ఓపెన్ స్కూల్ సొసైటీలో అర్హతలేని ఉపాధ్యాయులు
లేని పోస్టులు సృష్టించి ఉపాధ్యాయ సంఘం నేతల నియామకం!
మంత్రి లోకేశ్ సూచనలతో కదులుతున్న ఫైల్?
సాక్షి, అమరావతి: దూరవిద్యలో పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు అందించే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) టీడీపీ అనుయాయులకు అడ్డాగా మారుతోంది. అర్హతలు లేకున్నా, పార్టీకి సేవలు చేస్తామంటే చాలు కీలకమైన పోస్టులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఏకంగా విద్యాశాఖ మంత్రి లోకేశ్ కార్యాలయం నుంచే ఫైళ్లు కదులుతున్నట్టు వినికిడి. కార్యాలయం ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఆగమేఘాలపై ఫైల్ పెట్టడం విస్తుగొల్పుతోంది. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీలో కీలకమైన జిల్లా సమన్వయకర్త పోస్టులను టీడీపీ వర్గానికి చెందిన టీచర్స్ యూనియన్ నేతలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే తమవారికోసం కొత్తగా అసిస్టెంట్ కో ఆర్డినేటర్ పోస్టులను సైతం సృష్టించడం గమనార్హం.
ఈ పోస్టులకు ప్రభుత్వ, జెడ్పీ హైస్కూళ్లలో ఐదేళ్ల సర్వీసుతో పాటు 50 సంవత్సరాల వయసు గల స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను మాత్రమే కింద నియమించాలి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా 58 నుంచి 60 ఏళ్ల వయసు గల మున్సిపల్ ఉపాధ్యాయులను ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్లుగా నియమిస్తుండడం గమనార్హం. పైగా టీడీపీ వర్గానికి చెందిన ఉపాధ్యాయ సంఘం నాయకులను ఈ పోస్టుల్లో నియమిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
యూనియన్ నాయకులకే పోస్టులు
నిబంధనల ప్రకారం ఏదైనా ఉపాధ్యాయ సంఘంలో కీలక పదవుల్లో ఉన్న ఉపాధ్యాయులు, పీఈటీలు, మున్సిపల్ టీచర్లకు ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్లుగా నియమించకూడదు. ప్రస్తుతం వీటన్నింటినీ ఉల్లంఘించి ఒక ఉపాధ్యాయ సంఘానికి చెందిన ఆరుగురు నాయకులను జిల్లాల కో ఆర్డినేటర్లుగా నియమిస్తున్నారు. వీరిలో ఒకరు ఇప్పటికే ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్‌గా పనిచేస్తుండగా, ఆయన పదవి కాలపరిమితిని పొడిగిస్తున్నారు. ఆయన గతంలో పీఆర్టీయూ నాయకుడిగా ఉన్నప్పుడు దరఖాస్తును తిరస్కరించి, ఆ పదవికి రాజీనామా చేసిన అనంతరం కో ఆర్డినేటర్ పోస్టు ఇచ్చారు.
ఆయనే ఇప్పుడు కొత్తగా టీడీపీ అనుకూల టీచర్స్ యూనియన్‌ను ఏర్పాటు చేసి రాష్ట్ర కార్యవర్గంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మిగిలిన ఐదుగురు కూడా ఇదే యూనియన్ నాయకులు కావడం గమనార్హం. 2021లో ఐదుగురు జిల్లా, ఏడుగురు స్టేట్ కో ఆర్డినేటర్లను నియమించారు. అప్పుడు ఐదేళ్ల కనీస సర్వీసుతో పాటు 50 ఏళ్లలోపు వయసు గల ప్రభుత్వ, జెడ్పీ స్కూల్ అసిస్టెంట్లను మాత్రమే నియమించారు. మున్సిపల్ టీచర్లు, పీఈటీలకు అర్హత లేదని ప్రకటించారు. ఏడాది కిందట కూడా ఈ పోస్టుల్లో ఉపాధ్యాయులకు అర్హత లేదని విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లను నియమించారు. కానీ ఇప్పుడు ఏకంగా ఉపాధ్యాయ యూనియన్ నాయకులనే నియమిస్తుండడం విస్తుగొల్పుతోంది.
రాజకీయ ప్రయోజనాలతో నియామకాలు
తాజాగా ఆరుజిల్లాల్లో పోస్టుల భర్తీకి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో పూర్తిగా రాజకీయ ప్రయోజనాలతో తమ వర్గానికి చెందిన యూనియన్ నేతలను నియమించేందుకు రంగం సిద్ధం చేశారు. తుది జాబితాలో ఉన్న ఉపాధ్యాయుల అర్హతలను పరిశీలిస్తే.. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని జెడ్పీ హైస్కూల్ ప్లస్‌లో పనిచేస్తున్న డాక్టర్ జయప్రకాష్‌నాయుడు వయస్సు 58 ఏళ్లు. వయసు రీత్యా ఆయనకు అర్హత లేకపోయినా జిల్లా కోఆర్డినేటర్‌గా నియమిస్తున్నారు.
వైఎస్సార్ కడప జిల్లా కాజీపేట మండలం సి.కొత్తపేట జెడ్పీ హైస్కూల్లో పీఈటీగా పనిచేస్తున్న ఎ.బి. రామకృష్ణరాజు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాండవ ఎంపీయూపీ స్కూల్ ఎస్జీటీ పి.వి.సత్యనారాయణరాజు, విజయవాడ పటమట మున్సిపల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు జె.శ్రీనివాసరావు, గుంటూరు వేణుగోపాలనగర్లోని మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయుడు బి.హైమారావులకు ఈ పదవులకు అర్హత లేదు. ఈ నలుగురి కోసం కొత్తగా అసిస్టెంట్ కో ఆర్డినేటర్ పోస్టులను సృష్టించారు. అనకాపల్లి జిల్లా కొలకలపూడి జెడ్పీ హైస్కూల్‌లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ టి.వెంకటరమణ జాబితాలో ఉన్నారు. అనర్హులకు పోస్టులు ఇవ్వడం, లేని పోస్టును సృష్టించడం ఉపాధ్యాయ సంఘాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


