాన్య బదిలీ జరగకుండా శివాజీని అడ్డంపెట్టుకుని రవిప్రకాశ్‌ వేసిన ఎత్తుగడ ఎన్‌సీఎల్‌టీ వద్ద బోల్తా కొట్టిందంటున్నారు. ఇక ఈ కేసులో పరారీలో ఉన్న శివాజీ దొరకడమే మిగిలింది.

మరో నిందితుడు టీవీ9 మాజీ సీఎఫ్‌వో ఎంవీకేఎన్‌ మూర్తి విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆయనను పోలీసులుపలుమార్లు విచారించారు. తాము పిలిచినప్పుడల్లా రావాలని పోలీసులు ఆదేశించారు. ఈయన తెలిపిన ఆధారాలతోనే ఈ–మెయిల్‌ సంభాషణలను పోలీసులు వెలికి తీయగలిగారని తెలిసింది. కానీ, మూర్తి, శివాజీ, రవిప్రకాశ్, న్యాయవాది శక్తి మధ్య జరిగిన ఈ–మెయిల్స్‌ వ్యవహారం.. ఎలా లీకైందన్న విషయం ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. పోలీసులు మాత్రం తాము విడుదల చేయలేదని చెబుతున్నారు.  

లాయర్‌ శక్తి పాత్ర కీలకమే! 
ఈ కేసులో మరో కీలక నిందితుడు న్యాయవాది శక్తి. పాతతేదీలతో రవిప్రకాశ్‌పై ఎన్‌సీఎల్‌టీలో వేయాల్సి న వ్యాజ్యం డ్రాఫ్ట్‌ రూపకల్పనలో కీలక పాత్ర పోషించాడని ఆరోపణలున్నాయి. అలందా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం న్యాయవాది శక్తి కూడా పత్తా లేకుండాపోయారు. ఆయన కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. దీనికితోడు రవిప్రకాశ్‌ పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ స్టే ఇవ్వడం, హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడం వంటి పరిణామాలు చూస్తుంటే అలందా ముందున్న అడ్డంకులు తొలగిపోతున్నట్లు స్పష్టమవుతోంది.

లొంగిపోయే ఆలోచన లేనట్లేనా? 
టీవీ9 మాతృసంస్థ అయిన ఏబీసీఎల్‌ నుంచి అలందా మీడియాకు యాజమాన్య బదిలీ జరగకుండా రవిప్రకాశ్‌ చాలా సుదీర్ఘమైన వ్యవహారం నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే, రవిప్రకాశ్‌ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించడం, శివాజీ చేత వ్యాజ్యం వేయడం, టీవీ9 లోగోను మోజో టీవీ చైర్మన్‌ హరికిషన్‌కి విక్రయించడం తదితర పరిణామాలన్నీ చూస్తుంటే తమ చేతికి పగ్గాలివ్వకుండా రవిప్రకాశ్‌ చాలా భారీ స్కెచ్‌ వేశారని అలందా మీడియా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే.. పరారీలో ఉన్న రవిప్రకాశ్‌ అజ్ఞాతం వీడాలి. కానీ, జరుగుతున్న వ్యవహారాలన్నీ చూస్తుంటే.. ఇప్పట్లో రవిప్రకాశ్‌ పోలీసులకు లొంగిపోయే ఆలోచనేదీ లేదని సమాచారం. ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించడమే ఇందుకు నిదర్శనమని న్యాయనిపుణులంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top