కొనసాగుతున్న అల్పపీడనం | Rains for next two days | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న అల్పపీడనం

Aug 22 2019 2:39 AM | Updated on Aug 22 2019 2:39 AM

Rains for next two days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తూర్పు ఉత్తరప్రదేశ్, దాన్ని ఆనుకుని ఉన్న బిహార్‌ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ.. ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉంది. ఈ అల్పపీడనం మధ్య ప్రాంతం నుంచి కోస్తాంధ్ర వరకు ఒడిశా మీదుగా ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇక తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో వచ్చే రెండు రోజులు చాలాచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.

గురువారం ఒకట్రెండు చోట్ల భారీవర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా బుధవారం సాయంత్రం రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు మండలం మాచర్లలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది.  జగిత్యాల, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, సూర్యాపేట, జనగాం, కామారెడ్డి, మంచిర్యాల, నారాయణపేట, నిర్మల్, వరంగల్‌ రూరల్, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు.

జోరుగా వరినాట్లు 
రాష్ట్రంలో వరి నాట్లు జోరుగా పడుతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. ఈ ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.83 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 19.47 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. గత వారంతో చూస్తే దాదాపు 5 లక్షల ఎకరాల వరినాట్లు అధికంగా పడినట్లు వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడించింది. రానున్న వారం పది రోజుల్లో వంద శాతం అంచనాలు దాటి వరినాట్లు పడతాయని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement