స్కూళ్లు తెరుచుకోక.. వేతనాలు రాక

Private School Teachers Suffering With Lockdown No Wages - Sakshi

బతుకుదెరువు కరువైన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు

సింగరేణి(కొత్తగూడెం): కరోనా ప్రభావంతో ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 223 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 7వేలమందికి పైగా ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికీ సగటున రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనాలుంటాయి. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతపడినప్పటికీ..ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు కన్పిస్తోంది. మూడు నెలలుగా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల ఫీజులు నిలిచిపోయాయని, అవి రావాల్సి ఉందని, తిరిగి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యాకనే వేతనాలిస్తామని పలు యాజమాన్యాలు దాటవేస్తున్నట్లు సమాచారం. పాఠశాలల పునఃప్రారంభంపై ఎలాంటి స్పష్టతా లేదు. ప్రస్తుత పరిస్థితిలో సీనియారిటీని కూడా లెక్కలోకి తీసుకోకుండా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని, కొన్ని యాజమాన్యాలు జూనియర్‌ ఉపాధ్యాయులను తొలగించే చర్యలు చేపట్టినట్లు సమాచారం. కేవలం కొందరిని మాత్రమే తిరిగి విధుల్లోకి తీసుకుంటారని ప్రైవేట్‌ టీచర్లు మరింత ఆందోళన చెందుతున్నారు.

కరోనా ప్రభావంతోనే..
కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ అమలు కావడంతో మార్చి నుంచి అన్నీ బంద్‌ అయ్యాయి. జీతాలు ఆగిపోయి..చాలామంది ఇబ్బంది పడుతున్నాం. తిరిగి స్కూళ్లు తెరిస్తేనే..ప్రైవేట్‌ టీచర్లకు ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.– భాగ్యరాజ్, ప్రైవేటు స్కూల్‌ టీచర్,కొత్తగూడెం

ఇంకా స్పష్టత లేదు..
అరకొర వేతనాలతో పనిచేసిన వారికి ఇప్పుడు ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియట్లేదు. ప్రైవేటు ఉపాధ్యాయులు చాలా కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. వీరి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి.
– షేక్‌ అస్లాం, ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్,కొత్తగూడెం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top