ప్రాంతీయ పార్టీలదే హవా!

Rajdeep Sardesai about Regional parties - Sakshi

     2019 ఎన్నికల్లో సోషల్‌ మీడియా కీలకపాత్ర

       విశ్వసనీయత కోల్పోయిన మీడియా 

     టీఆర్‌పీ రేటింగ్స్‌ కోసమే సంచలనాలు 

     ‘మీడియా ఇన్‌ న్యూస్‌’లో రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ 

హైదరాబాద్‌: వచ్చే 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవాకు అవకాశం ఉందని, 10 మంది ఎంపీలుంటే కేంద్రాన్ని శాసించవచ్చని ప్రముఖ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ అభిప్రాయపడ్డారు. ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఎల్‌వో) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌ సోమాజిగూడలోని పార్క్‌ హోటల్లో మీడియా ఇన్‌ న్యూస్‌ పేరుతో నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అభిప్రాయాలను పంచుకున్నారు. రానున్న ఎన్ని కల్లో సోషల్‌ మీడియా కీలకపాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా ‘వాట్సాప్‌’ వేదికగా ఎన్నికల యుద్ధం జరిగే అవకాశం ఉందన్నారు. మీడియా ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయిందని, దేశవ్యాప్తంగా వందల చానళ్లు నిర్వహిస్తున్నారని, ప్రముఖ చానళ్లు కూడా లాభాల్లో లేవని, కేవలం ఎన్నికల అవసరాల కోసమే మీడియా సంస్థలు పని చేస్తున్నాయని అన్నారు.

అప్రాధాన్య వార్తలు ప్రాధాన్యత పొందుతున్నాయని, నిజమైన వార్తలు లోపలి పేజీలకు పరిమితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూస్‌ కాకుండా కేవలం వ్యూస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని.. టీఆర్‌పీ రేటింగ్స్, సంచలనాల కోసం పాకులాడుతూ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని రాజ్‌దీప్‌ అన్నారు. మీడియా క్రమంగా ‘మెక్‌డొనాల్డ్‌ డైజేషన్‌’( అప్పటికప్పుడు తయారు చేసుకొని తినడం), ‘విండో జర్నలిజం’, ‘రావన్‌ స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం’కి దిగజారుతోందని అభిప్రాయపడ్డారు. మీడియా ‘వాచ్‌ డాగ్‌ ఆఫ్‌ సొసైటీ’ స్థాయి నుంచి ‘ద ల్యాబ్‌ డాగ్‌ ఆఫ్‌ ద సొసైటీ’గా శరవేగంగా మారిపోతోందన్నారు. దేశంలోని పలు పార్టీలు, నేతలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మీడియాను నియంత్రిస్తున్నారని, వారికి వ్యతిరేకంగా రాసే వార్తలను ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

జయలలిత, మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌ సహా కేసీఆర్‌ కూడా ఇదే విధానం అనుసరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంతో పోలిస్తే అమెరికాలో మీడియా మరింత శక్తివంతంగా, పక్షపాత రహితంగా ఉందని, మీడియా దెబ్బకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ అభిశంసనకు గురైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు. మహిళలు నిజాయితీగా రాజకీయాలు చేస్తారని చెప్పడం కష్టమని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఆర్నబ్‌కు, తనకు వ్యక్తిగత వైరం లేదని, వృత్తిపరమైన పోటీ మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఎఫ్‌ఎల్‌వో చైర్‌పర్సన్‌ కామిని షరాఫ్‌ అనుసంధానకర్తగా వ్యవహరించగా, పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top