కుక్కలను చూసి పులులు అనుకుని..!

Officials Frightened By The Dogs - Sakshi

బీ-థర్మల్‌ కోల్‌యార్డులో ఆందోళన

చుట్టుముట్టిన అధికార యంత్రాంగం

తీరా చూశాక కుక్కలుగా గుర్తింపు

రామగుండం : కుక్కలను పులులుగా భావించి.. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి.. తీరా వాటి అరుపులు విని అవాక్కయిన ఘటన బుధవారం రామగుండం బీ-థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రతిరోజూ ఉదయం 3 గంటల ప్రాంతంలో బీ-థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని కోల్‌యార్డులో బొగ్గును బంకర్‌లోకి పంపిస్తారు.

కోల్‌యార్డు పూర్తి చీకటిగా ఉండడంతో బొగ్గుకుప్ప వద్ద రెండు జంతువులు ఉన్నట్లు ఆపరేటర్‌ గుర్తించాడు. వాటిని పులులుగా భావించి.. కోల్‌యార్డు ఉద్యోగులు బీ-థర్మల్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం చేరవేశాడు. బీ-థర్మల్‌ భద్రతా సిబ్బంది, ఇంజినీర్లు స్థానిక పోలీసులు, ఫారెస్టు, ఫైర్‌ సిబ్బంది అందరూ అక్కడకు చేరుకున్నారు.

ఉద్యోగులు, కార్మికులు సైతం పరుగున వచ్చారు. అధికారులు ఫ్లడ్‌లైట్లను అమర్చడంతో బొగ్గు కుప్పలు మెరుస్తూ కనిపించాయి. వాటిపైనున్న రెండు జంతువులు ఎంతకూ కదలలేదు. రాళ్లతో కొట్టడంతో భౌభౌ మంటూ అక్కడినుంచి పరుగుపెట్టాయి. అధికారులు ఒక్కసారిగా అవాక్కయి.. నవ్వుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top