బాబోయ్‌! అంబులెన్స్‌.. విమానం మోత!

Private Ambulance Charges Rises in Hyderabad - Sakshi

కోవిడ్‌ పరీక్షలు.. డిశ్చార్జి.. ఇలా ఏదైనా..  

హైటెక్‌ సిటీ– ఈఎస్‌ఐకి రూ.25 వేలు  

5 కి.మీటర్లకు రూ.7500 వసూలు  

ఆక్సిజన్‌తో అయితే రూ.10 వేలు

పిలిస్తే పలకని 108 వాహనం  

నగరంలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ల దోపిడీ

సాక్షి, సిటీబ్యూరో: జేబులో రూ.10 వేలు ఉంటే ఏకంగా విమానంలో హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌ వెళ్లొచ్చు. బ్యాంకాక్‌ పోవచ్చు. ఢిల్లీకి వెళ్లి తిరిగి రావచ్చు. కానీ ఇప్పుడు నగరంలో  కోవిడ్‌ రోగిని తీసుకొని అంబులెన్స్‌లో పట్టుమని 10కి.మీటర్లు కూడా వెళ్లలేం. నిజమే. ఆపదలో ఉన్న పేషెంట్‌కు ఆక్సిజన్‌ సదుపాయం ఉన్నఅంబులెన్స్‌లో 5 కి.మీ తీసుకెళ్లాలంటే ఏకంగా రూ.10 వేలుచెల్లించాల్సిందే. అర్ధరాత్రి, అపరాత్రి అయితే ధరలు మరింత భగ్గుమంటాయి. ఎంత డిమాండ్‌ చేస్తే అంత  చెల్లించకతప్పడం లేదు. వారం రోజుల క్రితం ఓ కరోనా బాధితుణ్ని సనత్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ కిమ్స్‌కు తీసుకెళ్లేందుకు రూ.7500 డిమాండ్‌ చేసినట్లు అతని బంధువులు విస్మయం వ్యక్తం చేశారు. ఈఎస్‌ఐ నుంచి మలక్‌పేట్‌ వరకు రూ.15 వేలు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 108 అంబులెన్సులు అరకొరగా ఉండడం, సకాలంలో ఆదుకోకపోవడంతో ప్రజలు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

దీన్ని ఆసరా చేసుకొని ప్రైవేట్‌ అంబులెన్స్‌ల నిర్వాహకులు, డ్రైవర్లు రోగులపై నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. కరోనా వైద్యం పేరిట రూ.లక్షలు దండుకుంటున్న ‘కాసు’పత్రులకు ఏ మాత్రం తీసిపోని విధంగా అంబులెన్స్‌ల దోపిడీ కొనసాగుతోంది. దీంతో కరోనా రోగులకు  వైద్యమే కాదు, అంబులెన్స్‌ సేవలు కూడా భారంగానే మారాయి. చాలా చోట్ల 108 వాహనాలు చేతులెత్తేయడంతో ఈ దుస్థితి నెలకొంటున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు చనిపోతే అంబులెన్స్‌ల బేరానికి అడ్డూ అదుపూ అందడంలేదు. ఇటీవల హైటెక్‌ సిటీలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో కోవిడ్‌తో చనిపోయిన రోగి మృతదేహాన్ని ఈఎస్‌ఐ శ్మశానవాటికకు తరలించేందుకు రూ.25 వేలు వసూలు చేశారు.  ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోతే ప్రభుత్వమే ఆ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలిస్తుంది. కానీ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చనిపోతే మాత్రం చాలా దారుణంగా ఉంది. అప్పటికే ఆ కుటుంబం ఐసోలేషన్‌లో ఉంటుంది. అంబులెన్స్‌ డ్రైవర్‌ ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే’ అని సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు సాయితేజ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి బతికి ఉన్నా, చనిపోయినా అంబులెన్స్‌ల దోపిడీ మాత్రం భయంకరంగానే ఉంటుందని విస్మయం వ్యక్తం చేశారు.

పుట్టగొడుగుల్లా వచ్చేస్తున్నాయి..
ప్రభుత్వ లెక్కల ప్రకారం 108 వాహనాలు గ్రేటర్‌ హైదరాబాద్‌లో 45 మాత్రమే ఉన్నాయి. కానీ కరోనా దృష్ట్యా మరికొన్నింటిని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అయినా ఈ  వాహనాలు సకాలంలో బాధితులను ఆదుకోలేకపోతున్నాయి. దీంతో చాలా మంది ప్రైవేట్‌ అంబులెన్స్‌లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని చాలామంది  తమ వాహనాల్లో అప్పటికప్పుడు మార్పులు చేసి ‘అంబులెన్స్‌’లుగా డెస్టినేషన్‌ బోర్డులు తగిలిస్తున్నారు. ‘సైరన్‌’లో బిగిస్తున్నారు. ఇలా ఏ ప్రభుత్వ విభాగం అనుమతి లేని  అంబులెన్స్‌లు నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సాధారణంగా వాహనాల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసినా ఆర్టీఏ అనుమతి తప్పనిసరి. ఆక్సిజన్‌ సిలిండర్లను వినియోగించేందుకు తూనికలు– కొలతలు శాఖ నుంచి కూడా  అనుమతి పొందాల్సి ఉంటుంది. కానీ కరోనా ఆపత్కాలాన్ని సొమ్ము చేసుకొనేందుకు కొంతమంది వాహనదారులు ఎలాంటి అనుమతులు లేకుండానే అంబులెన్స్‌ సర్వీసులను  ప్రారంభిస్తున్నారు. మారుతీ ఓమ్ని, మెటాడోర్, వింగ్లర్‌ వంటి వాహనాల్లో పడకలను, ఆక్సిజన్‌ సిలిండర్లు, సైరన్‌లు ఏర్పాటు చేసుకొని ప్రైవేట్‌ ఆస్పత్రులతో ఒప్పందాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు, ఈ తరహా అంబులెన్స్‌లు కలిసి తమ అక్రమార్జనకు పాల్పడుతున్నాయి. డిశ్చార్జి పేషెంట్లను కూడా వదలకుండా దోచుకుంటున్నాయి. ఏ ప్రభుత్వ విభాగం కూడా అంబులెన్స్‌ల దోపిడీని అరికట్టలేకపోవడం గమనార్హం. రవాణా శాఖ పూర్తిగా ప్రేక్షక పాత్రకే పరిమితమైంది.  

అంబులెన్స్‌ అంటేనే భయమేస్తోంది..   
సాధారణంగా అంబులెన్స్‌ అంటే ప్రాణాలు కాపాడుతుందనే భావన ఉంటుంది. ఆపదలో ఉన్నవాళ్లకు ఊపిరి పోస్తుంది. రోడ్డు మీద అంబులెన్స్‌ కనిపిస్తే తప్పనిసరిగా దారి ఇస్తాం. కానీ ఇప్పుడు అంబులెన్స్‌లు బెంబేలెత్తిస్తున్నాయి. సిటీలో కనీసం 5 కి.మీ దూరం వెళ్లాలంటే రూ.10 వేలు ఉండాల్సిందే.– సాయితేజ, హైటెక్‌ సిటీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top