పథకాలు బాగు.. పాలనకు కితాబు

Peddapalli Constituency Review on Lok Sabha Election - Sakshi

రైతుబంధు మంచిగుంది!

థర్డ్‌ ఫ్రంట్‌ వస్తే దేశమంతా అమలు..

భూముల్లేని వారినీ పట్టించుకోవాలి

సెంటర్‌లో ఎవరైనా.. ఇక్కడ టీఆర్‌ఎస్‌ ఎంపీలే గెలవాలి..

63వ నంబర్‌ హైవేపై జనం మనోగతం

పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలో ఉన్న ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ధర్మపురి, మంథని, రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వెంకటేశ్‌ నేతకాని, కాంగ్రెస్‌ అభ్యర్థిగా చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థిగా ఎస్‌.కుమార్‌ పోటీ చేస్తున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం మీదుగా 63వ జాతీయ నంబర్‌ జాతీయ రహదారి వెళ్తోంది.- సాక్షి, నెట్‌వర్క్‌

భిన్న స్పందనలు..
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం మీదుగా వెళ్తున్న 63వ నంబర్‌ జాతీయ రహదారిని ఆరు భాగాలుగా విభజించి ‘సాక్షి’ బృందం పర్యటించింది. ఏ పార్టీకి ఓటెయ్యాలనుకుంటున్నారు? కారణం ఏమిటి?, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారు? ఎవరు ప్రధాని అవుతారు?, మీ లోక్‌సభ పరిధిలో ఈ ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపించే అంశం ఏమిటి?, మీకున్న అవగాహన మేరకు, మీ లోక్‌సభ నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? అనే ప్రశ్నలకు చిరు వ్యాపారులు, స్థానికులు, వివిధ వర్గాల ప్రజలు ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు.

ఆ సంగతి కూడా చూడండి..
భూములున్నోళ్లకే ప్రభుత్వ సంక్షేమ పథకాలందుతున్నాయని, భూములు లేని వారి సంగతేంటని ప్రశ్నించారు కొందరు. రైతుకు రుణమాఫీ, రైతుబంధు, చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా, సబ్సిడీ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఇస్తున్నారు. పేదలకు మూడు ఎకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల విషయంలో కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సత్వరం స్పందించాలని కొందరు అభిప్రాయపడ్డారు. రైతుబంధు పథకంపై నియోజకవర్గం ప్రారంభం నుంచి చివరి దాకా రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎవరికి మద్దతునిస్తారని అడిగితే.. చాలా చోట్ల ‘అభ్యర్థి ఎవరనేది మాకు అనవసరం. టీఆర్‌ఎస్‌కే మా మద్దతు’ అని ఠక్కున సమాధానం చెప్పారు. కొందరు మాత్రం కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు ప్రభుత్వాలు ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడానికి మొన్నటి ఎన్నికల్లో కారు గుర్తుకు వేశామని, ఈసారి కాంగ్రెస్‌కు మద్దతునిచ్చి ఆ పార్టీ తెలంగాణ ఇచ్చిన రుణాన్ని తీర్చుకుంటామని కొందరు కుండబద్దలు కొట్టారు. నిరుద్యోగుల నుంచి మాత్రం పెదవి విరుపులు కనిపించాయి.  

నిండుకుండలా గోదావరి తీరం
గణేష్‌పల్లి వద్ద డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం కింద ప్రారంభించిన ఇళ్ల నిర్మాణాల పనులు ప్రస్తుతం ప్రగతిలో ఉన్నాయి. వీటిని సత్వరం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రజలు కోరారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో దండేపల్లి మండలంలోని గూడెం గోదావరి తీరం నిండుకుండలా కనిపించింది. దీంతో నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న వరి పొలాలు పచ్చదనంతో కళకళలాడుతూ కనిపించాయి.
గూడెం గోదావరి ఒడ్డున ఎత్తిపోతల పథకం ఉన్నప్పటికీ శివారులోని భూములకు సాగునీరు అందడం లేదు. గూడెం వరకు.. గూడెం ఎత్తిపోతల నీళ్లు అందించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు.

పథకాలన్నీ మంచిగున్నయ్‌..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్‌ కిట్‌ బాగా పాపులర్‌ అయ్యాయి. నిరుపేద ఆడబిడ్డ పెళ్లి కోసం సర్కారు అందిస్తున్న సహాయం భేష్‌ అని పలువురు ప్రశంసించారు. వృద్ధులు ఒకరిద్దరు పెన్షన్‌ రూ. 2 వేల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. రైతులు 24 గంటల కరెంటుతో ఆనందంగా ఉన్నారు.

సాగునీరిస్తే బేఫికర్‌
జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలం కోనాపూర్‌ నుంచి బీర్‌పూర్‌ మండలం కమ్మునూర్‌ వరకు 30 కి.మీ. మేర రోడ్డు వెంట రబీలో వేసిన వరి పొలాలు సాగునీరందక ఎండిపోయి కనిపించాయి. అక్కడి రైతులను పలకరిస్తే.. ‘గడచిన వర్షాకాలంలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టులో ఆశించిన మేర నీరు చేరింది. అయినా రబీకి నాలుగు తడులు ఇవ్వలేదు’ అని వాపోయారు. ఇప్పటి వరకు మూడు తడులు విడుదలైనా కాలువ చివరి భూములకు నీరు చేరలేదని, పొలాలు పొట్ట, గొలుసు దశలో ఎండిపోతున్నాయని చెప్పారు. ఇదే రైతులు ప్రభుత్వం చేపట్టిన ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మాత్రం సానుకూలంగా స్పందించారు. సాగునీటి కొరత తీరిస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పారు.

 మాకైతే సర్కార్‌ సొమ్ము తెలవదు
మా కులవృత్తి చాకలి. ఏ సర్కార్‌ వచ్చినా ఇచ్చిందేమీ లేదు. సర్కార్‌ సొమ్ము మాకు తెలవదు. నాకే కాదు ఊళ్లో ఏ చాకలోల్లకీ ఏమీ అందలేదు. రేషన్‌ బియ్యం మాత్రం దొరుకుతున్నాయ్‌. గరీబుతనం పారదోలే సర్కార్‌ రావాలె.– దుర్శెటి నర్సయ్య, అక్కమ్మ, అందుగులపల్లి  

కొండంత సాయం
కేసీఆర్‌ రైతులకు అండగా ఉన్నాడు కాబట్టే టీఆర్‌ఎస్‌కే మా మద్దతు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్‌  రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ ఆయింది. ఇక ఉన్నది టీఆర్‌ఎస్‌ మాత్రమే. కేంద్రంలో నరేంద్ర మోదీ వస్తాడు. అయితే, కేసీఆర్‌ అక్కడ కూడా చక్రం తిప్పుతాడు.– గోనె పోశం, రైతు, పోలంపల్లి

 రైతులకు అండ
తెలంగాణ అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌కే మద్దతునివ్వాలి. గ్రామాల అభివృద్ధితో పాటు రైతుబంధు, రైతుబీమా, భూ శుద్ధీకరణ చేసి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది.– బండి మల్లికార్జున్, సుల్తానాబాద్‌

‘కారోళ్లు’ ఎక్కువ గెలుస్తరు..
నరేంద్ర మోదీ మరో ఐదేళ్లు పాలించాలి. మోదీ మార్కు అభివృద్ధిపై ప్రజల్లో చాలా ఆశలున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి. రాష్ట్రంలో కేసీఆర్‌కు పట్టుంది. టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎక్కువ మంది గెలుస్తారు.– పచ్చునూరి రాజు, మార్బుల్‌ వర్కర్, దొనబండ

 కేంద్రంలోనూ చక్రం తిప్పాలి
ఓటు వజ్రాయుధం. మన పిల్లల భవిష్యత్‌ మనం వేసే ఓటు మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో వచ్చినట్లే, కేంద్రంలోనూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలి.
– కోగిల శ్రీనివాస్, హోటల్‌ యజమాని, దిగువ కొండగట్టు

కేసీఆరే మా బతుక్కి భరోసా
కేసీఆర్‌ ఎవరికి ఓటేయమంటే వారికే వేస్తాం. గతంలో దివ్యాంగులను పట్టించుకున్న పాలకులు లేరు. తెలంగాణ  ప్రభుత్వం నెలనెలా ఇచ్చే పెన్షన్‌ డబ్బులను పెంచి మా బతుకుకి భరోసా కల్పించింది. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం బాగుపడుద్ది.– ఊరగొండ పున్నం, పశువుల కాపరి, దివ్యాంగుడు, భీమారం

పెద్ద కొడుకు లెక్క..
నాకు పింఛన్‌ వత్తంది. కేసీఆర్‌ సారు పెద్ద కొడుకు లెక్క నెలనెలా పైసలిస్తుండు. నా ఓటు కారు గుర్తుకే ఏస్తా. సెంట్రల్‌ గవర్నమెంట్‌ల ఏదత్తదో తెల్వది.– బాదిరెడ్డి రాజం, ఆరపేట, కోరుట్ల

ఔర్‌ ఏక్‌ బార్‌.. మోదీ
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతునివ్వాలనుకుంటున్న. దేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన పాలన మోదీది. అందుకే బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. మోదీ మళ్లీ ప్రధాని అవుతారు.
– గోపిడి జలేందర్‌రెడ్డి, రైతు, ఆరపేట, మెట్‌పల్లి

 ‘సారు’ ఇచ్చేదే లెక్క!
నాకు ఇద్దరు దివ్యాంగ బిడ్డలున్నారు. కేసీఆర్‌ పాలనలో ఇద్దరికీ రూ.1,500 చొప్పున నెల నెలా పింఛన్‌ వస్తోంది. సెంటర్‌లో కాంగ్రెస్‌ గవర్నమెంట్‌ వస్తే రూ.6 వేలు ఇస్తామంటుండ్రు. కానీ నమ్మేటట్టు లేదు. ఇప్పుడు ఇచ్చేదే లెక్క. ఆరు వేల సంగతి దేవుడికెరుక.– రేవేల్లి ముత్తయ్య, అప్పన్నపేట  

కాంగ్రెస్‌ రావాలి..టీఆర్‌ఎస్‌ కావాలి
ఈసారి కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ వస్తే బాగుంటుంది. మా గ్రామానికి చాలా ఏళ్ల కిందట కంకర రోడ్డు వేశారు. మళ్లీ రోడ్డు వేయనే లేదు. మార్పు కావాలి. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండాలి.  – సత్తయ్య, పూల వ్యాపారి

మోదీ ప్రభుత్వమే రావాలి
మోదీ ప్రభుత్వం మల్ల రావాలి. నోట్ల మార్పిడి వలన చాలామంది వద్ద ఉన్న నల్లధనం బయటపడింది. మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను.– మొగిలి, ఆటో డ్రైవర్, లక్సెట్టిపేట

ఎవరొచ్చిన.. ఏం చేస్తరు?
ఏళ్ల తరబడి ఎందరో నాయకులు వస్తున్నారు. వాళ్లు ఎవరికి ఏం చేస్తున్నారు. పేదవారు, రైతులు అలాగే ఉన్నారు. నాయకులు మారుతున్నారు కానీ అభివృద్ధి జరగడం లేదు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.    – సత్తయ్య, సూరారం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top