ఓసీపీ–2 వెనుకంజ 

OCP-2 Mine In The Ramagundam Area Is Falling Behind In Coal Production - Sakshi

సాక్షి, రామగిరి(పెద్దపల్లి జిల్లా) : రామగుండం–3 ఏరియా పరిధిలోని ఓసీపీ–2 గని బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడుతోంది. ఈ యేడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు రెండు నెలల్లో మాత్రమే ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. మే నెలలో 2.70లక్షల టన్నుల లక్ష్యానికి 2.74 లక్షల టన్నులు సాధించి 102 శాతం, జూన్‌లో 2.05 లక్షల టన్నుల లక్ష్యానికి 2.53 లక్షల టన్నులు సాధించి 123 శాతం ఉత్పత్తి నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం జనవరిలో 2.0 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి 2.28లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 114శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. ఈయేడాది జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు వరుసగా మూడు నెలల్లో ఓసీపీ2 యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించలేదు. ఈ క్రమంలో ఈ యేడాది నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. కానీ ఇదే ఏరియా పరిధిలోని ఓసీపీ–1లో అధికారులు యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తున్నారు.  

వర్షాల వల్ల ఉత్పత్తికి ఆటంకం 
మూడు నెలలుగా వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ఓసీపీ–2లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో 260 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈయేడాది సెప్టెంబర్‌లో 405 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీని వల్ల నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించలేకపోయాం. ఓసీపీ–1 పురాతన ప్రాజెక్ట్‌. వర్షపునీళ్లు లోతులోకి వెళ్లి పోవడంతో పాటు రోడ్లు చాలా కండీషన్‌గా ఉండడం వల్ల బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతోంది. ఈ నెల నుంచి ఓసీపీ–2లో యాజమాన్యం నిర్దేశించిన లక్ష్యాన్ని మించి ఉత్పత్తి సాధిస్తాం.  
– కె.సూర్యనారాయణ, జీఎం, ఆర్జీ–3 

ఉత్పత్తి వివరాలు ఇలా..

నెల లక్ష్యం (లక్షల టన్నుల్లో) సాధించినది(లక్షల టన్నుల్లో) శాతం
జనవరి 2.00  2.28  114
ఫిబ్రవరి 2.25  1.68  75 
మార్చి 2.25 2.15  96
ఏప్రిల్‌  2.70 2.34 87
మే 2.70 2.74 102 
జూన్‌ 2.05 2.53  123
జూలై 2.05 1.77 86
ఆగస్టు 2.05 0.86 42
సెప్టెంబర్‌ 2.05 1.46 71
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top