breaking news
martyrs memorial day
-
మీ త్యాగం.. అజరామరం
1959 అక్టోబర్ 21న లడక్ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న పదిమంది సీఆర్పీఎఫ్ జవాన్లు చైనా సైనికులతో విరోచితంగా పోరాడి ప్రాణాలు త్యాగం చేశారు. వీరి స్మారకార్థంగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవాలని 1960 జనవరిలో జరిగిన రాష్ట్రాల పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ సమావేశంలో నిర్ణయించారు. అప్పటి నుంచి విధి నిర్వహణలో అమరులైన వారిని స్మరిస్తూ సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా త్యాగాలను స్మరించుకుందాం. సాక్షి, అదిలాబాద్ : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 28 ఘటనలు జరుగగా మొత్తం 48మంది పోలీసు అధికారులు, కానిస్టేబుల్, హోంగార్డులు విధి నిర్వహణలో అసువులు బాశారు. వీరిని స్మరించుకునేందుకు ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది. వీరి సేవలకు గుర్తుగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన అమర వీరుల స్మృతి స్థూపం ప్రతి సంవత్సరం పోలీసు ఉన్నత అధికారులతో పాటు సిబ్బంది అమర వీరుల కుటుంబాలతో కలిసి నివాళి అర్పిస్తారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తమ సహచరుల స్మారకార్థం ప్రతి ఏడాది అక్టోబర్ 15 నుంచి 21 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అమర వీరుల స్మారక వారోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు, ప్రజలకు పోలీసుల విధులపై అవగాహన కల్పిస్తారు. బాంబులు, తుపాకులు, గ్రేనేడ్లు, తదితర విస్పోటన వస్తువులు, డాగ్‌స్వా్కడ్, ఫింగర్ ప్రింట్స్ ఎలా సేకరిస్తారో అవగాహన కల్పిస్తారు. రక్తదాన శిబిరం, విద్యార్థులు వ్యాసరచన పోటీలు, తదితర సామాజిక కార్యక్రమాలు చేపడుతారు. పోలీసు అమరుల జ్ఞాపకార్థం.. జాతీయ చిహ్నంలో మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమే పోలీస్. అని ఓ సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ చాలా మందికి గుర్తుంటుంది. సమాజంలో రక్షణ లాగా ఉంటూ జిల్లాను శాంతియుతంగా ఉంచేందుకు అహర్నిషలు కృషి చేసి.. పలు ఘటనల్లో అమరులైన పోలీసులకు గుర్తుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఏ భవనం నిర్మించిన వారి పేర్లను పెడతారు. అందులో కొన్ని... ► సీఐ చక్రపాణి జ్ఞాపకార్థం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో చక్రపాణి మెమోరియల్ హాల్లు నిర్మించారు. ► 1987 ఆగస్టు 18 అల్లంపెల్లి ఘటనకు గుర్తుగా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో అల్లంపెల్లి కాంప్లెక్స్ నిర్మించారు. ► బెల్లంపెల్లి పాతబస్తీ ఘటనలో అసువులు బాసిన హెడ్‌కానిస్టేబుళ్లు సంజీవ్‌కుమార్, శేషులను జ్ఞాపకార్థం పోలీస వ్యాయమశాల ఏర్పాటు చేశారు. ► ఉట్నూర్ కొమ్ముగూడెం ఘటనలో మరణించిన ఎస్సై బి. కోట్యనాయక్ స్మారకార్థం చిల్డ్రన్స్పార్కును ఏర్పాటు చేశారు. ► ఖానాపూర్ పోలీసు స్టేషన్లో ఎస్సై మల్లేష్ జ్ఞాపకార్థం స్థూపాన్ని నిర్మించారు. ఇలా జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఏ భవన నిర్మాణం చేపట్టిన వాటికి అమరవీరుల పేర్లను పెట్టడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలోజరిగిన సంఘటనలు ఇవే... ► జిల్లాలో 1987 ఆగస్టు 18న కడెం మండలంలోని అల్లంపెల్లిలో జరిగిన మొదటి ఎన్కౌంటర్లో నక్సలైట్ల దాడిలో ఇద్దరు ఎస్సైలు, పది మంది కానిస్టేబుళ్లు అమరులయ్యారు. ► 1989 ఫిబ్రవరి 1న ఖానాపూర్–కడెం మండలాల్లోని సింగాపూర్ అడవుల్లో పోలీసు జీపును మందుపాతరతో పేల్చివేసిన ఘటనలో ఒక ఎస్సై, ఎడుగురు పోలీసులు మరణించారు. ►1991 మే 17న ఉట్నూర్‌లోని కొమ్ముగూడెంలో జరిగిన ఘటనలో ఎస్సై కోట్యనాయక్, ఇద్దరు పోలీసులు మరణించారు. ►1996 జూన్ 23న సీసీసీ నస్పూర్ కాలనీలోలోని ఓ ఇంట్లో నక్సలైట్లు ఉన్న సమాచారం తెలుసుకున్న శ్రీరాంపూర్ సీఐ చక్రపాణి, కానిస్టేబుల్ అశోక్‌లు అక్కడికి వెళ్లడంతో కాల్పుల్లో మరణించారు. ►1996 నవంబర్ 15న సిర్పూర్(యూ) పోలీసు స్టేషన్ పేల్చివేసిన ఘటనలో ఎస్సై అహ్మద్ షరీఫ్ తో పాటు 12 మంది పోలీసులు చనిపోయారు. ► 1998 మే 28న బెల్లంపల్లి పాతబస్తీ దగ్గర సికాస ( సింగరేణి కార్మిక సమాఖ్య) పోలీసులకు మద్య జరిగిన కాల్పుల్లో హెడ్‌కానిస్టేబుళ్లు సంజీవ్‌కుమార్, శేషులు మరణించారు. ►1999 డిసెంబర్ 2న ఖానాపూర్ మండలం తార్లపాడు వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఖానాపూర్ ఎస్సై సింగం మల్లేష్, కానిస్టేబుళ్ పున్నంచంద్లు మరణించారు. అమరవీరులు వీరే.. పి.చక్రపాణి (సీఐ), ఎస్సైలు సీహెచ్ లక్ష్మణ్‌రావు , టి. రాజన్న , బి . కోటి నాయక్, అహ్మద్ షరీఫ్, ఎస్. మల్లేష్, సయ్యద్ ఖాదీర్ ఉల్హక్ , సీహెచ్ మధన్ మోహన్ (ఎఎస్సై),హెడ్ కానిస్టేబుల్ళ్లు ఎం లక్ష్మణ్ , ఎంఎ గఫర్, ఎండీ జాహురుద్దిన్, ఎంఎ జలీల్, ఎస్కె హైదేర్, తాహేర్ మహ్మద్, ఎ. గోవర్ధన్, సయ్యద్ హమీద్ఉద్దీన్, జానరావు, ఎ. సంజీవరెడ్డి, జి. శేషయ్య, కానిస్టేబుళ్లు ఎస్ఎస్. చారి, అశోక్‌రావు, కె. జగన్నాథ్రావ్. విఠల్ సింగ్, జె. ముకుంద్‌రావ్, పి.రఘునాథ్, ఎంఎ జావిద్, జి. బాపురావ్, వేణుగోపాల్, బోజరాం, మోహన్‌దాస్, గణపతి, సాగిర్ అహ్మద్, కె. అశోక్, జె. సతీష్‌బాబు, మంగిలాల్, సి. రామరావు, అంకమ్రావు, ఆర్. కబీర్దాస్, ఎం. గోవింద్‌రావ్, ఆర్. శంకర్, ఆర్. ఓంకార్, కె. సుభాష్, శివశంకర్, కె. రాజేశ్వర్, పూనమ్‌చంద్, ఆర్. నర్సయ్య, ఎ. భీంరావ్‌లు అమరులయ్యారు. మా కూతురికి ఉద్యోగం ఇవ్వాలి నా భర్త అశోక్, కానిస్టేబుల్ 1996లో శ్రీరాంపూర్‌లో జరిగిన çఘటనలో చనిపోయారు. కొన్ని కారణాలతో ఉద్యోగం చేయలేకపోయాను. పెళ్లి జరిగిన సంవత్సరం తర్వాత ఆయన చనిపోయారు. ఆ సమయంలో నా కూతురు ఆశకు రెండు నెలల వయసు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని డిగ్రీ వరకు చదివించాను. ప్రస్తుతం గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటుంది. ఆమె ఉదోగ్యం ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈ విషయమై పలుసార్లు పోలీసు ఉన్నత అధికారులకు విన్నవించాను. – శివనంద, ఆదిలాబాద్ ప్రభుత్వం ఆదుకోవాలి మా ఆయన రఘునాథ్ కానిస్టేబుల్ 1987లో ఎల్లంపల్లిలో నక్సల్ ఎదురు కాల్పుల్లో చనిపోయారు. నాకు ఒక బాబు హరిదాస్. ఎంబీఏ పూర్తి చేశాడు. నా భర్త చనిపోయినప్పుడు బాబుకు మూడు నెలలు. పరిహారం రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి రూ.లక్ష ఇచ్చారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో అమరవీరుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పన పరిహారం ఇచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో ఇంటిస్థలం ఇచ్చారు. బ్యాంకులోన్‌తో ఇల్లు కట్టుకున్నాను. వచ్చిన జీతం బ్యాంకులో తీసుకున్న లోన్‌కు చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం మా బాబుకు ఉద్యోగం ఇప్పించి అదుకోవాలి. - సవిత, ఆదిలాబాద్ -
బీజేపీ హఠావో.. దేశ్ బచావో
కోల్‌కతా: బీజేపీ హఠావో.. దేశ్ బచావో అంటూ బీజేపీపై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మండిపడ్డారు. దేశంలో ఉగ్రవాదం, హింస, ద్వేషపూరిత వాతావరాణాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి దేశాన్ని కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు. తృణమూల్ పార్టీ అమరవీరుల వార్షిక దినోత్సవం సందర్భంగా శనివారం కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. మిడ్నాపూర్‌లో ప్రధాని మోదీ నిర్వహించిన ర్యాలీలో టెంట్ కూలి 90 మంది ప్రజలు గాయపడ్డ ఘటనపై ఆమె స్పందిస్తూ.. టెంట్ సరిగ్గా నిర్మించడం రాని వారు దేశాన్ని ఎలా నిర్మిస్తారంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఏకం చేసి బెంగాల్ వేదికగా జనవరిలో మెగా ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఈ ర్యాలీ నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తామని ఆమె ప్రకటించారు. బెంగాల్లో తృణమూల్‌ను కాంగ్రెస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం చేతులు కలిపాయన్నారు. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు చందన్ మిత్రా, సీపీఐ(ఎమ్) మాజీ ఎంపీ మోయినుల్ హసన్ తృణమూల్‌లో చేరారు. -
పోలీసుల త్యాగాలు గుర్తిద్దాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : దేశ రక్షణలో పోలీస్ త్యాగాలు వెలకట్టలేనివని, అమరుల త్యాగాలను స్మరించుకోవాలని డీజీపీ అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఈ నెల 15న హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో నిర్వహిస్తున్న పోలీస్ రన్‌కు సంబంధించి టీషర్ట్, మెడల్‌లను సీపీ మహేందర్‌రెడ్డి, కృష్ణప్రసాద్, ఇతర అధికారులతో కలిసి డీజీపీ అనురాగ్‌శర్మ గురువారం పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులో 2 కె, 5 కె, 10 కె రన్ ను నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు. పరుగు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి మెడల్ ఇస్తామన్నారు. 2014లో గువాహటిలో నిర్వహించిన డీజీపీల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ పోలీస్ త్యాగాలకు గుర్తింపులేదని, వివిధ కార్యక్రమాలు, సందర్బాలలో ప్రజలకు తెలియజేయాలని సూచించారని తెలిపారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వెబ్సైట్లో పోలీస్ సిబ్బంది చేసిన మంచి కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలు అప్ లోడ్ చేస్తాయని పేర్కొన్నారు. గతేడాది రాష్ట్రంలో వివిధ పోలీస్ సంస్థలు, పారా మిలిటరీతో కలసి పోలీస్ సిబ్బంది ఉపయోగించే ఆయుధాలు, పరికరాల ప్రదర్శన నిర్వహించామన్నారు. ఈసారి కూడా 14వ తేదీ నుంచి 16 వరకు ఎక్స్పో నెక్లెస్‌రోడ్‌లో ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ రన్లో పాల్గొని, కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. -
అటవీ సంపదను పరిరక్షించుకోవాలి
- అమర వీరుల సంస్మరణ సభలో మంత్రి బొజ్జల - స్మారక స్థూపం ఎదుట ఉద్యోగుల ఘన నివాళి తిరుపతి: అటవీ సంపదను పరిరక్షించడమే లక్ష్యంగా ఉద్యోగులు విధులు నిర్వర్తించాలని రాష్ట్ర అటవీ, సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సూచించారు. తిరుపతి ఎస్వీ జూ పార్కు ఆవరణలో ఆదివారం ఉదయం రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బొజ్జల ఉద్యోగుల గౌరవవందనం స్వీకరించి ప్రసంగించారు. అటవీ సంపదను కాపాడే ప్రయత్నంలో అసువులుబాసిన ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుందన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 14మంది బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, ఏబీవోలు విధి నిర్వహణలో కన్నుమూశారన్నారు. భవిష్యత్తులో ఎవ్వరూ శత్రువుల చేతిలో చనిపోకుండా టెక్నాలజీ సాయంతో జాగ్రత్తలు తీసుకుంటున్నామని బొజ్జల వివరించారు. ఇప్పటివరకూ నవంబరు 10న జరిగే అమరవీరుల సంస్మరణ సభ ఇకపై ఏటా సెప్టెంబరు11న జరుగుతుందనీ, ఇందుకోసం కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులిచ్చిందన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి వృక్ష సంపద పరిరక్షణలో సేవలందిస్తోన్న ఉద్యోగుల కృషి అభినందనీయం అని అన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సెర్వేటర్ ఎస్బీఎల్ మిశ్రా, అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎస్కే చొట్టాయ్, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం చీఫ్ కన్జర్వేటర్ పీవీ చలపతిరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులు, స్మగ్లర్ల చేతిలో మరణించిన 14 మంది ఫారెస్టు అధికారుల సేవలను కొనియాడారు.