ప్రగతి నివేదన సభకు తరలిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

Pragathi Nivedana Sabha Warangal TRS Leaders - Sakshi

భూపాలపల్లి (వరంగల్‌): జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రగతి నివేదన సభకు భారీగా తరలి వెళ్లారు. శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి పరోక్షంగా, మంత్రి చందూలాల్, ఎమ్మెల్యే పుట్ట మధు వాహనాలను పంపించి జనాల తరలింపులో సఫలీకృతమయ్యారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి సుమారు 100 ఆర్టీసీ బస్సుల్లో 6 వేల మంది, 90 డీసీఎంలలో 5 వేలు, 75 స్కూల్‌ బస్సుల్లో 3 వేలు, 60 ట్రాక్టర్లలో 1,500, వంద కార్లలో 700 మందిని ప్రగతి నివేదన సభకు తరలించారు. అలాగే మంత్రి చందూలాల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను భారీ మొత్తంలోనే తరలించారు.

నియోజకవర్గం నుంచి 100 ఆర్టీసీ బస్సులు, 64 ప్రైవేట్‌ బస్సులు, 25 మినీ బస్సులు, 50 స్కూల్‌ బస్సులు, 49 డీసీఎంలు, 50 టెంపో టాక్సీలు, 151 టవేరా వాహనాల్లో సుమారు 18 వేల మందిని తరలించారు. అలాగే మంథని నియోజకవర్గంలోని కాటారం, మహముత్తారం, మల్హర్, మహదేవ్‌పూర్, పలిమెల మండలాల నుంచి 190 ప్రైవేట్‌ వాహనాలు, 20 స్కూల్, ప్రైవేట్‌ బస్సులతోపాటు ఇతర వాహనాల్లో సుమారు 3,500 మందిని ఎమ్మెల్యే పుట్ట మధు తరలించారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 37,500 మంది ప్రగతి నివేదన సభకు తరలివెళ్లినట్లు సమాచారం.

పోటాపోటీగా.. 
పనితీరు ఆధారంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందనే ప్రచారం టీఆర్‌ఎస్‌లో ఊపందుకోవడంతో జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రగతి నివేదన సభను సవాల్‌గా తీసుకున్నారు. ఒకరి కంటే ఒకరు పోటీగా వాహనాలను సమకూర్చి జనాలను తరలించారు. ప్రజాప్రతినిధులతో పాటు టికెట్లు ఆశిస్తున్న వారు సైతం తమ బలాన్ని చూపించుకోవడం కోసం తాపత్రయపడ్డారు. అనుకూలంగా ఉన్న మండలాలు, గ్రామాలకు వాహనాలను పంపించి టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజలను తరలించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో శాసన సభాపతి మధుసూదనాచారితోపాటు గండ్ర సత్యనారాయణరావు కూడా సభకు ప్రజలను తరలించినట్లు తెలిసింది.

ఇబ్బందుల్లో ప్రయాణికులు.. 
సభ కారణంగా సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జిల్లాలో ఏకైక భూపాలపల్లి బస్‌డిపోలో 81 బస్సులు ఉండగా అందులో 71 బస్సులు సభకు వెళ్లాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top