పోలీసుల త్యాగాలు గుర్తిద్దాం: డీజీపీ

Anurag sharma Released T shirt and Medal for the IPMMR 2017

అమరువీరుల స్మారక రన్‌ సక్సెస్‌ చేద్దాం

ప్రజలు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చిన డీజీపీ

సాక్షి, హైదరాబాద్ : దేశ రక్షణలో పోలీస్‌ త్యాగాలు వెలకట్టలేనివని, అమరుల త్యాగాలను స్మరించుకోవాలని డీజీపీ అనురాగ్‌ శర్మ పిలుపునిచ్చారు. రాష్ట్ర పోలీస్‌ శాఖ ఈ నెల 15న హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో నిర్వహిస్తున్న పోలీస్‌ రన్‌కు సంబంధించి టీషర్ట్, మెడల్‌లను సీపీ మహేందర్‌రెడ్డి, కృష్ణప్రసాద్, ఇతర అధికారులతో కలిసి డీజీపీ అనురాగ్‌శర్మ గురువారం పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని నెక్లెస్‌ రోడ్డులో 2 కె, 5 కె, 10 కె రన్‌ ను నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు. పరుగు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి మెడల్‌ ఇస్తామన్నారు. 2014లో గువాహటిలో నిర్వహించిన డీజీపీల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ పోలీస్‌ త్యాగాలకు గుర్తింపులేదని, వివిధ కార్యక్రమాలు, సందర్బాలలో ప్రజలకు తెలియజేయాలని సూచించారని తెలిపారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వెబ్‌సైట్లో పోలీస్‌ సిబ్బంది చేసిన మంచి కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల పోలీస్‌ శాఖలు అప్‌ లోడ్‌ చేస్తాయని పేర్కొన్నారు.

గతేడాది రాష్ట్రంలో వివిధ పోలీస్‌ సంస్థలు, పారా మిలిటరీతో కలసి పోలీస్‌ సిబ్బంది ఉపయోగించే ఆయుధాలు, పరికరాల ప్రదర్శన నిర్వహించామన్నారు. ఈసారి కూడా 14వ తేదీ నుంచి 16 వరకు ఎక్స్‌పో నెక్లెస్‌రోడ్‌లో ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ రన్‌లో పాల్గొని, కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని అనురాగ్‌ శర్మ పిలుపునిచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top