ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తాం : రాహుల్‌

Rahul Says Will Decide Cm Candidate After Polls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్దిని నిర్ణయిస్తామని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడే నిర్ణయించలేమన్నారు.  కేసీఆర్‌ను ఓడించడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యువత ఆశల్ని నీరుగార్చిందని, ప్రజలు కేసీఆర్‌పై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజల కలలు సాకారమవుతాయని అనుకున్నామని, కానీ కేసీఆర్‌ పాలన అందుకు విరుద్ధంగా సాగిందని ఆరోపిం‍చారు.

రైతులకు అందుబాటులో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ నాశనమైందని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుండగా బుధవారం సాయంత్రం ప్రజాకూటమి నేతలతో కలిసి మీడియా సమావేశంలో రాహుల్‌ మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కూటమికి పట్టం కట్టాలని కోరారు.

దేశ రాజకీయాల్లో మలుపు..
 దేశ రాజకీయాల్లో మార్పునకు ఇదే ఆరంభమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ధనికరాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్‌ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. దేశంలో తెలంగాణ నెంబర్‌ వన్‌గా వెలుగొందాలన్నారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నానని కేసీఆర్‌ దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలి : కోదండరాం
తెలంగాణలో నియంత పోకడలను అనుసరిస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌ స్ధానంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పిలుపుఇచ్చారు. టీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణలో అనుకున్న ఫలితాలు రాలేదని, ప్రజల మద్దతుతో కుటుంబ పాలనను గద్దెదించుతామన్నారు.

కూటమిలో సామాజిక న్యాయం : గద్దర్‌
ప్రజాకూటమిలో సామాజిక న్యాయం ఉందని గద్దర్‌ అన్నారు. తెలంగాణలో నియంతృత్వ సర్కార్‌ను కూల్చి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని కోరారు. తెలంగాణలో అహంకారపూరిత ప్రభుత్వం ఉందని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top