మున్సిపాలిటీలకు నిధుల కొరత లేదు

No Shortage oF Funds For Municipalities Says KTR - Sakshi

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌

నిర్లక్ష్యంగా ఉండే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పదవి కోల్పోతారు

బయ్యారంలో ఉక్కు కర్మాగారం సాధిస్తాం

సంక్షేమ ఫలాలు పేదలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

ఖమ్మం, ఇల్లెందు పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి

సాక్షి, ఖమ్మం : రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు నిధుల కొరత ఉండబోదని, ప్రభుత్వం నుంచి ప్రతి నెలా దామాషా ప్రకారం నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి జిల్లా ఇల్లెందు పట్టణాల్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేటీఆర్‌ మాట్లాడుతూ, పురపాలక చట్టం ప్రజలకు ఉపయోగపడడంతో పాటు తప్పు జరిగితే అదేరీతిలో శిక్షించే విధంగా ఉందని, ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రతినిధులు నిరంతరం శ్రమించాలని కోరారు. హరితహారం, పారిశుధ్యంపై కౌన్సిలర్లు, కార్పొరేటర్లు నిర్లక్ష్యం వహిస్తే పదవులు కోల్పోవడం ఖాయమని, ఇది తాను బెదిరించడానికి చెప్పడం లేదని, చట్టం గురించి వివరిస్తున్నాని మంత్రి స్పష్టం చేశారు.

ఖమ్మం నగరాన్ని ప్లాస్టిక్‌ రహిత నగరంగా తీర్చి దిద్దాలని, బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా నియంత్రించేందుకు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజల అవసరాల కోసం మరుగుదొడ్లను నిర్మించాలని అన్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఇందుకు ఇటీవల జరిగిన అన్ని ఎన్నికలే నిదర్శనమన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ రాజకీయంగా జిల్లాలో ‘సైకిల్‌’ని పూర్తిగా తొక్కేసి ప్రజల కోసం నగరంలో సైకిల్‌ సవారి చేస్తున్నారని ప్రశంసించారు. 

‘బయ్యారం’ కోసం ఒత్తిడి
రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని, ఎలాగైనా దాన్ని సాధిస్తామని కేటీఆర్‌ చెప్పారు. గత ఏడాది కాలంలో అన్ని రకాల ఎన్నికలు పూర్తయ్యాయని, వచ్చే నాలుగేళ్లు అభివృద్ధిపైనే దృష్టి పెడతామన్నారు. సంక్షేమ ఫలాలు పేదలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్‌ ప్రతి పేదవాడి మనసు గెలుచుకున్నారని చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా అభివృద్ధికి బాటలు వేస్తూ అన్ని స్థాయిల అధికారులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తున్నారని తెలిపారు. ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో, వీధిని, వాడను, గ్రామాన్ని, పట్టణాన్ని అలాగే ఉంచాలని కోరారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినవారికి భారీగా జరిమానాలు విధించాలన్నారు.

ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినంత మాత్రాన లీడర్లు కారని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నవారే అసలైన నాయకులని అన్నారు. తన పర్యటన సందర్భంగా ఇల్లెందులో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేసినందున మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుకు మంత్రి కేటీఆర్‌ రూ.లక్ష జరిమానా విధిం చారు. మున్సిపల్‌ కమిషనర్‌కు జరిమానా మొత్తం చెల్లించకపోతే వసూలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్‌దేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్‌ కవిత, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విప్‌ రేగా కాంతా రావు, ఎమ్మెల్యేలు బానోత్‌ హరి ప్రియ, సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, భద్రాద్రి కలెక్టర్‌ ఎం.వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మా గోడు వినండి!
‘సింగరేణి సంస్థ వల్ల భూమి కోల్పోయాం.. ఉపాధి లేక, నష్టపరిహారం అందక కుటుంబం రోడ్డున పడింది. మాకు చనిపోయేందుకు అనుమతివ్వండి..’అంటూ కొందరు బాధితులు మంత్రి కేటీఆర్‌ సభలో గోడు వెళ్లబోసుకున్నారు. విషయం తెలుసుకున్న కొత్తగూడెం డీఎస్పీ ఎస్‌.ఎం.అలీ వారితో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. ఇల్లెందులో సింగరేణి ఓపెన్‌కాస్టు గని విస్తరణలో సుందర్‌లాల్‌ లోద్‌ కుటుంబం భూమి కోల్పోయింది. దీంతో ఆదివారం ఇల్లెందులో జరిగిన పట్టణ ప్రగతి బహిరంగసభకు హాజరైన మంత్రి కేటీఆర్‌ ఎదుట నిరసన తెలిపేందుకు పలువురు రైతులు వచ్చారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ను కలసిన బాధితులు సమస్యను విన్నవించగా, వారి సమస్య పరిష్కరించాలని కలెక్టర్‌ ఎం.వి.రెడ్డిని మంత్రి ఆదేశించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top