మావోల కోసం మళ్లీ వేట

సాక్షి, మోర్తాడ్‌: మావోయిస్టుల ప్రభావం ఉమ్మడి జిల్లాలో కనుమరుగై దాదాపు పుష్కర కాలం(12 ఏళ్లు) అవుతోంది. అయినా ఇతర రాష్ట్రాలలో పని చేస్తున్న మన ప్రాంత నక్సల్స్‌ కోసం నిజామాబాద్‌ జిల్లా పోలీసులు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని గుర్తించిన పోలీసు శాఖ ఉన్నతాధికారులు స్టేషన్‌లలోని తుపాకులను సైతం జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లోని కార్యాలయాల్లో భద్ర పరిచారు. అయితే రెండు జిల్లాలకు చెందిన ఎనిమిది మంది నక్సల్స్‌ కోసం జిల్లా పోలీసులు వేటను కొనసాగిస్తున్నారని చెప్పడానికి వివిధ ప్రాంతాలలో అంటించిన వాల్‌ పోస్టర్లే నిదర్శనం. నక్సల్స్‌ నాయకులకు సంబంధించిన పాత ఫొటోలతో పాటు వారిపై ప్రకటించిన రివార్డులు, పోలీసు ఉన్నతాధికారుల సెల్‌ నంబర్‌లను వాల్‌ పోస్టర్లపై ముద్రించారు. వీటిని ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోనద్‌న్ని పోలీస్‌స్టేషన్లతోపాటు జనసమ్మర్థం ఉండే కూడళ్ల వద్ద అంతికించారు. వాటి ద్వారానే జన జీవన స్రవంతిలోకి రావాలని మావోలను పోలీసు యంత్రాంగం విజ్ఞప్తిచేస్తోంది. మావోయిస్టుల ముఖ్యనేతగా ముద్రపడిన కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడకు చెందిన లోకేటి చందర్‌ అలియాస్‌ స్వామి, స్వామి కూతురు లోకేటి లావణ్య, కొడుకు లోకేటి రమేష్, మాచారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్‌ సంతోష్, కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన క్యాతం శ్రీను అలియాస్‌ సూరజ్, ఎల్లారెడ్డికి చెందిన లింబయ్యగారి వెంకట్‌రెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలోని ధర్పల్లి మండలం లింగాపూర్‌కు చెందిన మూడెడ్ల సాయిలు అలియాస్‌ రఘు, ఇందల్వాయికి చెందిన నాగపులి లక్ష్మాగౌడ్‌ అలియాస్‌ లచ్చాగౌడ్‌ కోసం పోలీసులు వేటను కొనసాగిస్తూనే ఉన్నారు. 
మావోలపై రివార్డులు..
వీరంతా గతంలో ఉమ్మడి జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతోపాటు పార్టీ మన ప్రాంతంలో కనుమరుగైనా వేరే రాష్ట్రంలో పని చేస్తుండటం గమనార్హం. అనేక మంది ఎన్‌కౌంటర్‌లలో మరణించడం, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సభ్యుల ఒత్తిళ్లు, అనారోగ్య కారణాలతో పోలీసులకు లొంగిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే పోలీసులు వాల్‌ పోస్టర్లలో పేర్కొన్న ఎనిమిది మంది మాత్రం ఇంకా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నట్లు వెల్లడవుతోంది. వీరిలో స్వామిపై అత్యధికంగా రూ.20 లక్షల రివార్డు ఉంది. కాగా సాయిలు, రవి, శ్రీనులపై రూ.5లక్షల చొప్పున రివార్డును ప్రకటించారు. అలాగే రమేష్‌పై రూ.4లక్షల రివార్డు, లావణ్య, లక్ష్మాగౌడ్, లింబయ్య గారి వెంకట్‌రెడ్డిపై రూ.లక్ష చొప్పున రివార్డును ప్రకటించారు. ప్రజలు మావోయిస్టుల ఉనికి లేదని భావిస్తున్నా పోలీసులు మాత్రం రివార్డులను ప్రకటించడంతో పాటు వాల్‌ పోస్టర్లను ముద్రించి నక్సల్స్‌ ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top