
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. రెవెన్యూ జిల్లాలు, మండలాల ప్రాతిపదికగా జెడ్పీలు, ఎంపీపీలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు కొత్త జిల్లాలు, మండలాల పరిధి ప్రాతిపదికగా జిల్లా ప్రజాపరిషత్‌లు, మండల ప్రజాపరిషత్‌లు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. జెడ్పీలు, ఎంపీపీల ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై 4, 5 తేదీల్లో ముగియనుంది. ఆలోగా ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా జెడ్పీలు, ఎంపీపీల పునర్విభజన పూర్తిచేయాలని ఆదేశించింది. ఫిబ్రవరి 25లోగా పునర్విభజన ప్రతిపాదనల ప్రక్రియ పూర్తిచేసి పంపించాలని కలెక్టర్లకు సూచించింది.
ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు ముఖ్యకార్యదర్శి సమాచారం పంపించారు. కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ జిల్లాలు, మండలాల ప్రాతిపదికన జడ్పీటీసీ, ఎంపీటీసీ నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణపై క్షేత్రస్థాయి పరిస్థితులు, సవివరమైన సమాచారాన్ని జిల్లా కలెక్టర్ల నుంచి తీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్‌కు సూచించారు. దీంతో కలెక్టర్లు పునర్విభజన ప్రక్రియను మొదలుపెట్టారు.
535 మండలాల్లో ప్రజాపరిషత్‌లు...
మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలకు సిద్ధం కావడంలో భాగంగా ప్రస్తుతం ఉన్న 585 గ్రామీణ రెవెన్యూ మండలాల్లో పట్టణ స్వరూపం ఉన్నవాటిని మినహాయించి 535 మండలాలకు ప్రజాపరిషత్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న 31 జిల్లాల్లో హైదరాబాద్‌ను మినహాయించి 30 జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా మరో రెండు జిల్లాలు, నాలుగు మండలాలు ఏర్పాటుకానున్న తరుణంలో వీటిని సైతం తుది జాబితాలో చేర్చే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల ప్రకారమే తొమ్మిది జిల్లా ప్రజాపరిషత్‌లు ఉన్నాయి. ఎంపీపీలు కూడా పాత మండలాల సంఖ్య ప్రకారమే ఉన్నాయి. జూలై 5వ తేదీతో వీటి కాలపరిమితి పూర్తికానుంది. దీంతో కొత్తగా ఏర్పడిన, పునర్ వ్యవస్థీకరించిన 30 జిల్లాలు, మండలాల ప్రాతిపదికన జిల్లా, మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల గ్రామపంచాయతీలకు అమలు చేసినట్టుగానే రెండుసార్లు ఒకే రిజర్వేషన్ అమలయ్యేలా జిల్లా, మండల ప్రజాపరిషత్‌లకు రిజర్వేషన్ల విధానం ఖరారు చేయనున్నారు.