నిరుద్యోగుల్ని ముంచిన కేసీఆర్‌ను ఓడిద్దాం

OU student JAC leaders fires on KCR - Sakshi

     ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు 

     10న విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన సభ

హైదరాబాద్‌: విద్యార్థులు, నిరుద్యోగులను నిండా ముంచిన సీఎం కేసీఆర్‌ను రానున్న ఎన్నికల్లో ఓడిద్దామని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు అన్నారు. శనివారం ఉస్మానియా వర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్‌ చైర్మన్‌ చనగాని దయాకర్‌గౌడ్‌ మాట్లాడుతూ, నాలుగున్నరేళ్ల పాలనలో నిరుద్యోగులను కేసీఆర్‌ మోసం చేశారని ధ్వజమెత్తారు. నవంబర్‌ 10న ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట లక్ష మంది విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులతో మహాగర్జన సభను జరుపుతామన్నారు. కేసీఆర్‌ను గద్దెదించేందుకు ఓయూ విద్యార్థులు గ్రామగ్రామాన ప్రచారం చేయనున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజా వ్యతిరేక, నియంతృత్వ పాలన సాగించిన కేసీఆర్‌ సచివాలయంలో అడుగుపెట్టకుండా ఫామ్‌హౌజ్, ప్రగతి భవన్‌కు పరిమితమయ్యారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ ఇంతకాలం అధికారంలో ఉన్నా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి కింద రూ.3,016 ప్రకటించడం హాస్యాస్పదమని విద్యార్థి నాయకులు రంజిత్‌ అన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఓయూలో సభ నిర్వహించాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు ఆర్‌ఎన్‌ శంకర్‌ సవాల్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌‡ పాలనలో ఉద్యోగాలు రాక 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పటికైన∙రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యార్థి జేఏసీ నేత ఆర్‌ఎల్‌ మూర్తి డిమాండ్‌ చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాల్లో ఒక్క జిల్లాకు కూడా అమరుల పేరు పెట్టకుండా అవమానించారని విద్యార్థి జేఏసీ నాయకులు నాగేశ్వర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో కృష్ణమాదిగ, కాంపెల్లి శ్రీనివాస్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top