
‘ఇండియా టుడే’ గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్
ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతున్న ‘సాక్షి’పై వరుసగా అక్రమ కేసులు పత్రికా స్వేచ్ఛపై దాడే
‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చట్టాన్ని దుర్వినియోగం చేయడమే
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితి దేశంలో మరెక్కడా లేదు
పత్రికా స్వేచ్ఛను కాపాడుకునేందుకు ‘సాక్షి’కి అండగా నిలబడతాం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ తప్పిదాలు, వైఫల్యాలను ప్రజల పక్షాన ఎండగడుతున్న ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ సర్కారు వరుసగా కేసులు బనాయించడం భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేయడమేనని ‘ఇండియా టుడే’ గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ తీవ్రంగా ఖండించారు.
విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలపై వార్తను ప్రచురించినందుకు ‘సాక్షి’పై కేసులు నమోదు చేయడం, అదే వార్తను ప్రచురించిన మిగతా పత్రికలు, చానళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ కోసం ‘సాక్షి’కి అండగా నిలబడతామని ప్రకటించారు.
అది ప్రాథమిక హక్కు..
రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూ రాజ్‌దీప్ సర్దేశాయ్ ‘సాక్షి’తో మాట్లాడారు. భావ ప్రకటన స్వేచ్ఛ వరి్ధల్లితేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని విశ్వసిస్తూ రాజ్యాంగ నిర్మాతలు ఆరి్టకల్ 19(1)ఏ ద్వారా ప్రాథమిక హక్కుగా కల్పించారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి పత్రికా రంగం అవిరళ కృషి చేస్తోందన్నారు.
అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల పక్షాన ‘సాక్షి’ నిలదీస్తూ కథనాలు ప్రచురిస్తోందన్నారు. ‘సాక్షి’ ప్రచురించే వార్తా కథనాలపై ప్రభుత్వానికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని ఖండిస్తూ వివరణ ఇవ్వాలని, అప్పటికీ సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుల్లో పరువు నష్టం దావా వేయవచ్చన్నారు. అంతేగానీ ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, విచారణ పేరుతో ఆయన ఇంట్లో సోదాలు చేయడం, పోలీసు స్టేషన్లకు రప్పించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేశారు.
దేశంలో ఎక్కడా ఈ రీతిలో పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తున్న దాఖలాలు లేవన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలిస్తే క్రిమినల్ చట్టాలను పోలీసులు దురి్వనియోగం చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు తమ బాధ్యతకు కట్టుబడి ఉండాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, వాక్ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం, పత్రికా స్వేచ్ఛ వికాసానికి ‘సాక్షి’కి అండగా నిలుస్తామని ప్రకటించారు.