హెచ్‌సీయూలో మళ్లీ రగడ

Protest of all student unions in HCU - Sakshi

విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలి.. వీసీని తొలగించాలి

అఖిలపక్ష విద్యార్థి సంఘాల నిరసన

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో మళ్లీ రగడ మొదలైంది. విద్యార్థులు, వార్డెన్‌ మధ్య వాగ్వాదం కారణంగా పదిమంది విద్యార్థులను సస్పెండ్‌ చేయడంపై వర్సిటీ మరోమారు భగ్గుమంది. వైస్‌చాన్స్‌లర్‌ అప్పారావు కావాలనే దళిత, బలహీన వర్గాలు, వామపక్ష విద్యార్థులకు చదువుకునే అవకాశాన్ని లేకుండా చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఏబీవీపీ మినహా అఖిల పక్షవిద్యార్థి సంఘాలు వెలివాడ నుంచి అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. సస్పెన్షన్‌ ఎత్తివేయాలని, యూనివర్సిటీలో అశాంతికి కారకుడైన వీసీని తొలగించాలని నినదించారు. వీసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అక్కడి నుంచి మెయిన్‌ గేట్‌ వద్దకు చేరుకుని సస్పెన్షన్‌ కాపీలను దహనం చేశారు.  

పోలీసు క్యాంప్‌గా మారుస్తున్నారు..: యూనివర్సిటీ విద్యార్థి సంఘ అధ్యక్షుడు శ్రీరాగ్‌ మాట్లాడుతూ క్యాంపస్‌ను పోలీసు క్యాంపుగా మారుస్తున్నారని ఆరోపించారు. సస్పెన్షన్‌కి గురైన విద్యార్థులు విలువైన విద్యాసంవత్సరాన్ని కోల్పోవడమే కాకుండా, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. విద్యార్థులపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ట్రైబల్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ నాయకుడు వెంకటేశ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ పరీక్షలు సమీపిస్తున్న సమయంలో విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు.

జరగరానిది ఏదైనా జరిగితే వీసీ బాధ్యత వహించాల్సి ఉంటుందని సామాజిక ఐక్య కార్యాచరణ కమిటీ జాతీయ నాయకుడు ప్రశాంత్‌ హెచ్చరించారు. రోహిత్‌ మరణం తరువాత కూడా అప్పారావు వైఖరిలో మార్పు రాకపోగా, విద్యార్థులను మరింత రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. అప్పారావును కాపాడినవారే ఈ ఘటనకు బాధ్యులని అంబేడ్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మున్నా అన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు ఆరిఫ్‌ అహ్మద్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు బషీర్, బీఎస్‌ఎఫ్‌ నాయకులు అనిల్, ట్రైబల్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ నాయకులు సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.  

నిరంతరం నిఘా: వర్సిటీలో వందలాది మంది పోలీసులు మోహరించారు. క్యాంపస్‌లో పదిమంది కలసి ఉండరాదని, ఆందోళనలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని, ప్రతి చర్యను ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు, విద్యార్థులను నిఘానేత్రాల్లో బంధించేందుకు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌కు సర్వాధికారాలు ఇస్తూ రిజిస్ట్రార్‌ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top