వస్తామంటే.. వద్దంటారా?

Police Arrested TSRTC Employees While Joining Duty In Medak - Sakshi

విధుల్లో చేరడానికి వచ్చిన కార్మికులు

నిరాకరించిన ఆర్టీసీ యాజమాన్యం 

ఆర్టీసీ కార్మికులు వారి హక్కుల సాధన కోసం నిరవధిక సమ్మె ప్రారంభించి మంగళవారం నాటికి 53వ రోజుకు చేరుకుంది. సమ్మె అనేక రకాలుగా కొనసాగి చివరకు జేఏసీ పిలుపు మేరకు విధుల్లో చేరేందుకు కార్మికులు ఆర్టీసీ డిపోల వద్దకు ఉదయం చేరుకున్నారు. అయితే ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం దిగిరాలేదు. పోలీసుల సహకారంతో కార్మిక సంఘాల నాయకులను మంగళవారం తెల్లవారుజాము నుంచే అరెస్ట్‌లు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. దీంతో డిపోల వద్ద ఉద్రిక్తత నెలకొంది. కార్మికులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది.

సాక్షి, రామచంద్రాపురం(మెదక్‌) : ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి మంగళవారం ఉదయం విధుల్లో చేరేందుకు బెల్‌ ఆర్టీసీ డిపో వద్దకు రావడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్మికులు రాగానే వెంటనే వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌లకు కు తరలించారు. మహిళా కార్మికులు పోలీస్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎలాంటి ఆందోళన చేయడం లేదని, సమ్మె విరమించి విధుల్లోకి చేరుతున్నామని లిఖితపూర్వకంగా డిపో మేనేజర్‌ను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 56 మంది కార్మికులను అదుపులోకి తీసుకోవడంతో మహిళా కార్మికులు దీక్షలు చేపట్టారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌ తరలించారు.

విరమించినా.. తీరని సమస్య 
సిద్దిపేట: రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని ఆర్టీసీ కార్మికులు మంగళవారం ఉదయం విధుల్లో చేరడానికి డిపోల వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు కార్మికులను అడ్డుకొని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. విధుల్లో చేరడానికి కార్మికులు వస్తారనే ముందస్తు సమాచారంతో జిల్లాలోని ఆర్టీసీ డిపోల వద్ద భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్‌ డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆయా స్టేషన్‌లకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 271 మంది ఆర్టీసీ కార్మికులను అరెస్ట్‌ చేశారు. సిద్దిపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి వస్తున్నారనే సమాచరం మేరకు డిపో వద్ద ఏసీపీ రామేశ్వర్‌ ఆధ్వర్యంలో వన్‌ టౌన్‌  సీఐ సైదులు, రూరల్‌ సీఐ సురేందర్‌ రెడ్డి, టూ టౌన్‌  సీఐల ఆధ్వర్యంలో భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

నిరసనలు ఇలా.. 
ఉదయం డిపో వద్దకు చేరుకున్న వామపక్ష నాయకులు మంద పవన్, రేవంత్‌కుమార్‌లను అరెస్ట్‌ చేసి స్టేషన్‌లకు తరలించారు. అనంతరం సుమారు 50 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి సిద్దిపేట డిపో వద్దకు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కార్మికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వారిని అరెస్ట్‌ చేసి డీసీఎం, టాటాఎస్‌ వాహనంలో సిద్దిపేట వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. ఈ క్రమంలో కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిద్దిపేటలో పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో ఇద్దరు వామపక్ష నాయకులు, 15 మంది మహిళా కండక్టర్లు, 47 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారని వన్‌టౌన్‌  సీఐ సైదులు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేసి ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రేవంత్‌కుమార్, ఆర్టీసీ జేఏసీ నాయకులు శేషు, బీఎస్‌ గౌడ్, రాజయ్య, మల్లేశం, పరమేశ్వర్‌రెడ్డి, సీహెచ్‌ఆర్‌సీరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మంజుల, సుజాత తదితరులు ఉన్నారు. జిల్లా వ్యప్తాంగా 87శాతం బస్సు రవాణా జరిగినట్లు సిద్దిపేట జిల్లా రవాణశాఖ అదికారి రామేశ్వర్‌రెడ్డి తెలిపారు.

ఉదయం నుంచి ఉద్రిక్తత
సాక్షి, సంగారెడ్డి: ఆర్టీసీ జేఏసీ సూచన మేరకు విధుల్లో చేరడానికి కార్మికులు జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణేడ్‌ డిపోల వద్దకు ఉదయం 5 గంటల నుంచే చేరుకోవడం ఆరంభించారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు డిపో లోపలికి అనుమతించలేదు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక దశలో లోపలికి వెళ్లడానికి ప్రయత్నించినా పోలీసులు నిలువరించడంతో వెళ్లడానికి విఫలయత్నం చేశారు. జేఏసీ–1 యూనియ¯Œ  చెందిన కార్మికులు మాత్రం జిల్లాలో సమ్మె విరమించకపోవడం విశేషం. 

జిల్లాలో పరిస్థితి ఇలా.. 
డిపోల లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన కార్మికులను అరెస్టు చేసి సమీప పోలీస్‌స్టేషన్లకు తరలించారు. సంగారెడ్డి డిపోలో పనిచేస్తున్న భీమ్‌లాల్‌ అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సంగారెడ్డి డిపో పరిధిలో 100 మందిని, నారాయణఖేడ్‌లో 108 మందిని, జహీరాబాద్‌ 32 మంది కార్మికులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్మికులకు మద్దతు తెలపడానికి సంగారెడ్డి డిపో వద్దకు వచ్చిన డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డిని అరెస్టుచేశారు.

సెల్‌టవర్‌ ఎక్కిన టీజేఎస్‌ నేత 
నారాయణఖేడ్‌: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, వారిని బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ, విధుల్లో చేరేందుకు వెళ్లిన వారిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ టీజేఎస్‌ నాయకులు సెల్‌టవర్‌ ఎక్కి నిరసన తెలిపాడు. నారాయణఖేడ్‌కు చెందిన తెలంగాణ జనసమితి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బోర్గి సంజీవ్‌ కుమార్‌ మంగళవారం పట్టణంలోని బీఎస్‌ఎన్ఎ‌ల్‌ కార్యాలయం ఆవరణలోని టవర్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. బీఎస్‌ఎన్ఎ‌ల్‌ సిమ్‌ కార్డు కావాలంటూ ఉదయం 10గంటల సమయంలో కార్యాలయం ఆవరణలోకి వెళ్లిన ఆయన సిబ్బంది కళ్లుగప్పి టవర్‌ ఎక్కాడు. సుమారు 200అడుగులకు పైగా ఉన్న టవర్‌పై వంద అడుగుల ఎత్తు వరకు ఎక్కి కూర్చున్నాడు. దీన్ని గమనించిన బీఎస్‌ఎన్‌ ఎల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐ సందీప్‌లు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న జనాలు భారీగా అక్కడికి చేరుకున్నారు. పలు డిమాండ్లతో ముద్రించిన కరపత్రాలను పైనుంచి కిందకు విసిరాడు. అరెస్టు చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశాడు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరాడు. ఆరుగంటలకు పైగా టవర్‌పైనే కూర్చున్న సంజీవ్‌ అనంతరం టవర్‌ దిగివచ్చాడు.

సెల్‌టవర్‌ ఎక్కిన టీజేఎస్‌ నాయకుడు బోర్గి సంజీవ్‌కుమార్‌  

ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలు
నారాయణఖేడ్‌: నారాయణఖేడ్‌లో కార్మికులను పోలీసులు అరెస్టు చేసి వ్యాన్‌ లో ఎక్కిస్తున్న సమయంలో ఆర్టీసీ కార్మికులు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. తోపులాటలో కండక్టర్‌ యుమున, డ్రైవర్‌ బీ.ఎస్‌ రెడ్డిలు కిందపడిపోయి అస్వస్థతకు గురయ్యారు. వీరిని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఎక్కడికక్కడ అరెస్ట్‌లు
నారాయణఖేడ్‌: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి మంగళవారం విధుల్లో చేరేందుకు ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో నారాయణఖేడ్‌ డిపోలో మంగళవారం విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌  తరలించారు. కార్మికులు సమ్మె విరమించినా కార్మిక కోర్టులో విషయం తేలేవరకు విధుల్లోకి తీసుకోమని ఆర్టీసీ ఇన్‌ చార్జి ఎండీ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు తెల్లవారుజామునే నారాయణఖేడ్‌ ఆర్టీసీ డిపో వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులు డిపో వద్దకు చేరుకునే ప్రయత్నం చేయడంతో డిపోకు కొద్ది దూరంలోనే పోలీసులు కార్మికులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు దాదాపు వంద మంది కార్మికులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కార్మికులను అరెస్టు చేసి వ్యాన్‌ లో తరలిస్తున్న పోలీసులు

ప్రభుత్వ తీరుపై మండిపాటు
జహీరాబాద్‌: ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. మంగళవారం విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు డిపో లోపలకు అనుమతించలేదు. ముగ్గురు మహిళా కార్మికులను మాత్రం డిపో మేనేజర్‌ను కలిసిసేందుకు అనుమతించారు. వారు డిపో మేనేజర్‌ను కలిసి విధుల్లో చేరేందుకు అనుమతించాలని కార్మికులు డిపో మేనేజర్‌ రమేష్‌ను కలిశారు. రాత పూర్వకంగా పత్రాలు ఇచ్చేందుకు కార్మికులు కోరగా ఆయన నిరాకరించారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి దరఖాస్తులు తీసుకోవద్దని, విధుల్లో చేర్చుకోవద్దని ఆదేశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో కార్మికులు వెనుదిరిగి వెళ్లారు.

డిపో వద్ద ఆందోళన చేస్తున్న 32 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌ కు తరలించారు. ఇందులో మహిళా కార్మికులే అధికంగా ఉన్నారు. అనంతరం పోలీసులు సొంత పూచికత్తుపై వదిలిపెట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల విషయంలో అనుసరిస్తున్న విధానం సరైంది కాదని ఆరోపించారు. విధుల్లో చేరేందుకు సిద్ధపడ్డా నిరాకరించడం తగదన్నారు. డిపో వద్ద సీఐ సైదేశ్వర్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు వెంకటేశ్, వినయ్‌కుమార్, రాము సిబ్బందితో కలిసి బందోబస్తును నిర్వహించారు. జహీరాబాద్‌ డిపో నుంచి బస్సుల రాక పోకలకు ఎలాంటి అంతరాయం కలుగలేదు. రోజు మాదిరిగానే బస్సులు నడిచాయి.

పోలీసులు, ఆర్టీసీ కార్మికులను వ్యానులోకి ఎక్కిస్తున్న పోలీసులు

రాకరణ.. నిరసన
మెదక్‌ : ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు కార్మికులు మంగళవారం ఉదయం డిపోల వద్దకు చేరుకున్నారు. యాజమాన్యం నిరాకరించడంతో మహిళా కార్మికులు, పురుషకార్మికులు మూడు గ్రూప్‌లుగా విడిపోయి ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్నారు. ముందుగా మహిళా కండక్టర్లు పోలీసుల కళ్లుగప్పి డిపోలోని బస్సు గరేజ్‌లోకి చేరుకొని గేట్‌ ఎదుట బైఠాయించి బస్సులను బయటకు వెళ్లనివ్వలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు మహిళా కండక్టర్లను పోలీసుల వాహనాల్లో ఎక్కించే ప్రయత్నంలో స్వల్ప తోపులాట జరిగింది. ఈ నేపధ్యంలో మహిళా కండక్టర్లు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

రెండు గ్రూప్‌లుగా విడిపోయిన పురుష కార్మికులు డిపో ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి తరలించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికేందుకు సిద్ధమైన సీపీఎం నాయకులను సైతం పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేసి స్టేషన్‌ కు తరలించారు. ఈ సందర్భంగా టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఆర్‌కేరావు మాట్లాడుతూ స్వచ్ఛందంగా విధుల్లోకి చేరుతామని ఉత్తరాలు రాసి తీసుకొని వచ్చినా విధుల్లోకి తీసుకోకుండా అరెస్ట్‌లు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసుల దమనకండ రాజ్యమేలుతోందని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులను అప్పనంగా టీఆర్‌ఎస్‌ నాయకులకు అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో బోస్, శ్రీనివాస్‌రెడ్డి, శాఖయ్య తదితరులు ఉన్నారు. 

పోలీసుల అదుపులో ఆర్టీసీ కార్మికులు, మహిళా కార్మికులను అరెస్ట్‌ చేస్తున్న మహిళా పోలీసులు   

బస్సు సర్వీసులు ఇలా.. 
జిల్లాలో మూడు డిపోలు ఉన్నాయి. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్‌ డిపోలలో 1,158 కార్మికులు ఉన్నారు. సంగారెడ్డి డిపోలో 120 బస్సులకు గాను తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లతో 83 బస్సులు నడిపించారు. జహీరాబాద్‌లో 96 బస్సులకు గాను 65 బస్సులు నడిచాయి. నారాయణఖేడ్‌లో 63 బస్సులకు గాను 41 బస్సులు నడిచాయి.  కార్మికులను చేర్చుకోవడానికి అనుమతిలేదు  
ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోవడానికి అనుమతిలేదు. డిపోల వద్దకు వచ్చిన కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా 269 బస్సులకు గాను మంగళవారం జిల్లాలోని మూడు డిపోల పరిధిలో నుంచి 199 బస్సులు తిరిగాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పైఅధికారుల సూచనల ప్రకారం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. 
 – రాజశేఖర్, ఆర్‌ఎం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top