ఆ ఊరికి పోలింగ్‌ ఆమడ దూరం

Polling Booth Problems In Karimnagar - Sakshi

ఓటు వేయాలంటే ఐదు కిలోమీటర్లు వెళ్లాలి

చామన్‌పల్లి గ్రామస్తులకు దుబ్బపల్లిలో పోలింగ్‌కేంద్రాలు

సాక్షి, కరీంనగర్‌రూరల్‌: భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటే ఈ గ్రామస్తులు మరో ఊరికి పోవాల్సిందే. దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లి ఓట్లు వేయాల్సిన పరిస్ధితి ప్రస్తుతం ఏర్పడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఓట్లేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ ఊరిలోనే పోలింగ్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని స్ధానిక ప్రజాప్రతినిధులు అధికారులను కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే కొత్త పోలింగ్‌స్టేషన్ల ఏర్పాటులో ఎన్నికల సంఘం నిబంధనలు అడ్డురావడంతో అధికారులు పాత విధానంలోనే పోలింగ్‌ను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

కొత్త గ్రామపంచాయతీతో సమస్య..
ప్రభుత్వం దుబ్బపల్లిని కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయడంతో చామన్‌పల్లి పంచాయతీవాసులకు కొత్త సమస్య ఏర్పడింది. కొత్త గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. కరీంనగర్‌ మండలంలోని 17 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 46,597  మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 23,217, మహిళలు 23,379 మంది ఉన్నారు. మొత్తం 65 పోలింగ్‌స్టేషన్లు ఉన్నాయి. గతంలో చామన్‌పల్లి పంచాయతీ పరిధిలో ఉన్న శివారు గ్రామం దుబ్బపల్లిని గత ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది.అయితే దుబ్బపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న జెడ్పీ పాఠశాలలోనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సైతం ఈ పాఠశాలలో చామన్‌పల్లి, దుబ్బపల్లి గ్రామాలకు కలిపి మొత్తం 5 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చామన్‌పల్లిలో ప్రస్తుతం మొత్తం ఓటర్లు 2357 మంది ఉండగా వీరిలో పురుషులు 1145, మహిళలు 1212 మంది ఉన్నారు. ఈ ఓటర్లందరికీ 85, 86, 87, 88 నంబర్‌ గల పోలింగ్‌స్టేషన్లు  ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొత్త గ్రామపంచాయతీ దుబ్బపల్లిలో 571 మంది ఓటర్లు ఉండగా పురుషులు 289, మహిళలు 282 మంది ఉన్నారు. వీరందరికీ 89 నంబర్‌ పోలింగ్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు.

ఐదు కిలోమీటర్లు పోవాల్సిందే..
చామన్‌పల్లి నుంచి దుబ్బపల్లి గ్రామపంచాయతీ దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దుబ్బపల్లిలోని జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం దుబ్బపల్లిలోనే పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఓటు వేయడానికి చామన్‌పల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటోలు, ద్విచక్రవాహనాలు అందుబాటులో లేకపోవడంతో పలువురు ఓటర్లు నడుచుకుంటు వెళ్లాల్సి వచ్చింది. పలువురు వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఓటు వేసేందుకు ముందుకురాకపోవడంతో స్థానిక నాయకులు ఆటోలను ఏర్పాటు చేశారు.  

ఆటోల్లో ఓటర్లను తరలించడాన్ని అధికారులు అడ్డుకోవడంతో పలు వివాదాలేర్పడ్డాయి. ఈక్రమంలో చామన్‌పల్లిలోనే పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్ధానిక నాయకులు విజ్ఞప్తి చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొత్త పోలింగ్‌స్టేషన్లను ఏర్పాటుచేయడంలో నెలకొన్న సాంకేతిక సమస్యలతో అధికారులు గతంలో ఉన్నట్లుగానే పోలింగ్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. దీంతో ఈనెల 11న జరిగే పోలింగ్‌లో చామన్‌పల్లి ఓటర్లు గతంలో మాదిరిగానే దుబ్బపల్లికి వచ్చి ఓటు వేయాల్సిన పరిస్ధితి నెలకొంది.  

ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలి
చామన్‌పల్లి నుంచి దుబ్బపల్లిలోని పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు వృద్ధులు, మహిళలు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ రోజున ఓటర్లను తరలించేందుకు అధికారులు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేయాలి.
– వడ్లకొండ పర్షరాములు, చామన్‌పల్లి

పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి
చామన్‌పల్లిలోని ప్రాథమిక పాఠశాలలో పోలింగ్‌ కేంద్రంను ఏర్పాటు చేయాలి. గ్రామపంచాయతీ ఎన్నికలప్పుడు తమ గ్రామంలోనే పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు దుబ్బపల్లిలో కేంద్రాలను ఏర్పాటు చేయడం తగదు.  దుబ్బపల్లికి వెళ్లి ఓటు వేయడం వృద్ధులు, మహిళలకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది.
– బోగొండ లక్ష్మి, సర్పంచ్, చామన్‌పల్లి

పాత పోలింగ్‌ కేంద్రాల్లోనే..
కొత్త పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనలతో ప్రస్తుతం కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉన్న కేంద్రాల్లోనే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం.
– జి.కుమారస్వామి, తహసీల్దార్, కరీంనగర్‌రూరల్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top