ఆగస్టు చివర్లో ‘పోలీస్‌’ ప్రిలిమినరీ!

Police Preliminary at the end of August! - Sakshi

     18,428 పోస్టులకు ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ  

     7.19 లక్షల మంది దరఖాస్తు.. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖ విడుదల చేసిన 18,428 (సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ తదితర) పోస్టులకు 7,19,840 దరఖాస్తులు వచ్చినట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాస్‌రావు ఆదివారం తెలిపారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో మొదటి దశలో నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్ష ఆగస్టు చివరి వారంలో ఉంటుందని స్పష్టంచేశారు. ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. దరఖాస్తుల చివరి రోజు (జూన్‌ 30)న అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. 2015–16 ఏడాదిలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ కన్నా ఈ సారి 6 శాతం ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలిపారు. 

దరఖాస్తుల వివరాలు..
- సివిల్, ఏఆర్, బెటాలియన్, ఎస్‌పీఎఫ్‌ తదితర కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 4,79,166 మంది. 
సివిల్, ఏఆర్, బెటాలియన్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 1,88,715 మంది.  
ఐటీ విభాగం సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు 13,944 మంది, ఐటీ విభాగం కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకుంది 14,986 మంది.  
అసిస్టెంట్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో) పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులు 7,700. 
కానిస్టేబుల్‌ (డ్రైవింగ్‌) పోస్టులకు 13,458 దరఖాస్తులు, కానిస్టేబుల్‌ (మెకానిక్‌) పోస్టులకు వచ్చిన దరఖాస్తులు 1,871. 
మొత్తం దరఖాస్తుల్లో మహిళా అభ్యర్థులు 1,15,653 (16 శాతం) మంది. 
డ్రైవింగ్, మెకానిక్‌ విభాగంలో తప్ప మిగిలిన అన్ని విభాగాల్లోని సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్, వార్డర్‌ తదితర పోస్టులకు నల్లగొండ జిల్లా నుంచే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. డ్రైవింగ్, మెకానిక్‌ విభాగాల పోస్టులకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. 
51 శాతం దరఖాస్తులు కేవలం జూన్‌ 25 నుంచి జూన్‌ 30లోపు వచ్చినవే. అలాగే జూన్‌ 29 ఒక్కరోజే 75,516 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.  
దరఖాస్తుదారుల్లో 78 శాతం మంది అభ్యర్థులు తెలుగు మీడియంలో పరీక్ష రాసేందుకు ఆప్షన్‌ ఇవ్వగా, 21 శాతం మంది ఇంగ్లిష్, 0.22 అభ్యర్థులు ఉర్దూ మీడియంలో రాసేందుకు ఆప్షన్లు ఇచుకున్నారు. 
దరఖాస్తుదారుల్లో బీసీ కేటగిరీకి చెందిన వారు 52 శాతం కాగా, ఎస్సీ కేటగిరీ నుంచి 21 శాతం, ఎస్టీ కేటగిరీ నుంచి 17 శాతం, 9.5 శాతం ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులున్నారు. అలాగే 10,527 మంది ఎక్స్‌సర్వీస్‌మెన్లు కూడా వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top