ఆన్లైన్ అయ్యోరు!

online pandith services for home Ceremonys - Sakshi

శుభకార్యాలకు ‘ఆన్‌లైన్‌ పండిత్‌ సర్వీస్‌’

అయ్యగారు కావాలంటే.. ‘పూజలు.కామ్‌’   

బుక్‌ చేసుకుంటే సేవలు మీ దరికి..

దేశ విదేశాల్లోని వారికీ అందుబాటులో..  

మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం తలపెట్టారా.. సమయానికి పురోహితుడు అందుబాటులో లేరా.. అయితే ‘పండిత్‌ పూజలు సర్వీసెస్‌’ సంస్థను ఆన్‌లైన్‌లో సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ముహుర్తాలు పెట్టడానికి.. ఇతర శుభ కార్యాలు జరిపించాలంటే  ‘అయ్యగారి’దే ప్రధాన భూమిక. ప్రత్యేక పూజలు, హోమాలు ఇతరత్రా పూజలు చేయించుకోవాలని అనుకునేవారు
ఆన్‌లైన్‌లో సంప్రదిస్తే చాలు మీ పని ఇట్టే అయిపోతుందంటున్నారు ‘పూజలు.కామ్‌’ వెబ్‌ రూపకర్త రవికుమార్‌ శర్మ పెండ్యాల. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశ విదేశాలకూ సేవలు
విస్తరించారు.

కుత్బుల్లాపూర్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కాకినాడకు చెందిన రవికుమార్‌ శర్మ పెండ్యాల హైదరాబాద్‌ కేంద్రంగా ‘పూజలు.కామ్‌’ వెబ్‌ ద్వారా పౌరహిత్య సేవలను అందిస్తున్నారు. వివిధ పూజలకు పండితులను వెబ్‌ ద్వారా అరేంజ్‌ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు పొందిన ఈ సంస్థ 2014 నుంచి దాదాపు 500 మంది పురోహితులను అందుబాటులో ఉంచింది. ప్రత్యేక పర్వదినాల సందర్భాల్లో వివిధ ప్రాంతాల్లో పూజలు నిర్వహించాలనుకునే వారు ముందుగా ఈ సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు.  

సోషల్‌ మీడియా ద్వారా క్రతువులు..
వివిధ దేశాలలో పండితులు అందుబాటులో ఉన్నా.. కొన్ని ప్రాంతాలలో మాత్రం పూజారులు అందుబాటులో ఉండరు. దీనికి పరిష్కారంగా పూజలు. కామ్‌ వారు వెబ్‌ క్యామ్‌ల ద్వారా పూజలు నిర్వహిస్తారు. ఎక్కువగా ముస్లిం దేశాల్లో ఈ విధానం పాటిస్తున్నారు. పూజలు నిర్వహించుకునే వారు వెబ్‌ క్యామ్‌లో పండితులు వేదామంత్రాలు పఠిస్తూ సూచనలు చేస్తారు. వీటిని ఫాలో అవుతూ పూజా కార్యక్రమాలు పూర్తి చేస్తారు క్లయింట్స్‌.  

అందరికీ అందుబాటులో పూజారులు..  
పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో వేదపండితుల కొరత ఉంది. ఈ నేపథ్యంలో శాస్త్రం తెలిసిన పండితులు దొరకడం కష్టంగా మారింది. ఈ సమస్య పరిష్కారానికి పూజలు.కామ్‌ వెబ్‌ను ప్రారంభించాం. సోషల్‌ మీడియా వేదికగా పూజలు చేయిస్తాం.    – రవికుమార్‌ శర్మ పెండ్యాల, పూజలు.కామ్‌ వ్యవస్థాపకుడు  

అంతా ఆన్‌లైన్‌ బుకింగ్‌..
వేద పండితులను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో స్టాండర్డ్, ప్రీమియం వంటి ఆప్షన్‌లుంటాయి. ఏ పూజకు ఎంత దక్షిణ ఇచ్చుకోవాలి, ఒకవేళ పూజా సామగ్రితో పంతులు కావాలంటే ఇందుకు సైతం ఆప్షన్‌లుంటాయి. తెలుగు పంతుళ్లు మాత్రమే కాదు ఉత్తర భారతీయుల కోసం హిందీ పండిత్‌లు కూడా ఈ వెబ్‌లో అందుబాటులో ఉన్నారు. అంతేకాకుండా ప్రత్యేకించి బ్రాహ్మణుల ఇంట పూజాది కార్యక్రమాలకు వేద పండితులతో పాటు క్యాటరింగ్‌ సేవలూ అందుబాటులో ఉన్నాయి.   

సంప్రదాయబద్ధంగా గృహ ప్రవేశం..    
మేం తెలుగు వాళ్లం. మస్కట్‌లో స్థిరపడ్డాం. ఇక్కడ కొత్త ఇల్లు తీసుకున్నాం. ఈ తరుణంలో పూజలు.కామ్‌ వెబ్‌ ద్వారా సోషల్‌ మీడియా వేదికగా గృహ ప్రవేశం, సత్యనారాయణ స్వామి  వ్రతం చేయించుకున్నాం. శాస్త్ర ప్రకారం మా గృహప్రవేశం జరిగింది.       – సుస్మిత, మస్కట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top