మీ త్యాగం.. అజరామరం

Police Police Commemoration Day Celebrations In Adilabad - Sakshi

నేడు పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం

1959 అక్టోబర్‌ 21న లడక్‌ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న పదిమంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు చైనా సైనికులతో విరోచితంగా పోరాడి ప్రాణాలు త్యాగం చేశారు. వీరి స్మారకార్థంగా ప్రతి ఏడాది అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవాలని 1960 జనవరిలో జరిగిన రాష్ట్రాల పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సమావేశంలో నిర్ణయించారు. అప్పటి నుంచి విధి నిర్వహణలో అమరులైన వారిని స్మరిస్తూ సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా త్యాగాలను స్మరించుకుందాం. 

సాక్షి, అదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో 28 ఘటనలు జరుగగా మొత్తం 48మంది పోలీసు అధికారులు, కానిస్టేబుల్, హోంగార్డులు విధి నిర్వహణలో అసువులు బాశారు. వీరిని స్మరించుకునేందుకు ఏటా అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది. వీరి సేవలకు గుర్తుగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన అమర వీరుల స్మృతి స్థూపం ప్రతి సంవత్సరం పోలీసు ఉన్నత అధికారులతో పాటు సిబ్బంది అమర వీరుల కుటుంబాలతో కలిసి నివాళి అర్పిస్తారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తమ సహచరుల స్మారకార్థం ప్రతి ఏడాది అక్టోబర్‌ 15 నుంచి 21 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అమర వీరుల స్మారక వారోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు, ప్రజలకు పోలీసుల విధులపై అవగాహన కల్పిస్తారు. బాంబులు, తుపాకులు, గ్రేనేడ్లు, తదితర విస్పోటన వస్తువులు, డాగ్‌స్వా్కడ్, ఫింగర్‌ ప్రింట్స్‌ ఎలా సేకరిస్తారో అవగాహన కల్పిస్తారు.  రక్తదాన శిబిరం, విద్యార్థులు వ్యాసరచన పోటీలు, తదితర సామాజిక కార్యక్రమాలు చేపడుతారు. 

పోలీసు అమరుల జ్ఞాపకార్థం..
జాతీయ చిహ్నంలో మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమే పోలీస్‌. అని ఓ సినిమాలో హీరో చెప్పిన డైలాగ్‌ చాలా మందికి గుర్తుంటుంది. సమాజంలో రక్షణ లాగా ఉంటూ జిల్లాను శాంతియుతంగా ఉంచేందుకు అహర్నిషలు కృషి చేసి.. పలు ఘటనల్లో అమరులైన పోలీసులకు గుర్తుగా  ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఏ భవనం నిర్మించిన వారి పేర్లను పెడతారు. అందులో కొన్ని...
► సీఐ చక్రపాణి జ్ఞాపకార్థం జిల్లా పోలీసు పరేడ్‌ మైదానంలో చక్రపాణి మెమోరియల్‌ హాల్‌లు నిర్మించారు. 
► 1987 ఆగస్టు 18 అల్లంపెల్లి ఘటనకు     గుర్తుగా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో అల్లంపెల్లి కాంప్లెక్స్‌ నిర్మించారు. 
► బెల్లంపెల్లి పాతబస్తీ ఘటనలో అసువులు బాసిన హెడ్‌కానిస్టేబుళ్లు సంజీవ్‌కుమార్, శేషులను జ్ఞాపకార్థం పోలీస వ్యాయమశాల ఏర్పాటు చేశారు.
► ఉట్నూర్‌ కొమ్ముగూడెం ఘటనలో మరణించిన ఎస్సై బి. కోట్యనాయక్‌ స్మారకార్థం చిల్డ్రన్స్‌పార్కును ఏర్పాటు చేశారు. 
► ఖానాపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్సై మల్లేష్‌  జ్ఞాపకార్థం స్థూపాన్ని నిర్మించారు. ఇలా జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఏ భవన నిర్మాణం చేపట్టిన వాటికి అమరవీరుల పేర్లను పెట్టడం జరుగుతుంది. 

ఉమ్మడి జిల్లాలోజరిగిన సంఘటనలు ఇవే...
► జిల్లాలో 1987 ఆగస్టు 18న కడెం మండలంలోని అల్లంపెల్లిలో జరిగిన మొదటి ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ల దాడిలో ఇద్దరు ఎస్సైలు, పది మంది కానిస్టేబుళ్లు అమరులయ్యారు. 
► 1989 ఫిబ్రవరి 1న ఖానాపూర్‌–కడెం మండలాల్లోని సింగాపూర్‌ అడవుల్లో పోలీసు జీపును మందుపాతరతో పేల్చివేసిన ఘటనలో ఒక ఎస్సై, ఎడుగురు పోలీసులు మరణించారు. 
►1991 మే 17న ఉట్నూర్‌లోని కొమ్ముగూడెంలో జరిగిన ఘటనలో ఎస్సై కోట్యనాయక్, ఇద్దరు పోలీసులు మరణించారు. 
►1996 జూన్‌ 23న సీసీసీ నస్‌పూర్‌ కాలనీలోలోని ఓ ఇంట్లో నక్సలైట్లు ఉన్న సమాచారం తెలుసుకున్న శ్రీరాంపూర్‌ సీఐ చక్రపాణి, కానిస్టేబుల్‌ అశోక్‌లు అక్కడికి వెళ్లడంతో  కాల్పుల్లో మరణించారు. 
►1996 నవంబర్‌ 15న సిర్పూర్‌(యూ) పోలీసు స్టేషన్‌ పేల్చివేసిన ఘటనలో ఎస్సై అహ్మద్‌ షరీఫ్‌ తో పాటు 12 మంది పోలీసులు చనిపోయారు. 
► 1998 మే 28న బెల్లంపల్లి పాతబస్తీ దగ్గర సికాస ( సింగరేణి కార్మిక సమాఖ్య) పోలీసులకు మద్య జరిగిన కాల్పుల్లో హెడ్‌కానిస్టేబుళ్లు సంజీవ్‌కుమార్, శేషులు మరణించారు. 
►1999 డిసెంబర్‌ 2న ఖానాపూర్‌ మండలం తార్లపాడు వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఖానాపూర్‌ ఎస్సై సింగం మల్లేష్, కానిస్టేబుళ్‌ పున్నంచంద్‌లు మరణించారు.

అమరవీరులు వీరే..
పి.చక్రపాణి (సీఐ), ఎస్సైలు సీహెచ్‌ లక్ష్మణ్‌రావు , టి. రాజన్న , బి . కోటి నాయక్, అహ్మద్‌ షరీఫ్, ఎస్‌. మల్లేష్,  సయ్యద్‌ ఖాదీర్‌ ఉల్‌హక్‌ , సీహెచ్‌ మధన్‌ మోహన్‌ (ఎఎస్సై),హెడ్‌ కానిస్టేబుల్‌ళ్లు ఎం లక్ష్మణ్‌ , ఎంఎ గఫర్, ఎండీ జాహురుద్దిన్, ఎంఎ జలీల్, ఎస్‌కె హైదేర్, తాహేర్‌ మహ్మద్, ఎ. గోవర్ధన్, సయ్యద్‌ హమీద్‌ఉద్దీన్, జానరావు, ఎ. సంజీవరెడ్డి, జి. శేషయ్య, కానిస్టేబుళ్లు ఎస్‌ఎస్‌. చారి, అశోక్‌రావు, కె. జగన్నాథ్‌రావ్‌. విఠల్‌ సింగ్, జె. ముకుంద్‌రావ్, పి.రఘునాథ్, ఎంఎ జావిద్, జి. బాపురావ్, వేణుగోపాల్, బోజరాం, మోహన్‌దాస్, గణపతి, సాగిర్‌ అహ్మద్, కె. అశోక్, జె. సతీష్‌బాబు, మంగిలాల్, సి. రామరావు, అంకమ్‌రావు, ఆర్‌. కబీర్‌దాస్, ఎం. గోవింద్‌రావ్, ఆర్‌. శంకర్, ఆర్‌. ఓంకార్, కె. సుభాష్, శివశంకర్, కె. రాజేశ్వర్, పూనమ్‌చంద్, ఆర్‌. నర్సయ్య, ఎ. భీంరావ్‌లు అమరులయ్యారు.

మా కూతురికి ఉద్యోగం ఇవ్వాలి
నా భర్త అశోక్, కానిస్టేబుల్‌ 1996లో శ్రీరాంపూర్‌లో జరిగిన çఘటనలో చనిపోయారు. కొన్ని కారణాలతో ఉద్యోగం చేయలేకపోయాను. పెళ్లి జరిగిన సంవత్సరం తర్వాత ఆయన చనిపోయారు. ఆ సమయంలో నా కూతురు ఆశకు రెండు నెలల వయసు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని డిగ్రీ వరకు చదివించాను. ప్రస్తుతం గ్రూప్స్‌ కోచింగ్‌ తీసుకుంటుంది. ఆమె ఉదోగ్యం ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈ విషయమై పలుసార్లు పోలీసు ఉన్నత అధికారులకు విన్నవించాను.
– శివనంద, ఆదిలాబాద్‌ 

ప్రభుత్వం ఆదుకోవాలి
మా ఆయన రఘునాథ్‌  కానిస్టేబుల్‌ 1987లో ఎల్లంపల్లిలో నక్సల్‌ ఎదురు కాల్పుల్లో చనిపోయారు. నాకు ఒక బాబు హరిదాస్‌. ఎంబీఏ పూర్తి చేశాడు. నా భర్త చనిపోయినప్పుడు బాబుకు మూడు నెలలు. పరిహారం రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి రూ.లక్ష ఇచ్చారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాలో అమరవీరుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పన పరిహారం ఇచ్చారు. ఆదిలాబాద్‌ పట్టణంలో ఇంటిస్థలం ఇచ్చారు. బ్యాంకులోన్‌తో ఇల్లు కట్టుకున్నాను. వచ్చిన జీతం బ్యాంకులో తీసుకున్న లోన్‌కు చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం మా బాబుకు ఉద్యోగం ఇప్పించి అదుకోవాలి. 
- సవిత, ఆదిలాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top