
చాదర్‌ఘాట్: ఉల్లి ఘాటు నెల రోజులపాటు భరించవలసిందేనని, అయితే ధరలు అదుపులో ఉన్నాయని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అనంతయ్య తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యాపారులపై నిఘా ఏర్పాటు చేశామని, కర్నాటక, మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి తక్కువ రావటం వల్ల ఉల్లి ధర క్వింటాకు రూ.3,300 ఉందని వివరించారు. కొత్తపంట సెప్టెంబర్ నెల చివరికి వస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి దిగుమతి మొదలైతే మరల తిరిగి రూ.8, 10, 12 లకు కేజీ ఉల్లి విక్రయాలు ఇప్పుడు రోజుకు 15 వేల బస్తాలు మాత్రమే దిగుమతి అవుతుందని తెలిపారు. హోల్‌సేల్‌గా 10 కేజీలకు రూ.280 ఉండగా, రిటైల్‌గా కేజీ రూ.35 చొప్పున అమ్మకాలు జరుగుతున్నట్లు వివరించారు. ఉల్లి ధరలు విపరీతంగా పెరిగితే రైతు బజార్ లో ప్రభుత్వ అనుమతి తో ఉల్లి కౌంటర్లు ఏర్పాటు చేసి ధరలు అదుపులోకి తెస్తామన్నారు.