మానవత్వపు పరిమళాలు

Providing Daily Essential Goods For The Poor People By DGP Mahender Reddy - Sakshi

పోలీసులు ఏర్పాటుచేసిన ‘గుడ్‌ సమారిటన్, పోలీస్‌’గ్రూపునకు నగరవాసుల భారీ స్పందన

పేదలు, నిరాశ్రయులు, యాచకులకూ అందుతున్న సాయం

సామాన్యుడి నుంచి కార్పొరేట్‌ కంపెనీల సీఈఓల వరకు స్వచ్ఛందంగా విరాళాలు

4,500 మందికి ప్రతిరోజూ భోజనాలను సమకూరుస్తూ సేవలు

విరాళాలు పంపాల్సిన వాట్సాప్‌ నంబరు 94906 17523

సాక్షి, హైదరాబాద్‌: ఇవీ.. డీజీపీ కార్యాలయంలో ‘గుడ్‌ సమారిటన్, పోలీస్‌ గ్రూప్‌’నకు వస్తున్న వినతులు. రాష్ట్రంలోని నిత్యావసరాల సరఫరాకు ఎక్కడా ఆటంకం కాకూడదని డీజీపీ మహేందర్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ‘కమోడిటీస్‌ కంట్రోల్‌ రూము’ను అధికారులు ఏర్పాటు చేశారు అందులో ‘గుడ్‌ సమారిటన్, పోలీస్‌’పేరిట వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేశారు. పౌరసరఫరాల శాఖ, మెప్మా, విమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్, పలు ఎన్జీవోలు, యువ వలంటీర్లు, వ్యాపారులు, అధికారులు ఈ విపత్కర సమ యంలో చిక్కుకున్న పలువురి ఆకలి తీర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ గ్రూపులో అనాథాశ్రమాలు, వృద్ధజనాశ్రమాల నిర్వాహకులను కూడా సభ్యులుగా చేర్చారు. ఫలితంగా ఎలాంటి వినతి వచ్చినా.. వెంటనే వారికి కావాల్సిన ఆహారం, ఇతర నిత్యావసరాలను అప్పటికప్పుడు దాతలతో మాట్లాడి వారికి చేరవేసేలా చూస్తున్నారు. సాధారణ వ్యాపారుల నుంచి బహుళజాతీయ కంపెనీల సీఈఓల వరకు అన్నార్తులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్న తీరును చూసి పోలీసులే ఆశ్చర్య పోతున్నారు. విపత్కర పరిస్థితుల్లో తోటి మానవుడిని ఆదుకునేందుకు ముందుకు వస్తోన్న వారినిచూసి గర్వంగా ఉందని పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విరాళాలను చూసి తాము పడుతున్న శ్రమను మర్చిపోతున్నామన్నారు.

► సార్‌.. నేను ఆసిఫాబాద్‌ నుంచి మాట్లాడుతున్నా.. నేనో చిరువ్యాపారిని. ఈరోజు మా ప్రాంతంలో కనీసం ఐదుగురికి భోజనం పంపాలనుకుంటున్నా.
► సార్‌..! నేనో బహుళజాతి కంపెనీకి సీఈఓను.. నిరాశ్రయులు, యాచకులకూ కడుపు నింపేందుకు రెండు క్వింటాళ్ల బియ్యం పంపాలనుకుంటున్నా.

విరాళాల వెల్లువ..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 230కి పైగా వృద్ధజనాశ్రమాలు, అనాథాశ్రమాలకు ఆహారం, బియ్యం, ఉప్పు, పప్పు, నూనె కావాలని ‘గుడ్‌ సమారిటన్‌ , పోలీస్‌’గ్రూపును ఆశ్రయిస్తున్నారు. ఈ సమాచారాన్ని వెంటనే విమెన్‌ అండ్‌ చైల్డ్‌ విభాగం, సివిల్‌ సప్లై విభాగం, ఇతర దాతలు, ఎన్జీవోలకు చేరవేసి కావాల్సిన నిత్యావసరాలు సరఫరా చేయిస్తున్నారు. అలాగే ఇటుక బట్టీ కార్మికులు, యాచకులు, ఇతర రాష్ట్రాల కూలీలు, నిరాశ్రయులకు చాలామంది క్వింటాళ్ల కొద్దీ బియ్యాన్ని, ఇతర పప్పులు, నూనె, మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు తదితర నిత్యావసరాలను విరాళంగా ఇస్తున్నారు. ఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇచ్చిన నిత్యావసరాలను ఆయా పోలీసుల ద్వారా సజావుగా పంపిణీ చేయిస్తున్నారు. కొందరు స్వచ్ఛంద సంస్థలు దూరమైనా శ్రమకోర్చి అన్నార్తులకు నిత్యావసరాలను చేరవేస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top