ఆకు‘పచ్చ’ని విషం!

Pollutant contents in foodstuffs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆహార పదార్థాల్లో కాలుష్య ఆనవాళ్లు గ్రేటర్‌ నగరవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు, నగరాలతో పోలిస్తే ఇక్కడ విక్రయిస్తున్న పలు రకాల కూరగాయలు, ఆకుకూరల్లో 9 నుంచి 30 శాతం అధికంగా క్రిమిసంహారకాల ఆనవాళ్లు ఉన్నట్లు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) తాజా పరిశోధనలో తేలింది. దీంతో జీవనశైలి వ్యాధుల ముప్పు పెరుగుతోందని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న పలు రకాల కూరల్లో ప్రధానంగా ఆర్గానో క్లోరిన్‌ అనే క్రిమి సంహారక మోతాదు అధికంగా ఉన్నట్లు స్పష్టమైంది.

శరీరంలోని కొవ్వుల్లో నిల్వ..
ఆకుకూరలు, కూరగాయల్లో ఉండే క్రిమిసంహారకాలు ఆహార పదార్థాల ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తే సుమారు 20 ఏళ్లపాటు అలాగే తిష్టవేసే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం హెచ్చరించింది. కొన్ని రకాల క్రిమిసంహారకాల అవశేషాలు దేహంలోని కొవ్వు కణాల్లో నిల్వ ఉంటాయని.. పలు రకాల అనారోగ్య సమస్యలకు ఇవి కారణమౌతాయని తేలింది.

దేశం లో సరాసరిన 10 శాతం మధుమేహ బాధితు లుండగా.. హైదరాబాద్‌లో సుమారు 16 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో మధుమేహ బాధితులు పెరిగేందుకు ఆర్గానో క్లోరిన్‌ ఆనవాళ్లు ఉన్న ఆహార పదార్థాలు తినడమే కారణమని జర్నల్‌ ఆఫ్‌ ఎండోక్రైన్‌ సొసైటీ తాజా జర్నల్‌లోనూ ప్రచురితమవడం గమనార్హం.

9 - 30 - రాష్ట్రంలోని ఆహార పదార్థాల్లో విష రసాయనాల శాతం
10% - దేశంలో సరాసరిన మధుమేహ బాధితులు
16% -నగరంలో మధుమేహంతో బాధపడుతున్నవారు

ఆర్గానోక్లోరిన్‌...
ఆకుకూరలు, కూరగాయల పంటలకు పట్టిన చీడపీడల నివారణకు క్రిమిసంహారకంగా ఉపయోగించే క్లోరినేటెడ్‌ హైడ్రోకార్భన్స్‌ ఆధారిత రసాయనాన్ని ఆర్గానోక్లోరిన్‌ అని పిలుస్తారు.
ప్రధానంగా వీటిల్లో..
పాలకూర, గోంగూర, తోటకూర, క్యాబేజి, బెండకాయ, వంకాయ.

తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో ఇలా..
తమిళనాడులో విక్రయిస్తున్న ఆకుకూరలు, కూరగాయల్లో మూడు నుంచి 9 శాతం ఆర్గానో క్లోరిన్‌ అవశేషాలుండగా.. హైదరాబాద్‌లో బహిరంగ మార్కెట్లు, సంతల్లో విక్రయిస్తున్న కూరగాయల్లో సుమారు 9 నుంచి 30 శాతం అధికంగా వీటి అవశేషాలున్నట్లు ఈ అధ్యయనం హెచ్చరించింది.

మధుమేహానికి దోహదం..
తెలుగు రాష్ట్రాల్లో శరీర బరువు తక్కువగా ఉన్నవారు.. రక్తంలో కొవ్వు మోతాదు తక్కువ ఉన్నవారు సైతం మధుమేహవ్యాధి బారిన పడేందుకు ఆర్గానో క్లోరిన్‌ క్రిమిసంహారక ఆనవాళ్లు ఆహార పదార్థాల్లో చేరడమే ప్రధాన కారణమని వెల్లడించింది. మరోవైపు ఆర్గానో క్లోరిన్‌ క్రిమిసంహారకాల తయారీ దేశంలో అధికంగా జరుగుతోందని.. లిండేన్‌ వంటి నిషేధిత క్రిమిసంహారకాన్ని సైతం దేశంలో పలు ప్రాంతాల్లో విరివిగా వినియోగిస్తుండటంతో పలు అనర్థాలు తలెత్తుతున్నాయంది. తలసరి క్రిమిసంహారకాల వినియోగంలోనూ తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉండటం గమనార్హం.

పరిష్కారం ఇదే..
బహిరంగ మార్కెట్లు, సంతల్లో కొనుగోలు చేసిన కూరగాయలను ఉప్పునీళ్లతో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఆయా కూరగాయలు, ఆకుకూరలను బాగా ఉడికించి తినాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top