మరోసారి హైకోర్టుకు రవిప్రకాశ్‌

Ravi Prakash Filed Bail Petition In High Court Again - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.  బంజారాహిల్స్‌ పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం ఆయన మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ జరపనుంది. ఏబీసీపీఎల్‌ కార్పొరేషన్‌ యాజమాన్యం మార్పిడి, వాటాల బదిలీ తదితర అంశాలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని పోలీసులు పట్టించుకోకుండా తనపై కేసులు నమోదు చేశారని రవిప్రకాశ్‌ తన పిటిషన్లలో పేర్కొన్నారు. ఎన్‌సీఎల్‌టీలో ఉన్న వివాదం గురించి తాను పోలీసులకు తెలియచేశానన్నారు.

ఏబీసీపీఎల్‌ను అలందా మీడియాకు అప్పగించే విషయంలో ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా ఉండేందుకే తనపై కేసులు నమోదు చేశారని  తెలిపారు. తనపై కేసులు నమోదు చేయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయన్నారు. తనను అరెస్ట్‌ చేయడం ద్వారా ఒత్తిడి తెచ్చిన ఎన్‌సీఎల్‌టీ ముందున్న కేసులను కొనసాగించకుండా చేయడమే ఈ కేసుల నమోదు వెనుకున్న ఉద్దేశమన్నారు. కొత్త యాజమాన్యం తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని తెలిపారు. ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చెల్లదన్నారు. ఎన్‌సీఎల్‌టీలో పెండింగ్‌లో ఉన్న వివాదానికి సంబంధించి కేసులు నమోదు చేయడం సరికాదని ఆయన తన పిటిషన్లలో పేర్కొన్నారు.

పాత తేదీతో డాక్యుమెంట్‌ సృష్టించారని పోలీసులు చెబుతున్నారని, వాస్తవానికి ఆ విషయాన్ని ఎన్‌సీఎల్‌టీ తేల్చాల్సి ఉందన్నారు. వరుసగా కేసులు నమోదు చేస్తూ తన చుట్టూ ఉచ్చుబిగిస్తున్నారని, తద్వారా అరెస్ట్‌ను తనకు రుచి చూపించాలన్న కృతనిశ్చయంతో పోలీసులు ఉన్నారని తెలిపారు. ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయవచ్చునన్నారు. ముందస్తు బెయిలు, తాత్కాలిక ముందస్తు బెయిల్‌ ఏ ఏ సందర్భాల్లో ఇవ్వొచ్చో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. ముందస్తు బెయిల్‌ మంజూరు చేసేందుకు తనకు ఏ షరతులు విధించినా అభ్యంతరం లేదన్నారు. తనకు ముందుస్తు బెయిల్‌ మంజూరు చేస్తే, దర్యాప్తునకు పూర్తి సహకరిస్తానని తెలిపారు.

కాగా నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్‌పై  సైబరాబాద్‌ పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.  దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. రవిప్రకాశ్‌ పాస్‌పోర్టును పోలీసులు సీజ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top