అతివలకే అందలం..

The Pandipalli villagers are putting parties in panchayat elections - Sakshi

సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులంతా మహిళలే 

ఆదర్శంగా నిలిచిన సంగారెడ్డి జిల్లా నర్సాపూర్‌ గ్రామం 

నారాయణఖేడ్‌: ఆ ఊరువారంతా ఐక్యంగా నిలిచారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీలను పక్కన పెట్టారు. గ్రామంలో మహిళా ఓటర్లు అధికంగా ఉండటంతో వారికే పెద్దపీట వేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌తోపాటు, వార్డు సభ్యులందరినీ మహిళలనే ఏకగ్రీవం చేయాలని నిశ్చయించారు. అనుకున్న ప్రకారం ఆదివారం నామినేషన్ల చివరి రోజు మహిళలతో నామినేషన్‌ వేయించారు. సంగారెడ్డి జిల్లాలో ఈ ఆదర్శగ్రామం ఉంది. జిల్లాలోని నారాయణఖేడ్‌ మండలం నర్సాపూర్‌లో మొత్తం ఎనిమిది వార్డులు ఉన్నాయి. మొత్తం 397 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళలు 211, పురుషులు 186 మంది ఉన్నారు.  

ఎన్నికల కమిషన్‌ గ్రామంలో సర్పంచ్‌ స్థానాన్ని బీసీ జనరల్‌కు రిజర్వ్‌ చేసింది. ఈ నేపథ్యంలో సర్పంచ్‌గా గోసాయిపల్లి నాగమ్మను ఎంపికచేశారు. ఉప సర్పం చ్‌గా పుప్పాళ్ల సాయమ్మను (ఎస్సీ మహిళ), వార్డు సభ్యులుగా యొంబరి కంశమ్మ, చాకలి జయశ్రీ, శేరి సావిత్రి, అవుటి సంగమ్మ, పాంపాడ్‌ భూమమ్మ, మొల్ల మున్నీబీ, నీరుడి బాలమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానించారు. ఆదివారం గ్రామస్తులంతా పార్టీలకు అతీతంగా బాజాభజంత్రీలతో వచ్చి మహిళలతో నామినేషన్లు దాఖలు చేయించారు. గ్రామస్తులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అభినందించారు. గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎంపికచేసిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను ఘనంగా సత్కరించారు. 

పైడిపల్లి..  నర్సాపూర్‌.. 
నారాయణఖేడ్‌ మండలం పైడిపల్లి గ్రామస్తులు 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ నుంచి మొదలు ఉప సర్పంచ్, వార్డు స్థానాలవరకు అందరినీ ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నారు. వీరి ఎంపిక అప్పట్లో రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం నర్సాపూర్‌వాసులు సైతం తమ నిర్ణయంతో ఆదర్శంగా నిలిచారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top