వ్యవసాయానికి వెన్నెముకగా కోళ్ల పరిశ్రమ

Poultry industry Backbone to the Agriculture - Sakshi

     కేంద్ర పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి చౌదరి 

     హైటెక్స్‌లో కోళ్ల ప్రదర్శన–2018 ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో వ్యవసాయ అనుబంధంగా కోళ్ల పరిశ్రమపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తూ పేదలకు మాంసం, గుడ్ల రూపంలో పౌష్టికాహారం అందిస్తున్నాయని కేంద్ర పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ ఓపీ చౌదరి పేర్కొన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కోళ్ల రంగం ఏటికేటికీ వృద్ధి సాధిస్తున్న దృష్ట్యా.. మరింత అభివృద్ధి చెందేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపుతున్న కీలక వ్యవసాయానికి వెన్నెముకగా నిలిచిందని చెప్పారు. హైదరాబాద్‌ మాదాపూర్‌ హైటెక్స్‌ ప్రాంగణంలో ఇండియన్‌ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌–ఐపీఈఎంఏ ఆధ్వర్యంలో మూడ్రోజుల పాటు జరగనున్న పౌల్ట్రీ ఇండియా–2018ను ఆయన ప్రారంభించారు. హైటెక్స్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 5 డూమ్‌ల్లో 326 వరకు స్టాళ్లు కొలువు తీరాయి. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పౌల్ట్రీ పరిశ్రమలు, ఫీడ్, క్లీనింగ్, ఔషధ పరిశ్రమలు తమ ఉత్పత్తులు పదర్శిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పౌల్ట్రీ రంగంలో వస్తున్న అనూహ్యమైన మార్పులకు అనుగుణంగా విజ్ఞానం, అంతర్జాతీయస్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ యంత్రాలు, పనిముట్లు ప్రదర్శిస్తున్నారు. తొలి రోజు పెద్దసంఖ్యలో సందర్శకులు, పౌల్ట్రీ రైతులు, యువత, ఔత్సాహికుల తాకిడి కనిపించింది. ఉత్పత్తి, ఉత్పాదకత వ్యయం తగ్గించుకుంటూ ముందుకు వెళితే నికర లాభాలు ఆర్జించేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా అన్నారు.

తెలంగాణలో పౌల్ట్రీ అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉన్న భారత్‌.. రాబోయే రోజుల్లో రెండో స్థానానికి వెళ్లేందుకు కృషి చేస్తున్నామని ఇండియన్‌ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌– ఐపీఈఎంఏ అధ్యక్షుడు హరీశ్‌ గర్వార్‌ స్పష్టం చేశారు. దక్షిణాసియా స్థాయి ప్రదర్శనలో నాఫెడ్‌ సంస్థ డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌ ఠాకూర్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, ఇంటర్నేషనల్‌ ఎగ్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సురేశ్‌ చిట్టూరి రాయుడు, ఇండియన్‌ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌– ఐపీఈఎంఏ కార్యదర్శి చక్రధర్,  రాష్ట్ర బ్రీడర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ జి.రంజిత్‌రెడ్డి, నేషనల్‌ ఎగ్‌ కో–ఆర్డినేషన్‌ అధ్యక్షుడు సుబ్బరాజు, తెలుగు రాష్ట్రాల పౌల్ట్రీ సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top