అటవీ సంపదను పరిరక్షించడమే లక్ష్యంగా ఉద్యోగులు విధులు నిర్వర్తించాలని రాష్ట్ర అటవీ, సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సూచించారు.
- అమర వీరుల సంస్మరణ సభలో మంత్రి బొజ్జల
- స్మారక స్థూపం ఎదుట ఉద్యోగుల ఘన నివాళి
తిరుపతి: అటవీ సంపదను పరిరక్షించడమే లక్ష్యంగా ఉద్యోగులు విధులు నిర్వర్తించాలని రాష్ట్ర అటవీ, సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సూచించారు. తిరుపతి ఎస్వీ జూ పార్కు ఆవరణలో ఆదివారం ఉదయం రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బొజ్జల ఉద్యోగుల గౌరవవందనం స్వీకరించి ప్రసంగించారు.
అటవీ సంపదను కాపాడే ప్రయత్నంలో అసువులుబాసిన ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుందన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 14మంది బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, ఏబీవోలు విధి నిర్వహణలో కన్నుమూశారన్నారు. భవిష్యత్తులో ఎవ్వరూ శత్రువుల చేతిలో చనిపోకుండా టెక్నాలజీ సాయంతో జాగ్రత్తలు తీసుకుంటున్నామని బొజ్జల వివరించారు. ఇప్పటివరకూ నవంబరు 10న జరిగే అమరవీరుల సంస్మరణ సభ ఇకపై ఏటా సెప్టెంబరు11న జరుగుతుందనీ, ఇందుకోసం కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులిచ్చిందన్నారు.
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి వృక్ష సంపద పరిరక్షణలో సేవలందిస్తోన్న ఉద్యోగుల కృషి అభినందనీయం అని అన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సెర్వేటర్ ఎస్‌బీఎల్ మిశ్రా, అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎస్‌కే చొట్టాయ్, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం చీఫ్ కన్జర్వేటర్ పీవీ చలపతిరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులు, స్మగ్లర్ల చేతిలో మరణించిన 14 మంది ఫారెస్టు అధికారుల సేవలను కొనియాడారు.