ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం ఆసక్తి కనబరిచిన యువత, పట్టణ ప్రాంత ప్రజలు.. ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం ఆసక్తి కనబరిచిన యువత, పట్టణ ప్రాంత ప్రజలు.. ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. యువత, ఉద్యోగస్తులు, ఉన్నతవర్గాల్లో ఓటేయాలనే స్పృహ తక్కువగా ఉంటోంది. దీన్ని చక్కదిద్దేందుకు ఎన్నికల కమిషన్, జిల్లా అధికారులు నడుంబిగించారు. అర్హులందరికీఓటుహక్కు కల్పించేందుకు నిన్నటి వరకూ అవిశ్రాంతంగా కృషి చేసిన అధికారులు ఇప్పుడు ఓటరును పోలింగ్ బూత్ వరకూ నడిపించేందుకు కంకణం కట్టుకున్నారు. జిల్లాలో కనీసం 80శాతం పోలింగ్ లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు.
ఎన్నికలు ముగిసే వరకూ విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఓటింగ్ శాతం మరీ తక్కువగా ఉంటున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఓటర్లందరూ తమ ఓటుహక్కును వినియోగించుకునే దిశగా కలెక్టర్ నేతృత్వంలోని యంత్రాంగం శ్రమిస్తోంది. సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్(సీప్) పేరుతో దేశవ్యాప్తంగా ప్రతి ఓటరూ తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ ఎన్నికల కమిషన్ సరికొత్త విస్తృత అవగాహన కార్యక్రమానికి తొలిసారిగా శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు పశుసంవర్ధక శాఖ జేడీ అనంతంను నోడల్ అధికారిగా కలెక్టర్ నియమించారు.
ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు ఈసీ నియమించిన పరిశీలకుడు నిధిపాండే ఈ నెల 27న జిల్లాకు రానున్నారు. విస్తృత అవగాహన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి జిల్లాలో ఓటింగ్ శాతాన్ని గతం కంటే గణనీయంగా పెంచాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కార్యక్రమం విజయవంతమవ్వాలని కలెక్టర్, జిల్లా ప్రధాన ఎన్నికల ప్రధానాధికారి బి. శ్రీధర్ అధికారులను ఆదేశించారు.
భిన్న రీతుల్లో ప్రచారం
ఓటరు జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలనే లక్ష్యంతో అధికారులు ‘సీప్’ కార్యక్రమం కింద విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పెద్దఎత్తున ప్రచార సామగ్రిని కూడా సిద్ధం చేశారు. కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, బ్యానర్లు,ఫ్లెక్సీల ద్వారా జిల్లావ్యాప్తంగా ప్రచారం కల్పించనున్నారు. ఈ పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లను జిల్లా కలెక్టర్ ఆదివారం విడుదల చేశారు. సోమవారం నుంచి అన్ని మండలాలకు వీటిని పంపిణీ చేయనున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, రద్దీ ప్రాంతల్లో కరపత్రాల పంపిణీతో పాటు పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. పాఠశాలల్లో పిల్లలకు కరపత్రాలు పంపిణీ చేసి ఓటు వేయాలని వారి తల్లిదండ్రులను కోరాల్సిందిగా విద్యార్థులకు సూచిస్తారు. గ్రామాల్లో ప్రత్యేక కళాబృందాల ద్వారా ఓటుహక్కు సద్వినియోగంపై ప్రచారం కల్పించనున్నారు. ఇందుకోసం పలు కళాబృందాలను సిద్ధం చేస్తున్నారు.
అత్యల్ప ఓటింగ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
గత కొన్ని ఎన్నికలలో జిల్లావ్యాప్తంగా అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదవుతున్న ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అధికారులు స్వయంగా పర్యటించి పోలింగ్ శాతం తక్కువగా ఉండడానికి గల కారణాలను అన్వేషించి పరిష్కారం కనుగొంటారు. ఈసీ పరిశీలకుడు నిధిపాండే కూడా ఈ నెల 27నుంచి వారం రోజులపాటు ఈ ప్రాంతాల్లో పర్యటిస్తారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చితే ఈ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎందుకు తక్కువగా ఉన్నదన్న కారణాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గతం కంటే ఎక్కువమంది ఓటర్లు ఈసారి తమ ఓటును వినియోగించుకునేందుకు ఏం చేయాలనే దానిపై విశ్లేషించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని నోడల్ అధికారి అనంతం వివరించారు.
ప్రలోభాలపై కొరడా
ఓటుహక్కును వినియోగించుకోవడమే కాకుం డా రాజకీయల పార్టీల ప్రలోభాలకు లోనై ఓటుహక్కును దుర్వినియోగం చేసుకోవడాన్ని నియంత్రించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మద్యం, డబ్బు, ఆకర్షణీయ వస్తువుల కు ఆశపడి విలువైన ఓటు వృథా చేసుకోవద్దంటూ ఓటర్లకు నచ్చజెప్పనున్నారు. అటువం టి ప్రలోభాలను ఎరగా వేస్తున్న నాయకులపై కూడా నిఘా ఉంచి ఈ దుస్సంప్రదాయానికి అడ్డుకుట్ట వేసేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఓట్లు పొందేందుకు అక్రమ మార్గాల ను పాటిస్తున్న అభ్యర్థులపై ఫిర్యాదుచేస్తే చర్య లు తీసుకుంటామని కలెక్టర్, ఎన్నికల ప్రధానాధికారి శ్రీధర్ కూడా స్పష్టం చేస్తున్నారు.