
సీఎస్ నుంచి గ్రామ కార్యదర్శి వరకు ఏర్పాట్లలో నిమగ్నం
జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
రిజర్వేషన్లు, బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బూత్‌లు తదితరాలపై సూచనలు
బీసీ రిజర్వేషన్లపై కసరత్తు షురూ.. ఓటర్ల జాబితాలపై కులాలవారీగా మార్కింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంత వీలుంటే అంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే దిశలో వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ కార్యదర్శి వరకు అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.
ఎన్నికల తేదీలను ప్రభుత్వం ఏ క్షణంలో ఖరారు చేసినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని, ఈ మేరకు యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ కె. రామకృష్ణారావు ఆదివారం ఇచ్చిన ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, గ్రామ కార్యదర్శులందరూ తాము నిర్వహించాల్సిన బాధ్యతల్లో మునిగిపోయారు. ఒకట్రెండు రోజుల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో విడుదలవుతుందని, ఆ తర్వాత వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తోంది.
రెండు రోజుల్లో కులాల మార్కింగ్ పూర్తి
సీఎస్ ఆదివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిజర్వేషన్ల ఖరారు, బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బూత్‌లు, ఇతర అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని శనివారం రాత్రే కలెక్టర్లను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ సృజన ఆదేశించారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత నాలుగు రోజుల్లోనే రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
పంచాయతీ కార్యదర్శులు వార్డుల వారీ ఓటర్ల జాబితాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ కులాలను మార్క్ చేసుకునేలా జిల్లా పంచాయతీ అధికారుల (డీపీవో)ను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా ఆదివారం అన్ని జిల్లాల్లో్ల పంచాయతీ కార్యదర్శులు వార్డుల వారీగా ఓటర్ల జాబితాలపై కులాల వారీగా మార్కింగ్ మొదలుపెట్టారు. రెండురోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తికావొచ్చునని అధికారుల ద్వారా తెలిసింది. అయితే ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసేందుకు కనీసం వారం, పదిరోజులు పట్టొచ్చుననే అభిప్రాయంతోనూ కలెక్టర్లు ఉన్నట్టు తెలుస్తోంది.
తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు!
రాజకీయ పార్టీల గుర్తులపై జరిపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే మొదట జరిగే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం చర్చనీయాంశమైనందున దాని ద్వారా ఈ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చునని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తుండటమే ఇందుకు కారణం. ఇవి ముగిశాక కొన్ని రోజుల అంతరంతో అంటే 2, 3 వారాల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచుతూ జీవో జారీ తదితర అంశాలపై 2,3 రోజుల్లోనే జరిగే సీఎం, మంత్రుల సమావేశంలో అధికారిక నిర్ణయం వెలువడవచ్చుననే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది.