
సైదాబాద్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక వ్యూహం రూపొందిస్తున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. వాస్తవంగా సాధారణ సమయంలోనే నగర పోలీసులకు గణేశ్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేయడం ఓ సవాల్. ఇదే సమయంలో అటు పదోన్నతులు, ఇటు ఎన్నికల ఎఫెక్ట్‌తో ఇన్‌స్పెక్టర్లు భారీ సంఖ్యలో బదిలీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్వాల్ అంజనీ కుమార్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. గతానికి భిన్నంగా జోన్ల వారీగా ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటిలో ఎస్సైలకూ భాగస్వామ్యం కల్పిస్తూ వారి పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు జవాబుదారీతనం పెంచుతున్నారు. ఇప్పటికే సెంట్రల్ జోన్‌కు పూర్తి కాగా ఆదివారం కొత్వాల్ దక్షిణ మండల అధికారులతో భేటీ అయ్యారు. బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ అధికారులూ పాల్గొన్నారు.
గతంలో ఒకే సమావేశం...
‘గణేశ్’ సన్నాహాల్లో భాగంగా ప్రతి ఏడాది పోలీసు విభాగానికి సంబంధించి కొత్వాల్ ఒకే సమావేశం నిర్వహిస్తుంటారు. ఇందులో కీలక ఆదేశాలు జారీ చేసిన తర్వాత జోన్ల వారీగా ఆయా డీసీపీలు ఎస్సై తదితర స్థాయి అధికారులతో సమావేశం అవుతుంటారు. అయితే ఈసారి పదోన్నతులు, బదిలీల ఎఫెక్ట్ భారీగా ఉంది. ఇటీవల ఇన్‌స్పెక్టర్ నుంచి డీఎస్పీలుగా నగరానికి చెందిన దాదాపు 20 మంది స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌ఓ) పదోన్నతి పొందారు. దీనికి తోడు ఎన్నికల వేడి నేపథ్యంలో ఈసీ నిబంధనల ప్రకారం నిర్ణీత కాలం సిటీలో పని చేసిన ఇన్‌స్పెక్టర్లకు బయటకు పంపకం తప్పదు. ఈ సంఖ్య దాదాపు 100కు పైగా ఉంది. ఈ ఎఫెక్ట్ గణేష్ ఉత్సవాలతో పాటు మొహరం బందోబస్తుపైనా ఉండకూడదని కొత్వాల్ అంజనీ కుమార్ నిర్ణయించారు. దీనికోసం ఆయనే స్వయంగా రంగంలోకి దిగి ఒకే సమావేశానికి బదులు జోన్ల వారీగా సమీక్షలు చేస్తూ ఎస్సైలనూ వీటికి పిలుస్తున్నారు. ఎస్సై స్థాయి అధికారులు ఠాణాలోకి సెక్టార్స్‌కు నేతృత్వం వహిస్తుంటారు. ఈ చర్యలతో సెక్టార్ల వారీగా గణేష్ మండపాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అవుతోంది.
ఒక్కో జోన్ తీరు ఒక్కోలా...
వీటితో పాటు జోన్ల వారీగా సమావేశాలు నిర్వహించడానికి మరో కారణం ఉందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. నగరంలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ పేర్లతో మొత్తం ఐదు జోన్లు ఉన్నాయి. దక్షణ మండలంలో సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువ. ఆపై తూర్పు, పశ్చిమ మండలాల్లోనూ ఈ ఛాయలు ఉంటాయి. ఉత్తర మండల వీటికి పూర్తి భిన్నం కాగా... హుస్సేన్‌సాగర్‌తో కూడిన సెంట్రల్ జోన్ నిమజ్జనానికి కేంద్రం. ఇలా ఒక్కో జోన్ తీరు ఒక్కోలా ఉండటంతో పాటు అక్కడి పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. మండలాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న కొత్వాల్ అక్కడి అవసరాలకు తగ్గట్టు చర్యలకు ఆదేశిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి మండపం పైనా పోలీసులకు పూర్తి పట్టు ఉండాలని, ఎస్సైలు స్వయంగా వెళ్ళి పరిస్థితులు గమనిస్తుండాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. మరోపక్క ఫ్లాగ్ మార్చ్‌లు సైతం పోలీసు స్టేషన్ల వారీగా నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలు కలిసి తమ పరిధిలో కాలినడకన తిరుగుతూ ఆ ప్రాంతంపై పూర్తి పట్టు సంపాదించడాన్నే ఫ్లాగ్‌మార్చ్ అని పిలుస్తారు.
అతి చిన్న విషయాల పైనా దృష్టి...
బందోబస్తు, భద్రత ఏర్పాట్లలో భాగంగా పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ప్రతి చిన్న అంశాన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. కేవలం మండపాలు, వాటి వద్ద పరిస్థితులే కాకుండా నిమజ్జనం జరిగే ప్రాంతాలు, ఆ మార్గాలనూ పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒక్కోసారి రహదారిలో ఉన్న గుంతల కారణంగా లారీల్లో వస్తున్న విగ్రహాలు ధ్వంసం కావడం, తర్వాత ఇతర సమస్యలు రావడం జరుగుతుంది. ఈ నేపథ్యలలోనే ఆయా సెక్టార్లలో నిమజ్జనానికి వచ్చే గణేషులు ప్రయాణించే మార్గాలు ఏమిటి? అక్కడి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడెక్కడ మరమ్మతులు చేయాలి? చెట్లు అడ్డంకిగా మారే అవకాశం ఉందా? ఇలాంటి ప్రతి విషయానికీ ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా స్పష్టం చేశారు. నగర కమిషనరేట్‌లో మొత్తం 17 సబ్–డివిజన్లు, 60 ఠాణాలు ఉన్నాయి. డివిజన్‌కు ఏసీపీ, ఠాణాకు ఇన్‌స్పెక్టర్లు నేతృత్వం వహిస్తుంటారు. వీరు సైతం తమ పరిధిలో ఉండే జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్క్స్, విద్యుత్ తదితర శాఖలతో సమన్వయ, సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని కొత్వాల్ ఆదేశించారు. అసాంఘిక శక్తులతో పాటు రౌడీషీటర్ల పైనా కన్నేసి ఉంచాలని, అవసరమైన వారికి కౌన్సిలింగ్‌నిర్వహణ, బైండోవర్ చేయడం వంటివి చేపట్టాలని కొత్వాల్ ఆదేశించారు.
ప్రతి కేసు పైనా ప్రత్యేక దృష్టి...
కొత్వాల్ ఓపక్క గణేష్ సన్నాహక సమావేశంతో పాటు త్రైమాసిక నేర సమీక్షనూ నిర్వహిస్తున్నారు. ఎస్సైల వారీగా వారు దర్యాప్తు చేస్తున్న కేసుల వివరాలు, వాటి తీరు తెన్నుల్ని సమీక్షిస్తున్నారు. కేవలం నేరస్తుల్ని పట్టుకోవడంతో బాధ్యత పూర్తయి పోదని, దోషులకు శిక్షపడేలా చూడాలని స్పష్టం చేశారు. దర్యాప్తు, విచారణల్లో ప్రతిభ కనబర్చిన వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. దక్షిణ మండలంలో పని చేస్తూ కేసుల దర్యాప్తులో ఉత్తమంగా పని చేసిన ఎస్సైలను ఆదివారం కొత్వాల్ అంజనీ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు టి.మురళీకృష్ణ, షికా గోయల్, డీసీపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.