బతికున్న పసికందు ఖననానికి యత్నం | parents triying to bury child alive | Sakshi
Sakshi News home page

బతికున్న పసికందు ఖననానికి యత్నం

Feb 13 2015 2:25 AM | Updated on Sep 2 2017 9:12 PM

కన్నబిడ్డ మరణించిందని నమ్మించి... ఖననం చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నించి తమ కఠినత్వాన్ని చాటుకున్నారు.

హైదరాబాద్ సిటీ : కన్నబిడ్డ మరణించిందని నమ్మించి... ఖననం చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నించి తమ కఠినత్వాన్ని చాటుకున్నారు. మరోవైపు పసిగుడ్డు ప్రాణాలతో ఉందని గుర్తించిన ఓ వ్యక్తి చివరి క్షణాల్లో చిన్నారిని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నాడు. శ్మశాన వాటిక నుంచి బిడ్డను వెనక్కి తీసుకెళ్లి అమ్మ ఒడికి చేర్చే ప్రయత్నం చేశాడు. హృదయాలు కదిలించే ఈ సంఘటన గురువారం హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఇన్‌స్పెక్టర్ ఎస్.రవీంద్ర కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా గండీడ్ మండలంలోని రంగారెడ్డిపల్లికి చెందిన వెంకటేష్, మల్లిక దంపతులు. మల్లిక మూడు రోజుల క్రితం స్థానిక ఆస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బిడ్డ బరువు తక్కువగా ఉండడం.. అనారోగ్యం కారణంగా మెరుగైన చికిత్స కోసం నీలోఫర్ ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు ఆ దంపతులకు సూచించారు. దీంతో వారు ఈ నెల 11న నీలోఫర్‌కు శిశువును తీసుకువెళ్లారు. అదే సమయంలో సీతాఫల్ మండికి చెందిన ఓ దంపతుల మగబిడ్డ మృతిచెందాడు. ఆ చిన్నారి మృతదేహాన్ని ఖననం చేయడానికి హబీబ్ అనే ఆటో డ్రైవర్‌కు ఆస్పత్రి సిబ్బంది అప్పగించారు.
ఈ తతంగాన్ని గమనిస్తున్న వెంకటేష్, మల్లిక దంపతులు తమ బిడ్డ చనిపోతుందనుకున్నారో... భారమవుతుందనుకున్నారో... వెంటనే పాప చనిపోయిందంటూ ఆటో డ్రైవర్‌కు అప్పగించారు. వారిని తీసుకొని హబీబ్ సమీపంలోని దేవుని కుంట శ్మశాన వాటికకు వెళ్లాడు. తొలుత మృతి చెందిన బిడ్డను ఖననం చేసి... పాపను కూడా ఖననం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పసికందు కదలడంతో అతను ఉలిక్కిపడ్డాడు. పాప బతికే ఉందని గుర్తించి హుమాయూన్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు శిశువుతో పాటు ఆటోడ్రైవర్ ను తీసుకొని నీలోఫర్ ఆస్పత్రికి వెళ్లారు. బిడ్డకు చికిత్స అందించాలని ఆస్పత్రి వైద్యులను కోరారు. శిశువు వివరాలు ఆరా తీయగా తల్లిదండ్రులు వెంకటేష్, మల్లికగా తేలింది. వారి కోసం ప్రయత్నిస్తున్నామని, కేసు దర్యాప్తు ప్రారంభించామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement